సినిమా రివ్యూ: ఒక లైలా కోసం

రివ్యూ: ఒక లైలా కోసం రేటింగ్‌: 3/5 బ్యానర్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌ తారాగణం: నాగచైతన్య, పూజ హెగ్డే, సుమన్‌, సయాజీ షిండే, అలీ, సుధ తదితరులు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ కూర్పు: ప్రవీణ్‌ పూడి…

రివ్యూ: ఒక లైలా కోసం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌
తారాగణం: నాగచైతన్య, పూజ హెగ్డే, సుమన్‌, సయాజీ షిండే, అలీ, సుధ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: ఆండ్రూ
నిర్మాత: అక్కినేని నాగార్జున
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండ
విడుదల తేదీ: అక్టోబర్‌ 17, 2014

రొమాంటిక్‌ మూవీస్‌తో సక్సెస్‌ అయిన నాగచైతన్య ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి బ్లాక్‌బస్టర్‌తో పరిచయమైన విజయ్‌కుమార్‌ కొండ దర్శకత్వంలో ఎటెంప్ట్‌ చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒక లైలా కోసం’. ‘మనం’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉంటుందనేది టైటిల్‌, ట్రెయిలర్స్‌తోనే ఒక ఐడియా వచ్చింది. రొటీన్‌ కథనే డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌తో డీల్‌ చేసిన విజయ్‌కుమార్‌ కొండ ఈసారి కూడా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లా ఇంప్రెస్‌ చేసాడా లేదా? 

కథేంటి?

కార్తీక్‌ (నాగ చైతన్య) తొలి చూపులోనే నందన (పూజ) ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్‌పై నందనకి మొదట్లోనే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది. అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది. నందనని ఎలాగైనా మెప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కార్తీక్‌. ఈలోగా అనుకోకుండా ఇద్దరికీ పెళ్లి కుదురుస్తారు వారి పెద్దలు. కార్తీక్‌ అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్లికి ఓకే అంటుంది. మరి పెళ్లి జరిగేలోగా కార్తీక్‌ ఆమెకి తనపై ఉన్న ద్వేషాన్ని పోగొడతాడా? 

కళాకారుల పనితీరు:

నాగ చైతన్యకి ఇప్పటికే పలు ప్రేమకథా చిత్రాలు చేసిన అనుభవం ఉండడంతో ఈ క్యారెక్టర్‌ చేయడానికి అంతగా కష్టపడాల్సిన పని పడలేదు. అయితే ప్రతి సినిమాలోను దాదాపుగా ఒకే లుక్‌తో కనిపిస్తున్న చైతన్య కాస్త డిఫరెన్స్‌ చూపించడానికి ప్రయత్నించాలి. ఎమోషనల్‌ సీన్స్‌లో మునుపటి కంటే బెటర్‌గా పర్‌ఫార్మ్‌ చేస్తున్నాడు. క్లయిమాక్స్‌ సీన్స్‌లో బాగా నటించాడు. 

పూజ హెగ్డేకి తెలుగులో బిజీ కాగలిగే లక్షణాలున్నాయి. చక్కని రూపంతో పాటు నటన కూడా బాగానే ఉంది కనుక పూజ మంచి సినిమాలు ఎంచుకుంటే స్టార్‌ అవడానికి ఆస్కారముంది. అలీ పరిచయ సన్నివేశాలు, ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, పోలీస్‌ స్టేషన్‌ ఎపిసోడ్‌ నవ్విస్తాయి. సుమన్‌, సయాజీ షిండే బాగా చేసారు. మిగిలిన తారాగణం అంతా పరిధుల మేర నటించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

అనూప్‌ స్వరపరిచిన పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంది. చాలా సీన్స్‌ని తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఎలివేట్‌ చేసాడు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. జోనర్‌కి తగ్గట్టు వైబ్రెంట్‌ కలర్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ అందంగా ఉంది. ఎడిటింగ్‌ ఓకే. అన్నపూర్ణ బ్యానర్‌ నుంచి వచ్చే చాలా చిత్రాల్లా ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ క్లీన్‌ ఫిలిం. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. 

డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ కొండ తన మొదటి సినిమా స్థాయిలో ఎంటర్‌టైన్‌ చేయకపోయినా కానీ లవ్‌ స్టోరీస్‌ డీల్‌ చేయడంలో తాను స్పెషలిస్ట్‌నని ఇంకోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్‌ చాలా లైవ్‌లీగా సాగుతుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌తో పాటు హీరో హీరోయిన్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ని బాగా చూపించగలిగాడు. పతాక సన్నివేశాల్లో డ్రామా ఎక్కువైంది. ఆ సీన్స్‌ని ఇంకా బెటర్‌గా కన్సీవ్‌ చేసి ఉండాల్సింది. 

హైలైట్స్‌:

  • సినిమాటోగ్రఫీ
  • ఫస్ట్‌ హాఫ్‌
  • లీడ్‌ పెయిర్‌ మధ్య కాన్‌ఫ్లిక్ట్‌

డ్రాబ్యాక్స్‌:

  • సెకండాఫ్‌ స్లోగా సాగుతుంది
  • క్లయిమాక్స్‌లో డ్రామా ఎక్కువైంది

విశ్లేషణ:

ప్రేమించడం కంటే ప్రేమించబడడం ముఖ్యమనే పాయింట్‌తో ఈ ప్రేమకథని రాసుకున్నారు. తనని ద్వేషించే హీరోయిన్‌ ప్రేమని హీరో ఎలా సాధిస్తాడనే దానిపైనే సినిమా అంతా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ఉండే ద్వేషం ప్రేమగా మారడం, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉన్న ద్వేషం తర్వాత పోవడం అనే సంఘర్షణతో కూడాని ప్రేమకథలు ఇంతకుముందు వచ్చాయి. అయితే ఆ పాయింట్‌ని దర్శకుడు తెలివిగా ట్రీట్‌ చేసాడు. హీరో అంటే అస్సలు ఇష్టం లేని హీరోయిన్‌కి అతడినే పెళ్లాడక తప్పని లాక్‌ వేసాడు. 

ఎలాగైనా ఆమెకి తన లవ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి, ఆమెని ఇంప్రెస్‌ చేయడానికి హీరో చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం సాగుతుంది. ఈ ప్రాసెస్‌ కాస్త స్లోగా సాగడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా తగ్గడం వల్ల సెకండాఫ్‌లో ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న లైవ్‌లీనెస్‌ మిస్‌ అవుతుంది. అయితే స్క్రీన్‌ప్లే పరంగా వేసుకున్న లాక్స్‌తో పాటు పావురాల త్రెడ్‌, నవల త్రెడ్‌ వంటివి మంచి పే ఆఫ్స్‌గా పనికొచ్చాయి. 

చివరి సీన్‌ని కేవలం హీరో హీరోయిన్లకే పరిమితం చేసినట్టయితే రక్తి కట్టేది. అసలు సంఘర్షణ వాళ్లిద్దరి మధ్యే కనుక హీరోకి తనపై ఉన్న ప్రేమ ఎంతనేది తెలిసిన తర్వాత హీరోయిన్‌ సరాసరి వెళ్లి అతని వద్ద బ్రేక్‌ అయితే కరెక్ట్‌ ఎండిరగ్‌ అయి ఉండేది. లోపాలున్నా కానీ ఓవరాల్‌గా ఒక లైలా కోసం టార్గెట్‌ ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చేస్తుంది. ఈ జోనర్‌ ఇష్టపడే వాళ్లు దీనికి మంచి మార్కులే వేస్తారు. మరింత బాగుండడానికి స్కోప్‌ ఉన్నా కానీ దర్శకుడు విజయ్‌కుమార్‌ తన తొలి చిత్రంలో చూపించిన స్పార్క్‌ ఇందులో చూపించలేదు. మాస్‌ ఆడియన్స్‌ మెచ్చే మసాలా అంశాలు ఏమీ లేని ఈ చిత్రం ఏ సెంటర్స్‌లో డీసెంట్‌ మూవీ అయ్యే అవకాశాలున్నాయి. యూత్‌, ఫ్యామిలీస్‌ రిసీవ్‌ చేసుకునే దానిని బట్టి రేంజ్‌ డిపెండ్‌ అవుతుంది. 

బోటమ్‌ లైన్‌: డీసెంట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌.

గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Watch Naga Chaithanya Exclusive Interview