Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ముకుంద

సినిమా రివ్యూ: ముకుంద

రివ్యూ: ముకుంద
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: లియో ప్రొడక్షన్స్‌
తారాగణం: వరుణ్‌ తేజ్‌, రావు రమేష్‌, పూజా హెగ్డే, ప్రకాష్‌రాజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రఘుబాబు తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: మణికండన్‌
సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
విడుదల తేదీ: డిసెంబర్‌ 24, 2014

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలొచ్చారు. వారిలో ఎక్కువ మంది తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుని మంచి పొజిషన్‌కొచ్చారు. ఇంకొందరు ఫ్యూచర్‌ ఉంటుందనే కాన్ఫిడెన్స్‌ కలిగించారు. ఇప్పుడు కొత్తగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చాడు. నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ ‘ముకుంద’గా వెండితెరపై తొలి సంతకం చేసాడు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో దర్శకుడిగా తన ముద్ర చాటుకున్న శ్రీకాంత్‌ అడ్డాల ‘ముకుంద’ని ముస్తాబు చేసాడు. మంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచి, అసంఖ్యాక అభిమానులు ఆదరించే కుటుంబం నుంచి ఒక హీరో వస్తున్నాడంటే దానిపై అంచనాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సేఫ్‌గా కమర్షియల్‌ ఫార్ములాని నమ్ముకుని ఫస్ట్‌ ఎటెంప్ట్‌లో పాస్‌ అయిపోవాలనే చూస్తారు. కానీ ‘ముకుంద’ చిత్రం ఆ ఫార్ములాలకి, పాస్ట్‌ హిస్టరీలకి భిన్నంగా కొంచెం కొత్త మార్గంలో సాగింది. ఈ ప్రయత్నానికి దర్శకుడు శ్రీకాంత్‌ని, రిస్క్‌ అని తెలిసినా కానీ ఎటెంప్ట్‌ చేసిన నిర్మాతలని అభినందించాలి. అయితే ప్రయత్నం మంచిదో, చెడ్డదో పక్కన పెడితే అంతిమంగా అది ఎంత మందిని మెప్పించింది, ఎంత మేరకు రాణించింది అనేదే కౌంట్‌ అవుతుంది. 

కథేంటి?

అమలాపురంలాంటి చిన్న టౌన్‌ అది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా పాతికేళ్లుగా ఆ ఊరిని ఏలుతుంటాడొకతను (రావు రమేష్‌). సహజంగానే అతని పలుకుబడికి, పవర్‌కి భయపడి ఎవరూ ఛైర్మన్‌ జోలికి పోరు. కానీ తన సోదరుడి కూతుర్ని ప్రేమిస్తాడో కాలేజ్‌ స్టూడెంట్‌. తన బలాన్ని వాడితే ఆ స్టూడెంట్‌ని అంతం చేయడం పెద్ద పనికాదు ఛైర్మన్‌కి. కానీ ఆ స్టూడెంట్‌కో బలవంతుడైన ఫ్రెండ్‌ ఉంటాడు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే గుణమున్న అతను తన స్నేహితుడికి అండగా ఉండడా? అతనే ముకుంద (వరుణ్‌ తేజ్‌). ఛైర్మన్‌తో సరాసరి పోటీకి వెళతాడు. ఛైర్మన్‌ కూతురిని (పూజ) చూసి ‘చాలా బాగుంది’ అని అతనికే చెప్తాడు. ఈ టీజింగ్‌ చాలదన్నట్టు ఛైర్మన్‌కి పోటీగా ఎలక్షన్స్‌లో మరొకర్ని (ప్రకాష్‌రాజ్‌) నిలబెట్టి గెలిపిస్తాడు. ఈ సమరంలో గెలిచేది ముకుందే అని ఊహించొచ్చు. మరి ఛైర్మన్‌కి కనువిప్పు ఎలా కలిగింది? 

కళాకారుల పనితీరు:

వరుణ్‌ తేజ్‌ చూడ్డానికి చాలా బాగున్నాడు. ఒక హీరోకి కావాల్సిన రూపు రేఖలు, ఒడ్డూ పొడవులూ అన్నీ ఉన్నోడు. స్క్రీన్‌ ప్రెజెన్స్‌కి లోటు లేదు. యాక్షన్‌ సీన్స్‌లో, రావు రమేష్‌తో తలపడే సన్నివేశాల్లో బాగానే చేసాడు. నిజానికి మొదటి సినిమాకి ఒక లేత హీరోపై పెద్ద భారం మోపిన క్యారెక్టరిది. వరుణ్‌ తేజ్‌ తనకి చేతనైనంత వరకు బాగానే లాక్కొచ్చేసాడు. సానబడితే స్టార్‌ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 

అచ్చమైన తెలుగు విలన్స్‌ రావట్లేదన్న లోటుని తీర్చేస్తున్నాడు రావు రమేష్‌. తన తండ్రి రావుగోపాలరావుని తలపించాడు. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లోని విలన్‌ క్యారెక్టర్లని తన కంటే బెటర్‌గా చేసే ఆర్టిస్టులు ఎవరూ ఇప్పుడు లేరంటే అతిశయోక్తి అవదు. ఈ పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకి కూడా కొంత క్రెడిట్‌ దక్కుతుంది. 

Video: Mukunda Public Talk

పూజా హెగ్డే పూర్తిగా పాటలకే పరిమితమైంది. ఆమె మేకప్‌, కాస్టూమ్స్‌ అన్నీ కూడా సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. నటన పరంగా తన టాలెంట్‌ చూపించే స్కోప్‌ దక్కలేదు. సమాజంలోని చెడుని ప్రశ్నించే ఒక రెబల్‌ క్యారెక్టర్‌ చేసిన ప్రకాష్‌రాజ్‌ పాత్ర ఎఫెక్టివ్‌గా లేదు. అతని పాత్రని కేవలం విప్లవ కవిత్వం వల్లించేదిగా కాకుండా మరింత బాగా తీర్చిదిద్ది ఉండాల్సింది. పరుచూరి వెంకటేశ్వరరావు పాత్ర ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ని తలపిస్తుంది. హీరో స్నేహితుడిగా నటించిన కుర్రాడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్లు పలకలేదు. అతనికి జోడీగా నటించిన అమ్మాయి నటన నేచురల్‌గా ఉంది. రఘుబాబు, అలీ, ప్రవీణ్‌ తదితరులున్నా కామెడీ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

శ్రీకాంత్‌ అడ్డాల రాసిన సంభాషణల్లో ఎనభై శాతం బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో రావు రమేష్‌కి రాసిన డైలాగ్స్‌ ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లినా, ప్రకాష్‌రాజ్‌ మాటలు విసిగించినా ఓవరాల్‌గా డైలాగ్స్‌ ఈ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. మిక్కీ జె. మేయర్‌ పాటలు వినసొంపుగా ఉన్నాయి. సిరివెన్నెల సాహిత్యం చక్కగా కుదిరింది. అయితే సినిమాలో నాయికానాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం వల్ల పాటలు పెట్టడానికి తగిన సందర్భాలు కుదర్లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో మిక్కీ జె. మేయర్‌ షాక్‌ చేస్తాడు. 

ఇంతకుముందు సాఫ్ట్‌ సినిమాలకే మ్యూజిక్‌ చేసిన మిక్కీ ఇంటెన్స్‌ యాక్షన్‌ సీన్స్‌లో చేసిన ‘ఆర్‌.ఆర్‌.’ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సీన్స్‌ పేర్చుకుంటూ వెళ్లినట్టు అనిపించడంతో ఎడిటింగ్‌ బాలేదనిపిస్తుంది. కానీ స్క్రీన్‌ప్లే పరంగా జరిగిన పొరపాట్ల కారణంగా ఎడిటింగ్‌ ఎఫెక్ట్‌ అయింది. 

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల రొటీన్‌గా ఉండకూడదని ట్రై చేసాడు. రూరల్‌ యూత్‌ మనోభావాలు, అక్కడి రాజకీయాల నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పూర్తిగా వన్‌ డైమెన్షనల్‌ అయిపోయింది. మాటల రచయితగా మరోసారి ఇంప్రెస్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడిగా కూడా కొన్ని సందర్భాల్లో తన ప్రతిభ చాటుకున్నాడు. వరుణ్‌, రావు రమేష్‌ మధ్య సీన్స్‌ చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. డైరెక్టర్‌ ‘కనిపించే’ సన్నివేశాలు ఉన్నా కానీ స్క్రీన్‌ప్లే పరంగా జరిగిన పొరపాట్లు అడ్డాల ప్రయత్నం సఫలం కావడానికి అడ్డు పడ్డాయి.

హైలైట్స్‌:

  • రావు రమేష్‌ పర్‌ఫార్మెన్స్‌
  • వరుణ్‌ తేజ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌
  • మిక్కీ జె. మేయర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
  • వరుణ్‌ - రావు మధ్య వచ్చే సీన్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రీన్‌ప్లే
  • సాంగ్స్‌ ప్లేస్‌మెంట్‌
  • హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌
  • క్లైమాక్స్‌

విశ్లేషణ:

ముందుగా ఓ సంగతి. ‘ముకుంద’ పోస్టర్లలో పల్లకీ మోస్తున్న వరుణ్‌ తేజ్‌ని, ట్రెయిలర్స్‌లో ‘గోపికమ్మ’ అంటూ పాడుతోన్న పూజా హెగ్డేని, ‘చాలా బాగుంది’ అంటూ డ్యూయట్లు పాడుకుంటోన్న ఈ ఇద్దరినీ చూసి ఇదేదో శ్రీకాంత్‌ అడ్డాల మార్కు లవ్‌ లేదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనుకోవద్దు. ఎందుకని అలాంటి భ్రమ కల్పించాలని చూసారనేది తెలీదు కానీ ప్యాకేజ్‌ అండ్‌ ప్రమోషన్‌ పరంగా ‘ముకుంద’ మోసం చేస్తుంది. ఎందుకంటే ఇది ఫక్తు యాక్షన్‌ సినిమా. రూరల్‌ నేపథ్యంలో కుర్రాళ్లు, రాజకీయ నాయకుల మధ్య నడిచే కథ. 

హీరో కుటుంబాన్ని కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్‌ జోలికి కానీ దర్శకుడు పోలేదు. అలాగే హీరోకి ఒక నార్మల్‌ లవ్‌స్టోరీ ఉండాలని కూడా అనుకోలేదు. హీరో హీరోయిన్లు ఇంటర్వెల్‌ వరకు ఒకర్నొకరు చూసుకోరు. సినిమా అంతటా ఒక్కసారి కూడా మాట్లాడుకోరు. వినడానికి ఐడియా బాగుందనిపిస్తుంది కదూ. కానీ ఈ లవ్‌స్టోరీ ఈ యాక్షన్‌ డ్రామాలో ఇమడలేదు. కొత్తగా చూపించాలనే తపన తప్పించి ఆ లవ్‌స్టోరీ ఏ విధంగాను రక్తి కట్టలేదు. పైగా హీరో-విలన్‌ కాన్‌ఫ్రంటేషన్‌ మినహా మరో యాంగిల్‌ లేకుండా ఒకే చోట తచ్చాడుతోన్న కథకి ఇంకో డైమెన్షన్‌ లేకుండా ఈ ‘ఐడియా’ అడ్డు పడింది. 

శ్రీకాంత్‌ అడ్డాల సినిమాలో కామెడీ ట్రాక్స్‌ అంటూ ఎప్పుడూ లేవు. హీరో హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే సంభాషణలు రాయడం, ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకోవడం అతని ఫోర్టు. ఎట్‌లీస్ట్‌ మనం ఇంతవరకు చూసిన సినిమాల్ని బట్టి. ‘బలం, బలహీనత’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అడ్డాల తన బలహీనతని నమ్ముకున్నాడని అనలేం కానీ ఖచ్చితంగా తన బలాన్ని పక్కన పెట్టాడు. ప్రేమకథ కనుక బలమైనది ఉండి ఉంటే ఈ వన్‌ డైమెన్షనల్‌ సినిమా స్క్రీన్‌ప్లే రౌండ్‌ ఆఫ్‌ అవడానికి, ఒక సంపూర్ణత్వం రావడానికి ఆస్కారముండేది. ప్రేమకథ మరీ డల్‌గా, మీనింగ్‌లెస్‌గా అనిపించడం వల్లే చివర్లో ఇద్దరూ కలిసినా కానీ ఏమాత్రం ప్రభావం చూపించదు. సినిమా మొదలైన దగ్గర్నుంచి పతాక సన్నివేశం వరకు ఒకే సీక్వెన్స్‌ ఆఫ్‌ సీన్స్‌ రిపీట్‌ అవుతుంటాయి. తన స్నేహితుడి కోసం ఎంత దూరమైనా వెళ్లే హీరో ఇక అదే పని మీద ఉంటాడు. కనీసం ఇక్కడ స్నేహాన్ని హైలైట్‌ చేస్తూ అయినా మరో కోణం ఇచ్చి ఉండొచ్చు. కానీ అదీ జరగలేదు.

విలన్‌, హీరో నడుమ వచ్చే సన్నివేశాలని మాత్రం శ్రీకాంత్‌ అడ్డాల చాలా బాగా తెరకెక్కించాడు. యాక్షన్‌ సీన్లని ఎఫెక్టివ్‌గా తీసే టాలెంట్‌ కూడా తనలో ఉందని చూపించాడు. కాకపోతే స్క్రీన్‌ప్లే పరంగా చాలా పొరపాట్లు జరిగిపోయాయి. కొత్త హీరో కనుక అతడి నుంచి ఏవేవో ఆశించి వచ్చే వారు వన్‌ డైమెన్షనల్‌ క్యారెక్టర్‌తో డిజప్పాయింట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ. సన్నివేశాల పరంగా కొన్ని ఆకట్టుకున్నా కానీ టొటాలిటీ మిస్‌ అయిన ఈ చిత్రం అన్ని అభిరుచులున్న ప్రేక్షకులనీ ఏదో విధంగా నిరాశ పరుస్తుంది.

Video: Mukunda Public Talk

‘ముకుంద’ పూర్తిగా బ్యాడ్‌గా లేదు.. అలా అని గొప్పగానూ లేదు. కొత్తగా ఉండాలనే ప్రయత్నంలో కొన్ని కాంప్రమైజ్‌లు, రొటీన్‌ అవకూడదనే ఆలోచనతో చాలా రాంగ్‌ స్టెప్‌లు ‘ముకుంద’ ఎండ్‌ ప్రోడక్ట్‌పై ఎఫెక్ట్‌ చూపించాయి. వినోదం కోరుకునే వారి నుంచి పెదవి విరుపులు, వైవిధ్యం కావాలనే వారి నుంచి పాస్‌ మార్కులు పొందే ‘ముకుంద’ ఈ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ని సేఫ్‌గా దాటడానికి కష్టపడుతుంది. గట్టెక్కుతుందా లేదా అనేది ఈ కొత్త హీరోపై ఉన్న కుతూహలంపై, ఈ దర్శకుడిపై ఉన్న నమ్మకంపై డిపెండ్‌ అవుతుంది. 

బోటమ్‌ లైన్‌: ప్రయత్నం మంచిదే.. కానీ ఫలితముంటుందా ముకుందా?

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?