మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఆత్మహత్య చేసుకుంది. కేవలం అమ్మాయి మాత్రమే కాదు, ఆ కుటుంబమే బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని కలచివేస్తోంది. ఇంతకీ ఈ ఆత్మహత్యలకు కారణం తెలుసా?
ఖమ్మం జిల్లా త్రీ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఉంటున్న గోవిందమ్మకు ఇద్దరు కూతుళ్లు. ఒకమ్మాయి రాధిక వయసు 30 ఏళ్లు, రెండో అమ్మాయి రమ్య వయసు 28 ఏళ్లు. పేదరికం వల్ల అమ్మాయిల పెళ్లిళ్లు చేయలేకపోతోంది గోవిందమ్మ. భర్త ఏ పని చేయకపోవడంతో వాళ్ల ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయి.
ఇలాంటి టైమ్ లో రాధికకు ఓ సంబంధం వచ్చింది. ఎలాగైనా కూతురు పెళ్లి చేద్దామని భావించింది గోవిందమ్మ. అన్నింటికీ సరే అంది. తలతాకట్టు పెట్టయినా పెళ్లి చేద్దాం అనుకుంది. కానీ ఆఖరి నిమిషం వరకు ఎంత ప్రయత్నించినప్పటికీ డబ్బు పుట్టలేదు. మరోవైపు పెళ్లి గడువు దగ్గరకొచ్చింది.
దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో, పరువు పోతుందనే భయంతో కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారాన్ని కరిగించే రసాయం తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఒకేసారి కుటుంబంలో ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికుల్ని కలచివేసింది.