వైఎస్ఆర్, బాబు చేయలేని పని జగన్ చేస్తారా..?

పేదలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు. మన దేశంలో ఎక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ మొదలైనా.. అది పూర్తయ్యే సరికి సగానికి సగం మంది అక్కడి నుంచి వెళ్లిపోతారు. వైఎస్ఆర్ జమానాలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప…

పేదలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు. మన దేశంలో ఎక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ మొదలైనా.. అది పూర్తయ్యే సరికి సగానికి సగం మంది అక్కడి నుంచి వెళ్లిపోతారు. వైఎస్ఆర్ జమానాలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప పేరుతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చినా.. వాటిలో లబ్ధిదారులు 20 శాతానికి మించి కాపురముండలేదు. 

రాజీవ్ గృహకల్ప అపార్ట్ మెంట్లు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదనే చెప్పాలి. అయితే వైఎస్ హయాంలోనే జరిగిన విడతలవారీ భూ పంపిణీ.. గ్రామాల్లో పేదలకు భారీ లబ్ధి చేకూర్చింది. ఆ లోటుని ఇలా భర్తీ చేశారు దివంగతనేత వైఎస్ఆర్. 

ఇక ఎన్టీఆర్ గృహకల్ప అంటూ చంద్రబాబు భారీ ప్రాజెక్ట్ ని తలకెత్తుకోవడాన్ని అందరూ వింతగా చూశారు. అందరు అనుమానించినట్టుగానే చంద్రబాబు పేదల ఇళ్లలో కూడా కమీషన్లు కొట్టేసి చివరకు ఉత్తుత్తి గృహప్రవేశాల తర్వాత ఇళ్లకు తాళాలు వేశారు. 

షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో నిర్మించిన టిడ్కో ఇళ్ల నాణ్యత, సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఈ ఇళ్ల నిర్మాణం కోసం టీడీపీ ఎంపిక చేసుకున్న స్థలం కూడా ఊరికి ఆమడ దూరంలో ఉండటం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందనే ఆరోపణలున్నాయి. ఇళ్ల నిర్మాణం, వాటి కేటాయింపుల్లో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు.

ఇప్పుడు వైఎస్ జగన్ జమానా. రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుందని నవరత్నాల కార్యక్రమంలో భాగంగా హామీ ఇచ్చిన జగన్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపై ఆ పని మొదలు పెట్టారు. 

అంతేకాదు, స్థలాలతో పాటు.. ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 25 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలు కాబోతోంది. రెండో దశలో 12.7 లక్షల ఇళ్లు పూర్తి చేస్తారు. 

ఇలా వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలనేది జగన్ ప్రభుత్వ బృహత్తర ప్రణాళిక. 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ.. మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడం, వీటికి తోడు టిడ్కో ఇళ్ల వ్యవహారాన్ని కూడా పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి తలకు మించిన భారం. అయితే అన్నిటినీ ఓపికగా పూర్తి చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు సీఎం జగన్.

ప్రభుత్వం సేకరించిన ఇళ్ల స్థలాలపై అక్కడక్కడా విమర్శలు ఉన్నా కూడా.. నివాసయోగ్యమైన భూములు, జనావాసాలకు దగ్గరగా ఉన్న భూములనే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. అంటే తక్షణం ఇల్లు కట్టుకోకపోయినా.. భవిష్యత్తులో ఆయా స్థలాలకు మంచి రేటు వస్తుందన్నమాట.

ఇక నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటున్న జగన్ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో యథాతథంగా అమలైతే ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. శాశ్వత నివాసాలను అందుబాటులోకి తెచ్చిన జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు. 

గత పాలకుల హయాంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ.. ఇళ్ల నిర్మాణంలో ముందడుగేస్తున్న జగన్.. ప్రభుత్వం కట్టించే ఇళ్లు ఇలా కూడా ఉంటాయా అని ఇతర రాష్ట్రాలవారు చెప్పుకునేలా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ బృహత్ పథకానికి కౌంట్ డౌన్ మొదలైంది.

ఏపీలో 'జగనన్న జీవక్రాంతి' పథకం ప్రారంభం