వీధికెక్కిన ‘పోలిమేర’ గొడవలు

నిర్మాత గౌరీ కృష్ణ నిర్మించిన పొలిమేర వన్ సినిమా ఓటిటిలో వచ్చింది. జనం బాగా చూసారు. పొలిమేర 2 సినిమాను వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ కు తీసుకుని విడుదల చేసారు. మంచి పబ్లిసిటీ చేసారు.…

నిర్మాత గౌరీ కృష్ణ నిర్మించిన పొలిమేర వన్ సినిమా ఓటిటిలో వచ్చింది. జనం బాగా చూసారు. పొలిమేర 2 సినిమాను వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ కు తీసుకుని విడుదల చేసారు. మంచి పబ్లిసిటీ చేసారు. మంచి హిట్ అయింది. దాంతో మొదలైంది తకరారు. పోలిమేర 3 తీయాలని వంశీ నందిపాటి ప్రయత్నం. ఆ సినిమా తనది, మీరెలా తీస్తారు అంటూ నిర్మాత గౌరీకృష్ణ ప్రశ్న. హక్కులు మీరే మాకు ఇచ్చారు కదా అని వీళ్లు.. తానెక్కడ ఇచ్చాను, తను ఇచ్చిన ఖాళీ కాగితాల మీద మీరే రాసేసుకున్నారంటూ వాళ్లు.. ఇలా సాగుతూ వస్తోంది గొడవ.

ఇటీవల వంశీ నందిపాటి నిర్మాతగా పొలిమేర 3 ప్రాజెక్ట్ ప్రకటించడంతో, మొదటి రెండు భాగాలు నిర్మించిన గౌరీ కృష్ణ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతే కాదు సిపి కి కూడా ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ఈ ఫిర్యాదునే ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా అందించాలని అనుకుంటున్నారు.

ఇక్కడ ఎవరి వెర్షన్ వారిది వినిపిస్తోంది. సినిమా తనది అని, రెండో భాగం పంపిణీకి తీసుకుని లెక్కలు చెప్పలేదని, అందరూ పెద్ద వాళ్లు కావడంతో తానేమీ చేయలేపోతున్నానని నిర్మాత గౌరీ కృష్ణ అంటున్నారు. తను ఇచ్చిన డాక్యుమెంట్స్ ను మిస్ యూజ్ చేసి, సినిమా హక్కులు మొత్తం వారికి ఇచ్చేసినట్లు చెబుతునన్నారని ఆయన అంటున్నారు. పెద్దలతో పోరాటం తనకు కష్టమే అని, అయినా న్యాయం జరుగుతుందనే నమ్మకం వుందని ఆయన అన్నారు.

గౌరీకృష్ణ అబద్దం చెబుతున్నారని, ఛాంబర్ లో అందరి ముందు హక్కులు తమకు ఇస్తూ, చెప్పిన సంగతి పెద్దలు అందరికీ తెలుసు అని నిర్మాత వంశీ నందిపాటి అన్నారు. న్యాయం తమ వైపు వుందని, లీగల్ గా అన్నీ తమ దగ్గర వున్నాయని చెప్పారు. లీగల్ గా మొత్తం వ్యవహారం తమకు అనుకూలంగా వుందని, కావాలంటే రికార్డులు అన్నీ చూపిస్తానని వంశీ నందిపాటి చెప్పారు.

ఇదిలా వుంటే నిర్మాతల కౌన్సిల్ పెద్ద ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ విషయంలో న్యాయం వంశీ నందిపాటి వైపు వుందని అన్నారు. మిగిలిన సంగతులు తనకు తెలియవు కానీ, నిర్మాత గౌరీ కృష్ణ సినిమాతో తనకు ఏ సంబంధం లేదంటూ తమ ముందే కాగితం రాసి ఇచ్చారని అన్నారు.