Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: యాకూబ్‌ మెమన్‌ ఉరి - 4

యాకూబ్‌కు స్కిజోఫ్రేనియా వ్యాధి వుందని, డిప్రెషన్‌కు లోనవుతూంటాడనీ (డిప్రెషన్‌కు గురి కాని మనిషున్నాడా?), రోగపీడితుణ్ని ఉరి తీయడానికి చట్టాలు ఒప్పుకోవలని లాయర్లు, పౌరహక్కుల నేతలు వాదించారు. వారిలో రాజీవ్‌ హంతకురాలు నళిని తరఫున వాదించిన యుగ్‌ చౌధురీ ఒకరు. 'అవును, నాకు మానసిక వ్యాధి వుంది' అని యాకూబ్‌ సుప్రీం కోర్టుకి ఉత్తరం రాసుకున్నాడు కూడా. ఆ వ్యాధి వుండగానే జైలువాసంలోనే రెండు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు సంపాదించాడు మరి! అందునా తక్కువ తెలివితేటలు ప్రదర్శించాడా? ఎప్పటికప్పుడు కొత్త వాదనలతో రావడమనేది పెద్ద లాయర్లను పెట్టుకోగల ఘరానా నేరస్తులందరూ చేస్తారు. యాకూబ్‌ వాళ్ల కంటె ఎక్కువ తెలివికి పోయాడు. అతనికి ఉరిశిక్ష పడ్డాక అతని తరఫున అతని సోదరుడు సులేమాన్‌ 2013 ఆగస్టులో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. దాన్ని రాష్ట్రపతి 2014 ఏప్రిల్‌లో తిరస్కరించారు. ఇక ఉరికి అంతా సిద్ధమయ్యాక 2015 జులై 28న అప్పుడు యాకూబ్‌ మళ్లీ మెర్సీ పిటిషన్‌ పెట్టుకున్నాడు - క్షమాభిక్ష అడగాలన్నా, మానాలన్నా నియమాల ప్రకారం నాకే అధికారం వుంది, నా తరఫున అడగడానికి మా సోదరుడు ఎవరు? అది లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దాని మీద బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి' అని. అంటే రెడ్డొచ్చె మొదలాడె అన్నట్లు మొత్తం ప్రాసెస్‌ను మళ్లీ మొదలుపెట్టించి తన జీవితాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం కొనసాగించుకుందామని చూశాడన్న మాట. అయితే ఇతని వాదనను కోర్టు కొట్టి పారేసింది. 'నీ తరఫున నీ సోదరుడు పిటిషన్‌ పెడితే అప్పుడే ఎందుకు అభ్యంతర పెట్టలేదు? అతను పెట్టిన దాదాపు మూడేళ్లకు ఆ విషయం గుర్తు వచ్చిందా? నువ్వప్పుడు మౌనంగా వున్నావు కాబట్టి దాన్ని ఆమోదించినట్లే లెక్క' అన్నారు వాళ్లు. 

'నీ మీద కేసు పెట్టకుండా జస్ట్‌ విచారించి వదిలేస్తాం' అని మాట యిచ్చి యాకూబ్‌ను పోలీసులు ప్రలోభపెట్టి ఇండియాకు రప్పించారనీ, తర్వాత మాట తప్పారనీ, యిలా చేస్తే భారతదేశపు ప్రతిష్ఠ ఏమవుతుందని కొందరు వాపోతున్నారు. దీనిపై ఒకాయన చక్కటి పోలిక తెచ్చాడు. 'నా కొంప గుల్ల చేస్తున్న ఎలకను పట్టుకోవడానికి బోనులో పకోడీ పెట్టి ఆకర్షించాను. ఎలక వచ్చి పట్టుబడింది. 'నువ్వు నన్ను చంపడానికి వీల్లేదు, పకోడీ యిచ్చి పంపించాలి' అని ఎలక వాదనకు దిగితే ఎలా వుంటుంది?' అని అడిగాడు. స్టింగ్‌ ఆపరేషన్‌లో కూడా లంచం యిస్తామని ఆశ పెట్టి పోలీసులకు అప్పగిస్తారు. ఇది అన్యాయం, నాకు డబ్బిచ్చి పంపించాలి తప్ప అరెస్టు చేయించకూడదు అని లంచగొండి వాదనకు దిగితే...? 'పోలీసుల మాట వినే కుటుంబం వెనక్కి వచ్చిందంటున్నారు...' అని టాడా జడ్జిని అడిగితే ఆయన 'పాకిస్తాన్‌లో వాళ్ల పరిస్థితి ఏమిటో ఎవరికి తెలుసు? పాకిస్తానీ పోలీసులు హౌస్‌ అరెస్టులో పెడితే తప్పించుకుని వచ్చారేమో, యిక్కడకు వచ్చి అజ్ఞాతంగా వుండవచ్చని అనుకున్నారేమో. లొంగిపోదామని వచ్చేవాళ్లు రాయబార కార్యాలయం ద్వారా వస్తారు తప్ప దొంగదారుల్లో రారు' అని సమాధానం యిచ్చారు.

ఈ యాకూబ్‌ వ్యవహారంలో ఎప్పటిలాగా మేధావులు చాలా హంగామా చేశారు. 1970లలో ఓపిడిఆర్‌, పియుడిఆర్‌ వంటి పౌరహక్కుల సంస్థలంటే నాకు చాలా గౌరవం వుండేది. నకిలీ ఎన్‌కౌంటర్‌ల గురించి జస్టిస్‌ తార్కుండే వంటి వారు ఆందోళన చేసి నిజాలు వెలికితీస్తే అబ్బో అని మురిసిపోయేవాణ్ని. పోనుపోను యివన్నీ ప్రచ్ఛన్న నక్సలైట్‌ సంస్థలుగా మారిపోయాయి. నక్సలైట్లకు ఏదైనా యిబ్బంది కలిగితే రంగంలోకి దిగిపోయే వీళ్లు నక్సలైట్ల వలన ప్రాణాలు, అవయవాలు పోగొట్టుకున్న సామాన్య పౌరుల విషయంలో నోరెత్తకపోవడం నాకు విస్మయం కలిగిస్తూ వచ్చింది. 'నక్సలైట్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, ప్రభుత్వం నక్సలైట్ల ప్రాణాలు తీస్తోంది' అని సింపుల్‌గా తేల్చేస్తే వాళ్లు వూరుకోరు. సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా చేయవచ్చుట కానీ ప్రభుత వారిని ఏమీ చేయకూడదట. చేస్తే  ప్రతీకారేచ్ఛతో జరిగిన రాజ్యహింస అనాలిట. సామాన్య పౌరులకు శాంతిభద్రతలు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంది కదా, దానికి విఘాతం కలిగించేవారిని ఏం చేయాలిట? పౌరహక్కులు యిచ్చినది యీ ప్రజాస్వామ్యపు సమాజమే. ఆ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే మావోయిస్టులు ఆ సమాజం యిచ్చే పౌరహక్కులను వినియోగించుకుంటారు. నిజానికి వారు కోరుకునే సమాజమే ఏర్పడితే యీ పౌరహక్కులే లేకుండా పోతాయి. అంటే యీ సమాజం తనను నిర్మూలించాలని చూసేవారిని తనే రక్షిస్తూ వుండాలన్నమాట!

నక్సలైట్లు ఒక్కళ్లే కాదు, ఏ నేరస్తుడినైనా సరే అతని కులం పేరు చెప్పో, వర్గం పేరు చెప్పో మేధావులు, మీడియా వెనకేసుకుని వస్తారు. తమకున్న రచనాకౌశలంతో, పలుకుబడితో మీడియాలో వ్యాసాలు రాసి, ప్రసంగాలు యిచ్చి నిర్ణయాలు తీసుకునే వారిని ప్రభావితం చేయగలుగుతారు. ఇవన్నీ ఒక యెత్తు. అవసరమైతే వీళ్లు ఎంత కుటిలంగా వ్యవహరించగలరో యీ మధ్యే నాకు తెలిసింది. 1993లో చిలకలూరిపేటలో కొందరు దళితులు ఆర్టీసీ బస్సుని తగలబెడితే 23 మంది చనిపోయారు. అగ్రవర్ణాలు తమని హింసిస్తే దళితులు తిరగబడడం సహజం. కానీ యిలా బస్సు ప్రయాణీకుల ప్రాణాలు తీయడమేమిటి అని కోర్టు కూడా ఫీలైంది. 1995 మార్చిలో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధన్‌రావులకు ఉరిశిక్ష పడింది. సుప్రీం కోర్టు కూడా ఉరి ఖాయం చేసింది. ఇక దళిత, ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ యింటర్నేషనల్‌ రంగంలోకి దిగి రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం లాబీయింగ్‌ మొదలుపెట్టాయి. చచ్చిపోయిన 23 మంది గురించి ఏం ఆలోచించారో తెలియదు కానీ ఘాతుకం చేసినవారు దళితులు కాబట్టి ఉరి వేయకూడదని వీరి వాదన. రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ 1997 మార్చి 14 న రెండోసారి కూడా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. మార్చి 29 న తెల్లవారుఝామున 3 గంటలకు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉరిశిక్ష అమలు కావాలి. 

కొన్ని గంటల్లో ఉరి అమలవుతుందనగా ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవితో నలుగురు మానవహక్కుల నేతలు చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి శర్మను కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఏదో పని మీద బయటకు వెళ్లిన ఆయన రాత్రి 9 గం||లకు తిరిగి వచ్చారు. వీళ్లు రిక్వెస్టు విని ''ఇప్పటికే దీని మీద ఆలోచించి రెండుసార్లు తిరస్కరించాను. నేను చేసేదేమీ లేదు, వెళ్లి రండి'' అని ఆయన పంపేశారు. ఇక అందరూ నిరాశతో యిళ్లకు వెళ్లేందుకు కార్లు ఎక్కబోతూ వుండగా ఆ బృందంలోని ఒక మహిళా న్యాయవాదికి ఓ ఐడియా వచ్చింది - 'సుప్రీం కోర్టు జడ్జి యింటికి వెళ్లి రాష్ట్రపతి మన పిటిషన్‌ను సానుభూతితో పరిశీలిస్తామని చెప్పారని అబద్ధం ఆడదాం. విషయం పరిశీలనలో వుంది కాబట్టి ఉరిని ఒక్క వారం రోజులు వాయిదా వేయండి అని కోరదాం' అని. ఇలా అబద్ధం ఆడడం అనైతికం, అధర్మం అని ఆ మేధావుల్లో, ఆ హక్కుల నేతల్లో ఎవరికీ తోచలేదు. వెళ్లి రాత్రి 10 గంటలకు ఒక సుప్రీం కోర్టు జడ్జి యింటికి వెళ్లి అబద్ధం చెప్పేశారు. ఆయన 'నేను ఒక్కణ్నీ నిర్ణయం తీసుకోలేను, వేరే ఆయన కూడా వుంటే బాగుంటుంది' అన్నారు. అప్పుడు యీ బృందం మరో జడ్జి యింటికి వెళ్లి ఆయనకీ అబద్ధం చెప్పి బతిమాలి యీయన యింటికి తీసుకుని వచ్చారు. ఇద్దరూ కూర్చుని చర్చించుకుని రాష్ట్రపతి నిర్ణయం వెలువడేందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి ఏప్రిల్‌ 5 వరకు ఉరి తీయవద్దని ఆదేశాలు యిచ్చారు. అప్పుడు వీళ్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి యింటికి వెళ్లి ఆదేశాలు చూపించి, ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ హోం సెక్రటరీ ద్వారా తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకు చెప్పిస్తే ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులకు ఉరి ఆపమని అర్ధరాత్రి 12 గంటలకు చెప్పారు. 

ఉరి తీసే రోజు దగ్గరపడే సమయానికి ప్రధాని దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లలో రాష్ట్రపతి బిజీగా వున్నారు. అదే అదనుగా యీ బృందం సుప్రీం కోర్టు జడ్జిలను కలిసి ప్రస్తుతం రాష్ట్రపతి బిజీగా వున్నారు కాబట్టి ఉరిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని యింకో అబద్ధం ఆడి, మరో మూడు నెలలు వ్యవధి యిమ్మని కోరి సాధించుకున్నారు. ఆ గడువు ముగిసే సమయానికి శంకర్‌ దయాళ్‌ శర్మ పదవీకాలం ముగిసిపోయింది. కే ఆర్‌ నారాయణన్‌ రాష్ట్రపతి అయ్యారు. 'మీరు దళితులై వుండి దళితులకు క్షమాభిక్ష పెట్టకపోతే ఎలా?' అని వాదించి ఆయన చేత దాన్ని యావజ్జీవశిక్షగా మార్పించుకున్నారు. మేధావులు ఆడిన యీ అబద్ధం గురించి ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు కానీ దీనిలో కథానాయకుడు చలపతిరావు 'ఒక నేరస్థుడి ఆలోచనలు' పేరిట 900 పేజీల పుస్తకం రాసి దానిలో యిదంతా వివరించారు. ఆ పుస్తకంలోని యీ భాగాన్ని 2015 జనవరి 31 సంచికలో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 

అది చదివిన నాకు యీ మేధావులపై రోత పుట్టింది. గిరిజనుల, ఆదివాసీల హక్కుల గురించి పోరాడిన మహిళగా మహాశ్వేతాదేవిపై నాకున్న గౌరవం తుడిచిపెట్టుకు పోయింది. రెండు ప్రాణాలు నిలబెట్టడానికి యింత తాపత్రయ పడిన వీరు ఆ యిద్దరి చేతిలో దహనమై పోయిన 23 మంది ప్రాణాల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా అనిపించింది. వీళ్లవే ప్రాణాలా? వాళ్లవి కావా? దళితులు కాబట్టి వదిలేయాలి, మైనారిటీలు కాబట్టి వదిలేయాలి అని నువ్వు వందసార్లు కాదు, వెయ్యిసార్లు అడుగు, నీకా హక్కు వుంది. కానీ దానికోసం అబద్ధం ఆడతావా? నీ చదువు చూసి, నీ తెలివితేటలు చూసి సుప్రీం కోర్టు జడ్జిలు సైతం అర్ధరాత్రయినా, అపరాత్రయినా నిన్ను యింట్లోకి రానిస్తూ వుంటే, నీ మాటలకు విలువ యిస్తూ వుంటే నువ్వు అబద్ధం ఆడతావా? ఇంతకంటె ఘోరం వుందా? మెమన్‌ విషయంలో కూడా యిలాటి మేధావులు ఎన్ని మాయ ట్రిక్కులు వేశారో యిప్పటికైతే తెలియదు. ఎప్పటికైనా తెలుస్తుందో లేదో తెలియదు. (సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?