Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గోపాల గోపాల

సినిమా రివ్యూ: గోపాల గోపాల

రివ్యూ: గోపాల గోపాల
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: సురేష్‌ మూవీస్‌ ప్రై.లి., నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
తారాగణం: వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌, మిథున్‌ చక్రవర్తి, శ్రియ, పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి, మురళీ శర్మ, రంగనాధ్‌, కృష్ణుడు, దీక్షా పంత్‌, మధు షాలిని తదితరులు
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌
నిర్మాతలు: శరత్‌ మరార్‌, సురేష్‌
కథనం, దర్శకత్వం: కిషోర్‌ కుమార్‌ పార్థసాని (డాలీ)
విడుదల తేదీ: జనవరి 10, 2015

వెంకటేష్‌.. పవన్‌కళ్యాణ్‌.. ఈ ఇద్దరు అగ్రహీరోలు కలిసి ఒక చిత్రం చేస్తున్నారంటే దానిపై వద్దన్నా కానీ అంచనాలు తారాస్థాయిలో ఏర్పడతాయి. అయితే ఈ కాంబినేషన్‌ నుంచి ఆశించే చిత్రానికి భిన్నంగా.. దేవుడు వర్సెస్‌ నాస్తికుడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో వచ్చిన ‘ఓ మై గాడ్‌’ అనే సినిమాకి రీమేక్‌ ఇది. ఆ చిత్రం చూసిన వారికి దీనిని నుంచి ఏం ఆశించాలనే దానిపై ఒక ఐడియా ఉంటుంది. దాని సంగతి తెలియని వారికి మాత్రం ‘గోపాల గోపాల’ సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిస్తుంది. ఎందుకంటే సోకాల్డ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కి కిలోమీటర్‌ దూరంగా.. ఇలాంటి కాంబినేషన్‌ నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే తరహా సినిమాకి పూర్తి భిన్నంగా సాగే ‘గోపాల గోపాల’ని అర్థం చేసుకోవడానికి, అలవాటు పడడానికి టైమ్‌ పడుతుంది. అయితే అంతిమంగా ఈ కథాబలాన్ని తారాబలం డామినేట్‌ చేస్తుంది. 

కథేంటి?

మోసపూరిత మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుని భక్తుల నమ్మకాన్ని క్యాష్‌ చేసుకుంటుంటాడు నాస్తికుడైన గోపాల్రావు (వెంకటేష్‌). ఒకానొక సందర్భంలో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఒక భక్త కూటమిని చెదరగొట్టి వారి భక్తిని అపహాస్యం చేస్తాడు. అదే రోజు రాత్రి సంభవించిన భూకంపంలో తన దుకాణం ఒక్కటే నేలమట్టమై... ఎనభై లక్షల అప్పుతో నడి వీధికి వచ్చేస్తాడు. బీమా మొత్తం చెల్లించడానికి కూడా ఇన్సూరెన్స్‌ సంస్థ అంగీకరించదు. ‘దేవుడి చర్య’ వల్ల జరిగిన నష్టం బీమాలో కవర్‌ అవదని అంటే... తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు. దేవుడి మిషన్లు నడిపే సంస్థలకి, దేవాలయాలకి, ట్రస్టులకి అన్నిటికీ సమన్లు పంపిస్తాడు. గోపాల్రావు వాదనలో న్యాయం ఉందని అతని కేసుని కోర్టు యాక్సెప్ట్‌ చేస్తుంది. అయితే భక్తులు గోపాల్రావుపై పగబట్టి అతడిని చంపాలని చూస్తారు. అప్పుడు భగవంతుడే మనిషి రూపంలో (పవన్‌కళ్యాణ్‌) వచ్చి గోపాల్రావుని కాపాడి.. అతడికి దిశా నిర్దేశం చేస్తాడు. 

కళాకారుల పనితీరు!

ఇద్దరు హీరోల సినిమాగా ప్రచారం జరిగినప్పటికీ ఈ చిత్రానికి కథానాయకుడు వెంకటేష్‌. పవన్‌కళ్యాణ్‌ ఇందులో సపోర్టింగ్‌ రోల్‌ చేసాడు. కాస్త వ్యంగ్యం, కాస్త అసహాయత, కాస్త నిజాయతీ, కాస్త నిరసన కలగలిసిన పాత్రలో వెంకటేష్‌ నటన బాగుంది. హిందీలో ఈ పాత్ర పోషించిన పరేష్‌ రావల్‌తో పోల్చలేం కానీ వెంకటేష్‌ తనదైన శైలిలో ఈ పాత్రకి న్యాయం చేసాడు. హీరోచిత లక్షణాలున్న పాత్రలు పక్కనపెట్టి కథని నడిపించే పాత్రలు ఎంచుకుంటోన్న వెంకటేష్‌ ఛాయిస్‌ని ప్రశంసించాలి.

Video: Gopala Gopala Public Talk

ఇక పవన్‌కళ్యాణ్‌ ఈ సింపుల్‌ కథని మెజారిటీ ప్రేక్షకులకి చేర్చే సారథి అయ్యాడు. ఓ విధంగా పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అయితే మరో విధంగా అదే మైనస్‌. కథని మించి అతని స్టార్‌డమ్‌ ఒక్కోసారి గ్లోరిఫై అయింది. ఆ విషయాన్ని విశ్లేషణలో చర్చించుకుందాం. పవన్‌ నటన విషయానికి వస్తే భగవంతుడి పాత్రకి అవసరమైన ప్రసన్నవదనం, చిద్విలాసం లాంటివి పర్‌ఫెక్ట్‌గా అభినయించాడు. తన ఇమేజ్‌ని పక్కన పెట్టి సహాయ పాత్రలో భేషజాలు లేకుండా నటించి తన సైడ్‌ నుంచి ఈ కథకి మాగ్జిమమ్‌ సపోర్ట్‌ ఇచ్చాడు. లాప్‌టాప్‌ పట్టుకుని తిరుగుతూ ఫేస్‌బుక్‌ గురించి మాట్లాడే అప్‌డేటెడ్‌ శ్రీకృష్ణ పరమాత్మగా పవన్‌ బాగున్నాడు. 

మిథున్‌ చక్రవర్తి ఈ పాత్రని హిందీ వెర్షన్‌లో కూడా చేసాడు. ఆ పాత్రని అతను ఎంత బాగా చేసాడంటే... తెలుగులో దానిని పోషించడానికి మరో ప్రత్యామ్నాయం కూడా దొరకలేదు. మరోసారి ఆ పాత్రని అద్భుతంగా పోషించి, తన హావభావాలు, శారీరిక భాషతోనే అలరించాడు. పోసాని కృష్ణమురళి పాత్రని వినోదం కోసం వాడుకున్నారు. ఒరిజినల్‌లో ఈ పాత్రని గోవింద్‌ నామ్‌దేవ్‌ చాలా సీరియస్‌గా పోషించాడు. ఈ పాత్రని కామెడీ చేయడం వల్ల కీలక సన్నివేశాల్లో ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. శ్రియకి నాలుగైదు సన్నివేశాలున్నాయి. తనవంతు చేయగలిగింది చేసింది. ఆశిష్‌ విద్యార్థి, కృష్ణుడు సపోర్టింగ్‌ రోల్స్‌లో బాగానే చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

సంభాషణలు ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. వెంకటేష్‌ క్యారెక్టర్‌కి రాసిన డైలాగ్స్‌ చాలా వరకు ఒరిజినల్‌ వెర్షన్‌ డైలాగ్స్‌కి అనువాదమే అయినా పవన్‌కళ్యాణ్‌ క్యారెక్టర్‌కి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి హీరోయిజం చూపించని పాత్రని పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేయడంలో డైలాగ్స్‌ దోహదపడ్డాయి. ‘నమ్మించేవాడు నాయకుడు కాదు... నడిపించేవాడు నాయకుడు. గెలిచేవాడు నాయకుడు కాదు... గెలిపించేవాడు నాయకుడు’, ‘సమర్ధుడు మనకెందుకు అనుకుంటే అసమర్ధుడు రాజ్యమేలతాడు’ వంటి డైలాగ్స్‌కి పవన్‌ ఫాన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. 

ఈ చిత్రంలో రెగ్యులర్‌ పాటలకి స్కోప్‌ లేదు. సందర్భోచితంగా వచ్చే పాటలు వినడానికి బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓవరాల్‌గా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రత్యేకించి థీమ్‌ మ్యూజిక్‌ థియేటర్‌ విడిచిపెట్టాక కూడా హాంట్‌ చేస్తుంది. ఎడిటింగ్‌ అంత బాలేదు. సన్నివేశాల మధ్య సమన్వయం లోపించింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సబ్జెక్ట్‌కి అనుగుణంగానే ఖర్చు పెట్టినట్టున్నారు. పెద్ద హీరోలున్నారనే హంగులు ఏమీ లేవు. 

Video: Gopala Gopala Public Talk

ఇంతకుముందు స్టార్‌ హీరోల్ని డైరెక్ట్‌ చేసిన అనుభవం లేని కిషోర్‌ ఈ చిత్రాన్ని బాగానే హ్యాండిల్‌ చేసాడు. ఒరిజినల్‌లోని ఫీల్‌ చెడకుండా బాగానే మెయింటైన్‌ చేసాడు కానీ సెటైర్స్‌ని ప్రభావవంతంగా చెప్పించలేకపోయాడు. ఒరిజినల్‌కి చిన్నపాటి మార్పు చేర్పులు చేసారు కానీ తొంభై శాతం అదే తు.చ. తప్పకుండా ఫాలో అయిపోయారు. 

హైలైట్స్‌:

  • పవన్‌కళ్యాణ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌
  • డైలాగ్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రీన్‌ప్లేలో బిగి లేదు
  • పతాక సన్నివేశాలు నమ్మశక్యంగా లేవు

విశ్లేషణ:

ఈ కథలో చాలా విషయం ఉంది. ఇంత కథాబలం ఉన్న చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒక సామాన్యుడు దేవుడిపై కేసు పెట్టి సమాజానికి వ్యతిరేకంగా నిలబడడం, అతనికి సాయంగా ఆ దేవుడే దిగి రావడం అనే పాయింట్‌లో విలక్షణతకి తోడు కావాల్సినంత సంఘర్షణ ఉంది. ఇలాంటి కథని చూసేటపుడు ప్రేక్షకుడు మరి దేని గురించి ఆలోచించకుండా సినిమాలో లీనమైపోవాలి. దాని కోసం ఇలాంటి కథలకి తారాబలం అడ్డు రాకుండా జాగ్రత్త పడాలి. కానీ పవన్‌కళ్యాణ్‌ని దేవుడి పాత్రకి ఎంచుకోవడం వల్ల ఓ విధంగా ఈ కథకి అన్యాయమే జరిగింది. ప్రథమార్థంలో కథ రసకందాయంలో పడి... కథానాయకుడు కొన్ని కరెక్ట్‌ క్వశ్చన్స్‌ అడుగుతూ ఉన్నా కానీ ‘రాబోయే’ దేవుడి మీదే దృష్టి ఉండి... ఇప్పుడు జరుగుతున్న రసవత్తర ఘటనల్ని ప్రేక్షకులు పూర్తిగా అనుభూతి చెందలేరు. 

అబౌ ది స్క్రిప్ట్‌ రైజ్‌ అయిన పవన్‌కళ్యాణ్‌ని దాటి కథని, దాని గమనాన్ని హర్షించడానికి వీలు చిక్కదు. పవన్‌కళ్యాణ్‌ నుంచి ఏమి ఆశిస్తారనేది తెలిసినా కానీ వాటి జోలికి పోకుండా... కథలో అతడిని ‘డైరెక్టర్‌’గానే ఉంచిన వైనాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఏమాత్రం పాత్రని కాకుండా పవన్‌ని ఎలివేట్‌ చేయాలని చూసినా కానీ కథకి తీవ్రమైన అన్యాయం జరిగి ఉండేది. ఇప్పటికీ ఈ చిత్రంతో ఆ సమస్య అయితే లేకపోలేదు. ముఖ్యంగా పవన్‌ అభిమానులు అతడిని నాయకుడిగా చూడాలని అనుకుంటారు. కానీ ఇందులో పవన్‌ది కర్తవ్యం బోధించి ఫలితాన్ని వీక్షించే ప్రేక్షక పాత్ర. దీనిని అభిమానుల్లో ఎంత మంది హర్షిస్తారో, పవన్‌లోని హీరోయిజాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుల్లో ఎందరు ఈ పాసివ్‌ పాత్రని అంగీకరిస్తారో వేచి చూడాల్సిందే. 

Video: Gopala Gopala Public Talk

కథ పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు. ముందే చెప్పినట్టు ఎంతో మేటర్‌ ఉన్న కాన్సెప్టు. దానిని ఒడిదుడుకులు లేకుండా నడిపించలేకపోయారు. ప్రథమార్థంలో దేవుడ్ని త్వరగా పరిచయం చేసేయాలనే తొందర, ద్వితీయార్థంలో దేవుడికి తగిన పాత్ర కల్పించాలనే ఆదుర్దా అసలు కథని అక్కడక్కడా పక్కదారి పట్టించాయి. పతాక సన్నివేశాలు మరీ లాజిక్‌కి అతీతంగా, ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి. ఇది ఒరిజినల్‌లో కూడా ఎదురైన ఇబ్బందే అయినా క్లయిమాక్స్‌ మార్చే సాహసానికి ఇక్కడి దర్శక, రచయితలు ఒడికట్టలేకపోయారు. పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌ అనే స్టార్స్‌ని చూడకుండా... కేవలం వారిని పాత్రధారులుగా చూసే పెద్ద మనసు ఉన్నట్టయితే ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయవచ్చు. ఈ కాంబినేషన్‌ నుంచి మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ కానీ ఫక్తు కమర్షియల్‌ మల్టీస్టారర్‌ కానీ ఆశిస్తే నిరాశ తప్పదు. 

కాంబినేషన్‌ క్రేజ్‌తో, పండగ అడ్వాంటేజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌ అయిపోవడానికి కావాల్సిన బలం, సమయం అన్నీ కలిసొచ్చాయి. అయితే ఈ కాంబినేషన్‌ నుంచి ఇలాంటి ప్రమోగాత్మక సోషల్‌ సెటైర్‌ని యాక్సెప్ట్‌ చేయడానికి టికెట్‌ పేయింగ్‌ పబ్లిక్‌ ఎంత అనుకూలంగా ఉన్నారనేదే తేలాలి.

బోటమ్‌ లైన్‌: ఆలోచింపజేసే గోపాలుడు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?