Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: 24

సినిమా రివ్యూ: 24

రివ్యూ: 24
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: స్టూడియో గ్రీన్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌
తారాగణం: సూర్య (త్రిపాత్రాభినయం), అజయ్‌, సమంత, నిత్య మీనన్‌, శరణ్య పొన్‌వణ్ణన్‌, గిరీష్‌ కర్నాడ్‌, సుధ్య, సత్యన్‌ తదితరులు
సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: తిరు
నిర్మాత: సూర్య
రచన, దర్శకత్వం: విక్రమ్‌ కె. కుమార్‌
విడుదల తేదీ: మే 6, 2016

అన్ని ఆలోచనలు సినిమాలు కాలేవు. ఆలోచనల్లోనే చిత్రంగా అనిపించే ఆలోచనలని చలనచిత్రంగా మలిచే చాకచక్యం అందరికీ ఉండదు. ఒక విచిత్రమైన ఆలోచనని ఒక మర్చిపోలేని దృశ్యకావ్యంగా మలిచి 'మనం'దరి చేత మన్ననలు అందుకున్న దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ ఇప్పుడు మరో అలాంటి చిన్న ఐడియాని ఇన్ని కోట్ల సినిమాగా మలిచాడు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 'ఒక రెండు క్షణాలు ఆలస్యంగా బయల్దేరి ఉంటే ఎలాగుండేదో', అనుకున్నది ఏదైనా తృటిలో చేజారినపుడు 'ఛ... కొన్ని క్షణాల పాటు కాలం వెనక్కి జరిగితే ఎంత బాగుంటుందో' అనుకోవడం మానవ సహజం. కానీ కాలాన్ని అదుపు చేయడం కానీ, దానిని వెనక్కో, ముందుకో జరపడం కానీ మానవమాత్రుల వల్ల కాదు. 'ఆ శక్తే మనిషికి ఉంటే' అనే చిన్న ఫాంటసీలోంచి పుట్టుకొచ్చిన కథే '24'. 

ఇలాంటి ఆలోచనతో ఏ దర్శకుడైనా ఓ హీరోని కలిస్తే ఆ ఐడియా ఎలాంటి సినిమాగా షేప్‌ తీసుకుంటుందనే అనుమానాలు కలగవచ్చు. కానీ 'మనం' తీసి చూపించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ సామర్ధ్యాన్ని ఎవరు అనుమానించగలరు? తనకి తానే ఒక స్థాయిని నిర్ధేశించుకుని, దానిని అందుకోవడానికి తపించే దర్శకులు ఎంత మంది ఉంటారు? విక్రమ్‌ కుమార్‌ ఒక జీనియస్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు... ఇందులోని హీరో మాదిరిగా కొత్త కొత్త ప్రయోగాలకి పూనుకునే ఒక సెల్యులాయిడ్‌ సైంటిస్ట్‌ అనిపిస్తాడు. ఈ తరహా కథని కాంప్లికేటెడ్‌గా తీస్తూ... ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా, క్రిస్టఫర్‌ నోలాన్‌ స్టయిల్లో తెరకెక్కించి పండిట్స్‌ ప్రశంసలు అందుకోవచ్చు. కానీ తన కాంప్లికేటెడ్‌ ఆలోచనల్ని సింప్లిఫై చేయడంలోనే విక్రమ్‌ కుమార్‌ అసలు ప్రతిభ దాగుంది. 'మనం' కథ ఎవరైనా మనకి చెప్తే... 'ఏంటేంటీ.. కమ్‌ అగైన్‌' అనేస్తాం. కానీ విక్రమ్‌ తీసిన సినిమా చూసిన తర్వాత ఇక దాంట్లో ఎలాంటి కాంప్లికేషన్లు, క్వశ్చన్లు లేవు. పామరులకి కూడా క్రిస్టల్‌ క్లియర్‌గా అదేంటన్నది అర్థమైంది. 

ఈసారి 'టైమ్‌ ట్రావెల్‌', 'టైమ్‌ ఫ్రీజ్‌' వంటి క్లిష్టమైన విషయాలని తీసుకున్నాడు. ఇలాంటివాటితో ఒక ఫక్తు ఇండియన్‌ సినిమా తీర్చిదిద్దడం అంత తేలికైన విషయమేం కాదు. అసలు 'సైన్స్‌ ఫిక్షన్‌' అనేదే మన జోనర్‌ కాదన్నట్టు మన దర్శకులు దానిని ఓవర్‌లుక్‌ చేస్తుంటారు. హాలీవుడ్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు తరచుగా వస్తూ ఉంటే చూసి, ఇలాంటివి వాళ్లకీ, వాళ్ల బడ్జెట్టులకీ, వాళ్ల బుర్రలకీ మాత్రమే సాధ్యమైన విషయాలన్నట్టు వాళ్లు తీసే సినిమాలు చూసి సంతోషపడి మన సినిమాలకి వచ్చే సరికి మేథస్సు స్థాయిని అమాంతం అధమ శ్రేణికి తెచ్చి పడేస్తుంటారు. లేదంటే ఎప్పుడో ముప్పయ్యేళ్ల క్రితం వచ్చిన 'ఆదిత్య 369' తర్వాత మనం ఎన్ని సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చూసి ఉంటాం? చిన్నదే అయినా పవర్‌ఫుల్‌ ఐడియాని రీజనబుల్‌ బడ్జెట్‌లో, ఇంత సింప్లిఫైడ్‌ పద్ధతిలో చెప్పడం విక్రమ్‌ కుమార్‌లాంటి అరుదైన దర్శకులకే సాధ్యం. 

'మనం'లో మాదిరిగా రొమాన్స్‌కి, సాంగ్స్‌కి కథలో చోటిచ్చే తరహా కథాంశం కాకపోవడం వల్ల '24' సినిమాని మెజారిటీ ప్రేక్షకులకి నచ్చే సినిమాగా మలిచే ప్రయత్నం ఒకింత అనుకున్న ఇంపాక్ట్‌ని తీసుకురాలేకపోయింది. ఈ తరహా చిత్రాల్లో హీరోయిన్‌, డ్యూయట్స్‌ ఇమడవు. అలా అని అవేమీ లేకుండా తీస్తే పూర్తిగా ప్రయోగాత్మక చిత్రమని కొట్టి పారేసే అవకాశముంది. అందుకే తన అసలు కథలోకి ఆ ప్రేమకి సంబంధించిన సబ్‌ ప్లాట్‌ చేర్చడానికి విక్రమ్‌కుమార్‌ కొంత రాజీ పడాల్సి వచ్చింది. మెయిన్‌ ప్లాట్‌ నుంచి డీవియేట్‌ అయి సూర్య, సమంత మధ్య సీన్లపై కాస్త సమయం వెచ్చించడం అందరికీ నచ్చకపోవచ్చు. ఆ రొమాన్స్‌ని కూడా తన కథకి పూర్తిగా సమాంతరంగా కాకుండా, కథలో భాగంగా ఉంచడానికి విక్రమ్‌ కుమార్‌ తపించాడు. కానీ ఆత్రేయ (విలన్‌ పాత్రలో సూర్య) పాత్ర తెరమీదకి వచ్చినప్పుడల్లా వచ్చే వైబ్రేషన్‌, ఆ పాత్రని చూస్తునప్పుడు చూపించే అటెన్షన్‌ని మ్యాచ్‌ చేయడంలో రొమాన్స్‌కి సంబంధించిన వ్యవహారం ఫెయిలైంది. 

సినిమా ఆరంభం, ఇంటర్వెల్‌కి ముందు ఒక పావుగంట, సెకండాఫ్‌ ఆరంభం, మళ్లీ ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ దృశ్యాలు కట్టి పడేస్తాయి. మధ్యలో వచ్చే సమంత ట్రాక్‌ మాత్రం విసిగిస్తుంది. అంటే అదంతా అస్సలు బాలేదని కాదు... మిగతాదంతా అంత బాగుందని! విక్రమ్‌ లాంటి ఆలోచనలున్న దర్శకులకి అవసరం లేని పాత్రలు, పాటలు పెట్టాల్సిన తప్పనిసరి ఆంక్షల కంచెలు లేకపోతే ఇంకెలాంటి అద్భుతాలని ఆవిష్కరిస్తారో మరి. హీరో కంటే విలన్‌ని ఇష్టపడడం, అతను తెరమీద ఎక్కువ సమయం కనిపించాలని కోరుకోవడం బహుశా ఇదే మొదటిసారేమో. ఇండియన్‌ స్క్రీన్‌పై ఒక ఐకానిక్‌ విలన్‌ క్యారెక్టర్‌గా ఆత్రేయ పాత్ర నిలిచిపోతుందంటే దానిని సృష్టించిన దర్శకుడికే కాదు... దానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సూర్యకి కూడా ఆ క్రెడిట్‌ దక్కుతుంది. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న విలన్‌ హీరోని ఏం చేస్తాడోననే భయం కలగాలంటే ఆ నటుడు ఎంతగా క్రూరత్వాన్ని అభినయించాలనేది ఊహకే అందదు. ఆత్రేయ పాత్రని అత్యద్భుతంగా పోషించి తన ప్రతిభకి ఎల్లల్లేవని సూర్య చాటుకున్నాడు. సమంత పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో బాగుంది. తన అభినయానికి కూడా వంక పెట్టలేం. అయితే తన పాత్రే ఈ కథకి పంటి కింది రాయిలా మారడం దురదృష్టకరం. నిత్యామీనన్‌ అతిథి పాత్రలో కనిపించింది. అజయ్‌ 'మోడరన్‌ కట్టప్ప' తరహా నమ్మిన బంటు పాత్రలో బాగున్నాడు. శరణ్య సహజ నటనతో ఆకట్టుకుంది. 

ఇలాంటి సినిమాకి రెహమాన్‌లాంటి దిగ్గజాన్ని ఎంచుకున్నారంటే అతడి నుంచి ప్రపంచ స్థాయి సంగీతాన్ని ఆశిస్తున్నారనే అర్థం. కానీ ఎందుకో మేస్ట్రో ఈ సినిమాకి ప్లస్‌ కాలేకపోయాడు. ఉన్న ఆ కొన్ని పాటలు కూడా క్యాచీగా లేకపోవడం వల్ల రొమాంటిక్‌ ట్రాక్‌ మరింత విసుగ్గా మారింది. సినిమాటోగ్రాఫర్‌ తిరు మాత్రం ఒక ఊహాలోకాన్ని తన కెమెరా కంటితో పునఃసృష్టించాడు. కళా దర్శకుడికి, గ్రాఫిక్స్‌ నిపుణులకి కూడా ప్రశంసలు దక్కుతాయి. 

లోపాలు లేవని కాదు కానీ వాటిని మించి ప్రకాశించే సుగుణాలే ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. వైవిధ్యం కోసం పరితపించే ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రమిది. ఇలాంటి సినిమాలు ఎంతగా ఆదరణ పొందితే అంతగా భారతీయ సినీ స్వరూపం మారిపోతుంది. ఈ ఐడియాని వెన్ను తట్టి ప్రోత్సహించి, నిర్మాతగా కూడా వెన్నుదన్నుగా నిలిచినందుకు సూర్యకి డబుల్‌ కంగ్రాట్స్‌. ఇలాంటి విభిన్నమైన ఆలోచనలని ఆవిష్కరిస్తూ, తన స్థాయిని, ప్రేక్షకుల అభిరుచి స్థాయిని ఇనుమడిస్తోన్న విక్రమ్‌ కుమార్‌కి హేట్సాఫ్‌. 

బోటమ్‌ లైన్‌: సూర్య విక్రమము!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?