Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అఆ

సినిమా రివ్యూ: అఆ

రివ్యూ: అఆ
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: హారికా హాసినీ క్రియేషన్స్‌
తారాగణం: నితిన్‌, సమంత, అనుపమ పరమేశ్వరన్‌, రావు రమేష్‌, నదియా, అనన్య, అవసరాల శ్రీనివాస్‌, ప్రవీణ్‌, నరేష్‌, గిరిబాబు, అజయ్‌, హరితేజ, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఎన్‌. నటరాజ సుబ్రమణియన్‌
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌
విడుదల తేదీ: జూన్‌ 2, 2016

మన మూలాల్ని వెతుక్కుంటూ మళ్లీ అక్షరాలు దిద్దుకునే ప్రయత్నంలో చేసిన చిత్రమిది అంటూ 'అఆ' చేయడానికి గల కారణాన్ని త్రివిక్రమ్‌ చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏమిటో గానీ 'అఆ' చూస్తే, కథల కోసం ఎక్కడికో వెళ్లిపోనక్కర్లేదు, ఒక్కసారి మన తెలుగు సినిమా మూలాలని వెతికితే చాలు, ఇప్పటివారిని మెప్పించే కథాంశాలు దొరుకుతాయని చెప్పారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 'అఆ' కథ మరేదో కాదు, కృష్ణ-విజయనిర్మల జంటగా విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన 'మీనా' సినిమా కథనే తీసుకుని త్రివిక్రమ్‌ తన మార్కు ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు. నేటితరం ప్రేక్షకులకి నచ్చే వినోదాన్ని జోడించి ఆ పాత మధురానికి కొత్త సొబగులు అద్ది ఒక చక్కని వినోదాత్మక కుటుంబ కథా చిత్రాన్ని అందించాడు. 

మనస్పర్ధల వల్ల రెండు కుటుంబాలు విడిపోవడం, రెండిళ్లకీ చెందిన యువతీ యువకులు ప్రేమలో పడడం, అడ్డంకులని దాటుకుని ఒక్కటవడం. కథాపరంగా చెప్పుకోతగ్గ విషయం కానీ, గుర్తుంచుకోతగ్గ విశేషం కానీ లేవు. అయితే దర్శకుడు కథ చెప్పకుండా ఇంటర్వెల్‌ వరకు కాలక్షేపం చేస్తూ కూర్చోవాల్సిన అవసరం కానీ, ఉన్న ఉల్లిపొర కథేమిటన్న గుట్టు వీడిపోతే అప్పుడు ముందుకు నడిపించడమెలా అని చింతించాల్సిన అగత్యం కానీ దీనికి లేవు. ఎందుకంటే పాత కథే అయినా కానీ రెండున్నర గంటల పాటు నడిపించుకోవడానికి తగ్గ డ్రామా ఇందులో పుష్కలంగా వుంది. ఈ ప్లాట్‌ నలభయ్యేళ్ల క్రితమే వచ్చినప్పటికీ ఇప్పటికీ వర్కవుట్‌ అయ్యే మేటర్‌ ఉందని గ్రహించడంలో త్రివిక్రమ్‌ తెలివి తెలుస్తుంది. 

వరుసపెట్టి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలు, ఆయా హీరోలకి ఉన్న ఇమేజ్‌కి తగ్గ విధంగా రాసుకోవాల్సిన సన్నివేశాలు, అభిమానులని ఆనందపెట్టడానికి తప్పనిసరిగా ఉండాల్సిన ఎక్స్‌ట్రా బ్యాగేజీలు లేకుండా కేవలం కథని కథగా చెప్పుకునే సౌలభ్యం చాలా కాలానికి త్రివిక్రమ్‌కి దొరికింది. అందుకే ఎక్కడా నేల విడిచి సాము చేయకుండా, ఎటువంటి 'అనవసరపు హంగుల' జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా పాయింట్‌కి వచ్చేసి, కథని సాఫీగా నడిపించుకుంటూ పోయాడు.             

అయితే త్రివిక్రమ్‌ సినిమాల నుంచి ఆశించే కామెడీ కానీ, ఎమోషన్లు కానీ ఎక్కువ స్థాయిలో లభించవు. దీని వల్ల హాస్య ప్రియులు ఒకింత నిరాశ చెందే అవకాశం లేకపోలేదు. కామెడీ కోసమని పెట్టిన కొన్ని సన్నివేశాలు కూడా అనుకున్నంత ఎఫెక్టివ్‌గా తెరకెక్కలేదు. ఉదాహరణకి చమ్మక్‌ చంద్ర పెళ్లి చూపులకి వచ్చే సన్నివేశం, మాల్‌లో రఘుబాబు, సన, పోసాని నడుమ సన్నివేశం లాంటివి బాగా తేలిపోయాయి. పైగా ఈ సీన్స్‌ని అవసరానికి మించి సాగదీయడం వల్ల పంటి కింద రాళ్లలా మారాయి. 

నితిన్‌-అనుపమ, అవసరాల శ్రీనివాస్‌-అనన్యల మధ్య బెటర్‌ సీన్స్‌ రాసుకుని ఉండాల్సింది. ఈ రెండు ట్రాక్స్‌కి ఆకట్టిపడేసే సత్తా ఉన్నప్పటికీ మరీ పైపైన టచ్‌ చేసి వదిలేసినట్టనిపించింది. అయితే అనసూయ-ఆమె తల్లి మధ్య ఉన్న సంఘర్షణని, అత్త-ఆనంద్‌ల మధ్య ఉన్న అగాధాన్ని బాగా ఎస్టాబ్లిష్‌ చేసారు. అలాగే అనసూయ, ఆనంద్‌ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యే దానికోసం ప్రత్యేకమైన సన్నివేశాలేం పెట్టకుండా అదంతా నేచురల్‌ ప్రాసెస్‌ అన్నట్టు చూపించడం బాగుంది. దీనికి సమంత, నితిన్‌ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా దోహదపడింది. 

స్క్రీన్‌ప్లే పరంగా ఎక్కడా హైస్‌ కానీ, లోస్‌ కానీ లేవు. ఎమోషనల్‌ హై ఇవ్వగలిగే సత్తా ఉన్న కథే అయినా కానీ అంత లోతులని స్పృశించే ప్రయత్నం జరగకపోవడం ఒకింత ఆశ్చర్యపరుస్తుంది. చిన్న మాటతో కొండంత ఎమోషన్‌ పలికించగలిగే సత్తా ఉన్న త్రివిక్రమ్‌ అటు వైపుగా పెన్ను విదిలించకపోవడం చిన్న వెలితి అనే చెప్పాలి. అలాంటి ఒకటి, రెండు పీక్స్‌ని టచ్‌ చేసినట్టయితే ఇది ఖచ్చితంగా త్రివిక్రమ్‌ 'రాసిన' అద్భుతాల సరసన నిలిచిపోయేది. ఇప్పటికీ తనవైన చమక్కులతో అలరించే సినిమానే తీర్చిదిద్దాడనుకోండి. అనసూయ వచ్చి ఆనంద్‌ ఇంట్లో పది రోజులున్న దానిని వెరైటీగా చూపించిన త్రివిక్రమ్‌, ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి గల కారణాలని మూడు ధృక్కోణాల్లో విడివిడిగా చెప్పడం కూడా ఆకట్టుకుంటుంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ని కొంచెం కొంచెంగా చూపిస్తూ క్లయిమాక్స్‌ వరకు మొత్తం జరిగింది చెప్పకుండా ప్లే చేసిన త్రివిక్రమ్‌, ఈసారి ఇందులో నదియా తనకి గుర్తున్న దానిని చెప్పడం, తర్వాత నరేష్‌ తనకి తెలిసిన దానిని చెప్పడం, ఆపై నితిన్‌ జరిగింది చెప్పడం ఆకట్టుకుంటాయి. 

ఇక లాస్ట్‌ పంచ్‌ ఇవ్వడంలో కిక్‌ ఏంటనేది తెలిసిన త్రివిక్రమ్‌ ఈ సినిమా మొత్తానికి కిక్‌ ఇచ్చే డైలాగ్స్‌ని చివరకి దాచి పెట్టేసుకున్నాడు. సమంత చేతిలోని బంతి రావు రమేష్‌ చేతిలో పడింది మొదలు, 'ఇప్పుడేం చేద్దాం' అని అజయ్‌ అడిగితే 'ఏం చేస్తాం... ఈ బంతి పిసుక్కుందాం' అంటూ ముగించే వరకు పంచ్‌ల మీద పంచ్‌లు విసుర్తూ కేవలం కొన్ని నిముషాల్లో కళ్ల వెంట నీళ్లు వచ్చేసే స్థాయిలో నవ్వించేసాడు. 

సమంతకి చాలా రోజులకో మంచి పాత్ర దక్కింది. రొటీన్‌ ఎక్స్‌ప్రెషన్లతో విసిగిస్తూ వస్తోన్న సమంత ఈసారి తనలోని నటిని పరిపూర్ణంగా ఆవిష్కరించింది. నితిన్‌ కూడా సటిల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా సింపుల్‌గా బాగా నటించాడు. అతనికీ ఈ చిత్రం గుర్తుండిపోయేది అవుతుంది. నదియాకి ఈ తరహా పాత్రలు అలవాటైపోయాయి. హీరో స్నేహితుడిగా ప్రవీణ్‌, హీరోయిన్‌ చెలికత్తెగా హరితేజ, హీరో చెల్లెలిగా అనన్య, నదియా నమ్మిన బంటుగా శ్రీనివాసరెడ్డి అందరూ తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. ఈమధ్య చాలా సినిమాలకి తనకున్న కొద్ది సీన్లతోనే హైలైట్‌ అయిపోతున్న రావు రమేష్‌ ఇంకోసారి టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే, తనకి సపోర్టింగ్‌ క్యారెక్టర్‌లో అజయ్‌ తనవంతు సహకారం అందించాడు. 

తనకు తానే సెట్‌ చేసుకున్న బెంచ్‌మార్క్‌ని మళ్లీ మళ్లీ అందుకోవడం త్రివిక్రమ్‌కి అయినా అంత ఈజీ కాదు. ఈ సినిమాతో దానిని అందుకోలేకపోయినా కానీ మరో ఆహ్లాదకర చిత్రాన్ని అందించి తనపై ప్రేక్షకులుంచే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మిక్కీ పాటలు, నటరాజన్‌ కెమెరాలో ఆ పచ్చని చేలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అయ్యాయి. వేసవిలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తోన్న వారికి సరిగ్గా వేసవి సెలవులకి సెలవు చెప్పే ముందు ఆ ఎదురుచూపులకి తెరదించుతూ 'అఆ'కి తెర లేచింది.

బోటమ్‌ లైన్‌: అల్లరిగా.. ఆహ్లాదంగా!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?