Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప

సినిమా రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప

రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, నిత్యామీనన్‌, రవికిషన్‌, అలీ, నళిని, అజయ్‌, రోహిణి, పృధ్వీ, తాగుబోతు రమేష్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: బోగాది అంజిరెడ్డి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రాజసింహ తాడినాడ
విడుదల తేదీ: జూన్‌ 10, 2016

ఫ్లై ఓవర్‌ పెద్ద యాక్సిడెంట్‌ అయి, ట్రాఫిక్‌ మొత్తం జామ్‌ అయిపోయింది. పక్కన ఆటోలో కూర్చున్న అమ్మాయి తను చిన్నప్పుడే ప్రేమించి, ఎక్కడుందో అంటూ అన్వేషిస్తోన్న అమ్మాయి అని తెలిసింది. ఇంతలో ఫోన్‌ మోగింది. అవతలి నుంచి 'నేను చెప్పినట్టు వినకపోతే నీ ప్రేయసిని చంపేస్తాననే' బెదిరింపు వచ్చింది. నవ్వి పారేద్దామనుకునే లోపు తన కళ్ల ముందున్న పావురాన్ని కాల్చి పారేసాడు. అవతలి వ్యక్తి ఎంత డేంజరెస్‌ అనేది అర్థమైంది. ఆ యాక్సిడెంట్‌, ట్రాఫిక్‌ జామ్‌ అంతా ఆ ఫోన్లోని అజ్ఞాత వ్యక్తి ప్లాన్‌ అనే సంగతి తెలిసింది. 

మామూలుగా ఇలాంటి కథ ఎవరైనా మనకి చెబుతుంటేనే చెవులు రిక్కించి మరీ ఆసక్తిగా వింటాం. అదే తెర మీద చూపిస్తుంటే కళ్లప్పగించేసి, గోళ్లు కొరికేసుకుంటాం. కానీ 'ఒక్క అమ్మాయి తప్ప' కథే ఇదైనప్పటికీ ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ అటుంచి, ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆసక్తి రేకెత్తదు. అంటే లోపం కథలో కాదు, దానిని చెప్పిన విధానంలో ఉందన్నమాట. సమస్య సినిమాలో లేదు, దానిని తీసిన దర్శకుడితో వచ్చిందన్నమాట. 

కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలకి కమర్షియల్‌ హంగులు జోడించరాదనే పాఠం మన దర్శకులు ఎప్పటికి నేర్చుకుంటారో? తీసే కథలోని సీరియస్‌నెస్‌ దర్శకుడికే తెలియకపోతే ఇక దానిని చూసేవాడు ఎలా సీరియస్‌గా తీసుకుంటాడు? ఇలాంటి కథల్లో కామెడీకి, ఇతర హంగులు ఆర్భాటాలకి చోటు లేదు. తెలుగు సినిమా ప్రేక్షకుడికి సినిమాలో ఏమున్నా లేకపోయినా కామెడీ ఉంటే చాలనే బలమైన ముద్ర మన దర్శకులపై పడిపోయింది. అయితే ఆ కామెడీ ఎందులో చేయాలి, ఎక్కడ చేయాలి అనేది తెలిసుండాలి. చెప్పే కథని ఆసక్తికరంగా చెప్పగలిగితే ఇక ఇందులో కామెడీ లేదు, యాక్షన్‌ లేదు, హీరోయిజం లేదు అంటూ ప్రేక్షకుడు నసుక్కోడు. తీస్తున్న సినిమా థ్రిల్లర్‌ అయినప్పుడు నెక్స్‌ట్‌ ఏంటి అనే ఉత్కంఠతో కుర్చీ అంచుల్లోకి వచ్చి ఎదురు చూడాలి. అంతే కానీ భయంకరమైన సమస్య జరుగుతూ ఉండగా, ఇప్పుడు కాసేపు నవ్వుకోండంటూ కామెడీ చేయకూడదు. 

కనీసం రాజసింహ తీసిన కామెడీ సీన్లు నవ్వించి ఉన్నా, పోనీలెద్దు అని పొరపాటుని మన్నించేయవచ్చునేమో, కానీ ఆ కామెడీకి నవ్వు రాకపోగా, విసుగు పదింతలవుతుంది. ఇక తెలుగు దర్శకులతో వచ్చే మరో చిక్కు... టెర్రరిజం, పేట్రియాటిజం బేస్‌ చేసుకున్న కథల్ని బాలీవుడ్‌ దర్శకుల మాదిరిగా మనవాళ్లు హ్యాండిల్‌ చేయరు. నిజానికి ఇలాంటి కాన్సెప్టులకి నార్త్‌ వాళ్లు కనక్ట్‌ అయినట్టుగా మనవాళ్లు రిలేట్‌ కాలేరు. కనీసం లక్ష మందిని చంపడానికి బాంబ్‌ పెట్టడానికి వెళుతోన్న టెర్రరిస్టు దార్లో హైదరాబాద్‌లోని హిందూ, ముస్లింల సమైక్యతని, స్నేహబంధాన్ని చూసి చలించి పోతాడు. కళ్లనీళ్లు పెట్టుకుని అప్పటికప్పుడు మారిపోతాడు. ఆత్మాహుతికి ఏమాత్రం లెక్క చేయకుండా, కనీసం పసి పిల్లల ప్రాణాలకి కూడా విలువ ఇవ్వకుండా తర్ఫీదు పొంది, మొద్దుబారిపోయిన వాళ్లే జనాన్ని చంపే మిషన్లకి వస్తారు. అంతే తప్ప రోడ్డు మీద ముస్లిం శవాన్ని మోసే హిందువుని చూసి 'అద్భుతం' అంటూ కళ్లనీళ్లు పెట్టుకోరు. 

ఈ కథని కమర్షియల్‌గా మలిచే ప్రయత్నంలో బేసిక్స్‌ని కూడా రాజసింహ పట్టించుకోలేదు. సాధారణంగా ఇలాంటి ఎక్స్‌ట్రార్డనరీ సిట్యువేషన్‌లో ఒక ఆర్డినరీ పర్సన్‌ ఇరుక్కున్నట్టయితే, అతను జీరో నుంచి హీరోగా మారే వైనం ఆకట్టుకుంటుంది. కానీ ఇందులో హీరోయిజం చూపించి అంత మంచి 'కమర్షియల్‌ ఎలిమెంట్‌'కి చోటు లేకుండా చేసారు. ఇక ఈ టెర్రరిజమ్‌, ట్రాఫిక్‌ జామ్‌, టైమ్‌ లిమిట్‌ వగైరా వాటి మధ్య ఒక ప్రేమకథని కూడా చొప్పించారు. ఆ ప్రేమకథలో కూడా డెప్త్‌ లేదు. ఆమెని అప్పటికప్పుడు విలన్‌ కాల్చి పారేస్తే ఎలా అనే ఫీలింగ్‌ కించిత్‌ అయినా కలగదు. మామూలుగా కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరించే నిత్యామీనన్‌ ఇందులో ఏమి చూసి ఓకే చెప్పిందనేది ఆమెకే తెలియాలి. ఒక్క సందీప్‌ తప్ప మిగతా అందరూ ఏదో ఒక సందర్భంలో ఓవరాక్ట్‌ చేసిన వారే. చివరకు ఉత్తమ నటి అనిపించుకున్న నిత్యామీనన్‌ కూడా ఆడవాళ్ల హక్కుల గురించి మాట్లాడే సీన్లో హద్దులు దాటి ఓవరాక్షన్‌ చేసింది. 

చోటా కె. నాయుడు, మిక్కీ జె. మేయర్‌, గౌతంరాజు లాంటి హేమాహేమీలు తెరవెనుక ఉన్న సినిమా ఇలా షార్ట్‌ ఫిలింకి ఎక్కువ, ఫీచర్‌ ఫిలింకి తక్కువ అన్నట్టు తయారైందంటే తప్పు ఎవరిదనుకోవాలి? ఇక లాజిక్కుల జోలికిపోతే మొత్తం వ్యవహారమే ఫార్సుగా అనిపిస్తుంది. ట్రాఫిక్‌ జామ్‌, టెర్రర్‌ ఎటాక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తాపీగా ఒక డ్రీమ్‌ సాంగ్‌ వేసుకునే వీలుందని దర్శకుడికే అనిపించిందంటే ఇక తను చెప్పే కథని ఆసక్తిగా ఎవరైనా ఎందుకు వినాలి? ఫస్ట్‌ హాఫ్‌ విపరీపతంగా సహనాన్ని పరీక్షిస్తుంది. దాంతో పోలిస్తే సెకండ్‌ హాఫ్‌ కాస్త బెటరే కానీ 'ఫోన్‌బూత్‌' సినిమా స్ఫూర్తితో ఇదే సెటప్‌తో ఎన్నో రెట్లు బెటర్‌ సినిమా తీసే వీలుంది. కానీ అతి దారుణమైన స్క్రీన్‌ప్లేకి తోడు, అసందర్భమైన కామెడీ, అర్థం లేని ప్రేమకథ, అన్నిటికీ మించి వెన్నెముక లేని విలన్‌.. వెరసి 'ఒక్క అమ్మాయి తప్ప' ప్రేక్షకుల పాలిట సింహస్వప్నమైంది. రెండు గంటల పాటు ఈ సినిమా చూడ్డం కంటే, అంతకు రెట్టింపు సమయం ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోతే సుఖంగా అనిపిస్తుందనిపిస్తే మాత్రం అది మీ తప్పు కాదులెండి. 

బోటమ్‌ లైన్‌: ఒక్క కాన్సెప్ట్‌ తప్ప ఏదీ ఆకట్టుకోదు!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?