ఆ దేశం కూడా అన్ని దేశాలతో పాటు కరోనా వైరస్ బారిన పడిన దేశమే. అది కూడా చైనాను కొంచెం ఆనుకుని ఉన్న దేశం. అభివృద్ది విషయంలో తలపండిన దేశాలే ఇప్పుడు కరోనాను ఎలా జయించాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఒక దేశం తన వద్ద కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రకటించింది. ఇప్పటి వరకూ కరోనాను జయించిన దేశంగా నిలుస్తోంది అది. అదే సౌత్ కొరియా!
ఈ తూర్పు ఆసియా దేశంలో కరోనా కేసులు ఒక దశలో విజృంభించినా, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అలాగే అక్కడ కరోనా బారిన పడిన వారిలో మరణాల రేటు కూడా తక్కువగా నమోదు అయ్యింది. ఇప్పుడు అక్కడ కరోనా వ్యాప్తి పూర్తిగా లేదనే దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం చూపు సౌత్ కొరియా మీద పడింది.
అటోమొబైల్స్ తో పాటు అనేక రంగాల అభివృద్ధిలో ముందుంటుంది సౌత్ కొరియా. ఈ దేశ ధిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు ప్రపంచమంతా విస్తరించాయి, తమ మార్కెట్ ను కలిగి ఉన్నాయి. అలా ప్రపంచానికి బాగా పరిచయం అయిన దక్షిణ కొరియా, ఇప్పుడు కరోనా పై విజయం సాధించిన తొలి దేశమని అంతర్జాతీయ మీడియా కూడా కొనియాడుతూ ఉంది.
ఈ నేపథ్యంలో తాము కరోనాను జయించిన వైనం గురించి ఆ దేశం స్పందిస్తూ ఉంది. క్వారెంటైన్ , పరీక్షల ద్వారానే కరోనాపై తాము పై చేయి సాధించినట్టుగా దక్షిణ కొరియా ప్రకటించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచం ఒక విషయంలో ఈ దేశం సాయం కోరుతోంది. కరోనాను నిర్ధారించడం విషయంలో సౌత్ కొరియా వద్ద పటిష్టమైన పరీక్షా యంత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. వాటి రూపకల్పన విషయంలో సాయం చేయాలని, కరోనా నిర్ధారణను వేగవంతంగా జరిపేందుకు సాయం చేయాలని సౌత్ కొరియాను పలుదేశాలు విన్నవిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్ ను కలిగి ఉన్న ఈ కొరియన్ కంట్రీ ఈ విషయంలో పెద్దమనసుతో స్పందించాలి, కరోనా నిర్ధారణ యంత్రాల విషయంలో తన ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.