Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రేసుగుర్రం

సినిమా రివ్యూ: రేసుగుర్రం

రివ్యూ: రేసు గుర్రం
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌
తారాగణం: అల్లు అర్జున్‌, శృతిహాసన్‌, శ్యామ్‌, రవికిషన్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సలోని తదితరులు
కథ: వక్కంతం వంశీ
మాటలు: వేమారెడ్డి
సంగీతం: తమన్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌, కె. వెంకటేశ్వరరావు
కథనం, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 11, 2014

అల్లు అర్జున్‌ ఎనర్జీకి తగ్గ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ తీసా అని, ఇదేదో కొత్తదనమున్న సినిమా అని, కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పనని.. కానీ సినిమా చూసిన వారికి విసుగు కలిగించని వినోదం ఉంటుందని సురేందర్‌రెడ్డి చెప్పాడు. అన్నట్టుగానే ‘రేసుగుర్రం’ని ఫక్తు టాలీవుడ్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. లాజిక్కులెతికే పని అక్కర్లేదు.. లూప్‌హోల్స్‌కి కొదవే లేదు. కానీ వినోదం మాటున అన్నీ మరుగున పడిపోతాయి. అల్లు అర్జున్‌ ఈ చిత్రాన్ని స్టార్ట్‌ టు ఎండ్‌ తన భుజాలపై మోసేసాడు.

కథేంటి?

రామ్‌ (శ్యామ్‌), లక్ష్మణ్‌ అలియాస్‌ లక్కీ (అల్లు అర్జున్‌) అన్నదమ్ములు. ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. రామ్‌ పోలీసాఫీసర్‌, లక్కీ పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా. రామ్‌ తనకి అడ్డు వస్తున్నాడని శివారెడ్డి (రవికిషన్‌) తనని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లక్కీ అతడిని చావగొడతాడు. శివారెడ్డి తిరిగి పగ తీర్చుకోవడానికి ఏం చేస్తాడు, దానికి లక్కీ ఎలా బదులిస్తాడు అనేది రేసుగుర్రం.

కళాకారుల పనితీరు!

అల్లు అర్జున్‌ ఈ చిత్రంలో తన సహజసిద్ధమైన ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌లో కేక్‌ వాక్‌ చేసేసాడు. కామెడీ టైమింగ్‌ మునుపటి కంటే మెరుగవడమే కాకుండా తన మార్కు చమక్కులు కూడా జత చేసాడు. ‘దేవుడా..’ అని ఒక రకమైన యాసతో పలుకుతూ అతను చేసిన కామెడీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. అయితే అల్లు అర్జున్‌ నుంచి కోరుకునే డాన్సులు మాత్రం ఈ సినిమాలో పూర్తిగా మిస్‌ అయ్యాయి.

శృతిహాసన్‌ క్యారెక్టర్‌ని కూడా కామెడీగానే మలిచారు. ఆమె ఫర్వాలేదనిపించింది. రవికిషన్‌ ఈ సినిమాకి పెద్ద వీక్‌ పాయింట్‌. విలన్‌గా అతను క్రూరంగాను కనిపించలేదు. అలాగే మెప్పించేలా నటించనూ లేదు. ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ ఫన్నీగా ఉంది కానీ దానిని అర్థాంతరంగా వదిలేసారు. బ్రహ్మానందం క్లయిమాక్స్‌కి ముందు వచ్చి ‘కిల్‌బిల్‌ పాండే’గా చెలరేగిపోయాడు. శ్యామ్‌ కిక్‌ తర్వాత మరో గుర్తుండిపోయే క్యారెక్టర్‌ ఇందులో చేసాడు. మిగతా వారంతా తమ పరిధుల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

తమన్‌ పాటలు ట్రెండీగా చాలా బాగున్నాయి. పాటలన్నీ చక్కగా కుదిరాయి కానీ వాటి ప్లేస్‌మెంట్స్‌ కుదర్లేదు. అలాగే ఆడియోలో ఉన్న కిక్‌కి తగ్గట్టు కొరియోగ్రఫీ కూడా లేదు. నేపథ్య సంగీతం బాగుంది. తమన్‌ ఫుల్‌ మార్క్స్‌ స్కోర్‌ చేసిన సినిమాల్లో ఇదొకటి. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ మరో ఎస్సెట్‌. ప్రతి ఫ్రేమ్‌ చాలా చాలా గ్రాండ్‌గా ఉంది. ఈమధ్య చాలా సినిమాలకి వస్తున్నట్టే దీనికీ ఎడిటింగ్‌ సమస్య తలెత్తింది. మరీ అంత నిడివి ఇలాంటి సినిమాకి అవసరం లేదు. ఒక ఇరవై నిముషాల నిడివి తగ్గించుకుని ఉంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండేది. నిర్మాతలు సినిమాకి బాగా ఖర్చు పెట్టారు. వారు పెట్టిన ఖర్చుని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ తెరపై చూపించారు. సంభాషణలు బాగున్నాయి... ముఖ్యంగా అల్లు అర్జున్‌కి రాసినవి.

సురేందర్‌రెడ్డి తనకి కమర్షియల్‌ సినిమాలు తీయడంపై ఉన్న కమాండ్‌ మళ్లీ చూపించాడు. కామెడీ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. సినిమాలో ఉన్నదంతా రొటీన్‌ తంతే అయినా కానీ వినోదాన్ని మిస్‌ అవలేదు. ప్రతి క్యారెక్టర్‌తో ఎంతో కొంత వినోదం అందించడానికి చూసారు. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్‌కి కూడా చోటు కల్పించాడు.

హైలైట్స్‌:

  • అల్లు అర్జున్‌ పర్‌ఫార్మెన్స్‌
  • బ్రహ్మానందం ఎపిసోడ్‌
  • కామెడీ
  • సాంగ్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • లెంగ్త్‌ మరీ ఎక్కువయింది
  • విలన్‌ పర్‌ఫార్మెన్స్‌ చాలా వీక్‌

విశ్లేషణ:

ఒకానొక కీలక సన్నివేశంలో... అల్లు అర్జున్‌ ఒక హెల్ప్‌ చేయమని పోసాని కృష్ణమురళిని అడిగితే... ‘మరీ అలా ఎలా చేస్తామయ్యా లాజిక్‌ లేకుండా’ అని పోసాని అంటాడు. ఇది లాజిక్‌కి అందని విషయమని తెలిసినా కానీ చిత్ర రచయితలు, దర్శకుడు వినోదం కోసం లాజిక్‌ని ‘కావాలని’ వదిలేసారు. మసాలా ఎంటర్‌టైనర్స్‌లో లాజిక్స్‌ వెతుకుతూ కూర్చుంటే ఇక సినిమాని ఎంజాయ్‌ చేయడం కష్టం. వందల కొద్దీ మసాలా ఎంటర్‌టైనర్స్‌ చూసేసి ఉన్న మన ప్రేక్షకులు కూడా ఇప్పుడు వాటిని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని ఇప్పటికీ చెల్లుబాటు అయిపోతూ కోట్లు కొల్లగొడుతున్న సినిమాలని బట్టి అర్థమవుతోంది.

రేసుగుర్రం సినిమా ట్రేడ్‌మార్క్‌ టాలీవుడ్‌ ఎంటర్‌టైనర్‌. మొదలు పెట్టిన దగ్గర్నుంచి చివరి వరకు ఎలా వినోదం అందించాలా అనే దాని మీదే రచయితలు, దర్శకుడు కాన్సన్‌ట్రేట్‌ చేసారు. ప్రతి క్యారెక్టర్‌తోను వీలయినంత నవ్వించాలని చూసారు. అక్కడక్కడా వారి ప్రయత్నం ‘డెస్పరేషన్‌’ అనిపించినా కానీ ఎయిమ్‌ అయితే రీచ్‌ అయిపోయారు. కేవలం కామెడీతో ఒక సంపూర్ణమైన తెలుగు సినిమా తయారవదు కాబట్టి ఒక విలను, ఒక చిన్న లవ్‌స్టోరీ, చిన్న సెంటిమెంటు కూడా జత చేసారు.

అన్నీ అందించాలనే ప్రయత్నంలో అవసరం లేనివి కూడా కొన్ని కలిపేసారనిపిస్తుంది. కొన్ని త్రెడ్స్‌ అసలు లేకుండానే ఈ సినిమా తీసి ఉండొచ్చు. అయితే తీసుకున్న పాయింట్‌లో పెద్దగా మేటర్‌ లేనపుడు ఏదో ఒకటి చేసి మ్యాజిక్‌ చేయాలని చూస్తుంటారు. ఆ ప్రయత్నంలో రేసుగుర్రం పరుగెత్తాల్సింది పోయి ఒక్కోసారి అలసిపోయి నిలబడిపోయింది. అయితే చివరి రీల్స్‌లో మరోసారి ఊపందుకుని బ్రహ్మానందం సాయంతో హ్యాపీగా రేసు గెలిచేసింది.

సమ్మర్‌ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌ ఇది. మార్కెట్‌లో మరే ఆప్షన్స్‌ లేకపోవడం రేసుగుర్రంకి కలిసి వస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి తోడు రిలీజ్‌ టైమింగ్‌ కలిసి వచ్చింది కాబట్టి కొన్ని రోజులు ఈ గుర్రం దౌడు తీస్తుంది. దీనికి అల్లు అర్జున్‌ సినిమాలన్నిటినీ దాటే శక్తి ఉందా లేదా అనేది వేచి చూడాలి.

బోటమ్‌ లైన్‌:  గెలుపు గుర్రమే!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?