Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సరైనోడు

సినిమా రివ్యూ: సరైనోడు

రివ్యూ: సరైనోడు
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌
తారాగణం: అల్లు అర్జున్‌, ఆది పినిశెట్టి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరీన్‌ ట్రెసా, శ్రీకాంత్‌, సుమన్‌, సాయికుమార్‌, బ్రహ్మానందం, అన్నపూర్ణ, విద్యుల్లేఖారామన్‌, సురేఖ వాణి తదితరులు
మాటలు: యం. రత్నం
సంగీతం: తమన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: రిషి పంజాబీ
నిర్మాత: అల్లు అరవింద్‌
కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: ఏప్రిల్‌ 22, 2016

బోయపాటి ఊర మాస్‌ సినిమాలకి పెట్టింది పేరయితే, అల్లు అర్జున్‌ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో స్టార్‌ అయినవాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌ అంటేనే నూనె, నీళ్లలా అనిపించింది. అసలు ఎలా మిక్స్‌ అవుతుంది? ఆ మిశ్రమం చూడ్డానికి ఎలా ఉంటుంది? అంటూ మొదట్నుంచీ ఈ కలయిక గురించి చాలా కనుబొమ్మలు పైకి లేచే ఉన్నాయి. బోయపాటి శైలికి తగ్గట్టు అల్లు అర్జున్‌ మౌల్డ్‌ అయిపోతాడా, లేక అల్లు అర్జున్‌ ఇమేజ్‌కి తగిన విధంగా బోయపాటి ఛేంజ్‌ అవుతాడా? ఆన్సర్‌ కోసం సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిన పని లేకుండా టీజర్‌లోనే 'ఎర్రతోలుతో స్టయిల్‌గా కనిపించినా కానీ మాస్‌, ఊర మాస్‌' అంటూ క్లారిటీ ఇచ్చేసారు. బోయపాటి సినిమాలంటే రక్తపాతం, హింస మితి మీరి ఉండాల్సిందే. బాలకృష్ణలాంటి పక్కా మాస్‌ హీరోకి బోయపాటి మార్కు మాస్‌ మసాలా ఎంత ఉన్నా చెల్లిపోతోంది కానీ మిగతా హీరోలకీ అదే రేంజి చూపిస్తే 'ఓవర్‌డోస్‌' అయిపోతోంది. 'దమ్ము'లో మాస్‌, మాస్‌ అంటూ కదం తొక్కిన బోయపాటి శ్రీనుకి 'సరైనోడు' విషయంలో కంచెలు వేసే ప్రయత్నాలైతే జరిగాయి. అతని ఇటీవలి సినిమాల్లో అంతగా కానరాని వినోదానికి చోటివ్వడానికి గట్టిగానే కృషి జరిగింది. అయితే యాక్షన్‌ సీన్లు వచ్చినప్పుడల్లా, విలన్‌ తెర మీదకి వచ్చినప్పుడల్లా బోయపాటి ఆ కంచెలు తెంచేసుకున్నాడు. రక్తంతో వెండితెరని కడిగి పారేసాడు. 

బోయపాటి హీరోకి సిస్టమ్‌ అంటే లెక్క ఉండదు. ఎవరినైనా కేర్‌ చేయడు. మరి అదే ఆటిట్యూడ్‌ దర్శకుడిది కూడానేమో, అందుకే ఎంతటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ని అయినా కానీ చాలా తేలిక చేసేస్తాడు. విలన్‌ పేరు చెబితే ఇందులో ప్రతి ఒక్కరూ వణికిపోతారు. డిజిపి, ఛీఫ్‌ సెక్రటరీ నుంచి ఎవరైనా కానీ భయంతో గజగజలాడిపోతారు. అంత పవర్‌ఫుల్‌ విలన్‌ని హీరో ఢీకొంటే ఎలాగుంటుంది? అవును, ఎలా ఉంటుంది? ఊహించడానికి బాగుంది కదా? ఆ ఊహే ఈ సినిమా. అలాంటి విలన్‌ని హీరో ఢీకొంటే ఎలా ఉంటుంది అనే కాన్‌ఫ్లిక్ట్‌ చుట్టూనే కథ నడుస్తుంది. అయితే తీరా ఆ 'ఘట్టం' వచ్చేసరికి బోయపాటి హీరో ముందు అంతటి విలన్‌ కూడా గుడ్లు తేలేస్తాడు. ఈ విలన్‌ని హీరో టచ్‌ చేస్తే రిజల్ట్‌ ఏంటి అనే టెన్షన్‌ లేకుండా మనకి ప్రతి సన్నివేశంలోను కథానాయకుడు 'సూపర్‌ హీరో'లా కనిపిస్తాడు. అతను అనుకుంటే ఏదైనా జరిగిపోద్ది, కాదనుకుంటే ఎవరైనా ఆగిపోవాలి. చివరకి చావైనా సరే అతను చెప్పిన మాటే వింటుంది. ఒంట్లోకి గన్‌లోని మ్యాగజైన్‌ మొత్తం దిగిపోయినా కానీ హీరో బాబాయ్‌కి ఏమీ అవదనే ఫీలింగ్‌ వస్తుందంటే ఇందులో హీరోని ఎలా చూపించి ఉంటారనేది మీరే ఊహించుకోండి. ఎవరినైనా లిటరల్‌గా 'ఎత్తి కుదేసే' హీరో బలిసిన జబ్బల పక్కన విలన్‌ కూడా బక్క పల్చగానే కనిపిస్తాడు. 

విలన్‌ని ఎంత గ్లోరిఫై చేస్తే, హీరోకి అతడిని ఎదుర్కోవడం ఎంత కష్టతరం చేస్తే అంత ఎమోషన్‌ పండుతుందనే సంగతి తెలుగు ఫిలిం మేకర్స్‌కి ఎప్పుడు అర్థమవుతుందో మరి. కనీసం ఏ ఒక్క పాయింట్‌లో కూడా హీరోని ఛాలెంజ్‌ చేసే విధంగా విలన్‌ కనిపించడు. విలన్‌కి కనీసం ఒక్క సందర్భంలో అయినా హీరోపై పై చేయి ఉండదు. ఇక వారిద్దరి మధ్య పోరులో ఏం ఉత్కంఠ ఉంటుంది? సమవుజ్జీల మధ్య మ్యాచ్‌ అయితే ఇంట్రెస్టింగ్‌గా టీవీలకి అతుక్కుపోతాం కానీ, కెన్యాతో ఇండియా క్రికెట్‌ ఆడుతుందంటే ఇక ఆ మ్యాచ్‌ మీద ఆసక్తి ఏం ఉంటుంది? అలాంటి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎన్నిసార్లు వస్తుంది? అంత ప్రిడిక్టబుల్‌గా, అంత అన్‌ఇంటెరిస్టింగ్‌గా హీరో, విలన్‌ పోరుని సెట్‌ చేసి ఉత్కంఠగా చూడండంటే ఎలా కుదురుతుంది? 

విలన్‌ అంతటి పవర్‌ఫుల్‌ వ్యక్తి అయి ఉండీ తుపాకులు అంతగా వాడడు. తనపై చేయి చేసుకున్న హీరోయిన్‌ పరిగెడుతుంటే వెనక ఓపిగ్గా కత్తులేసుకుని ఉరుకుతుంటారే కానీ కాల్చి పారేయాలని అనుకోరు. ఆమె అలా నాలుగు రోజులు పరుగెత్తి హీరో దగ్గరకి వచ్చాక కానీ విలన్లు ఆమె దగ్గరకి రాలేరు. హీరోపై తుపాకీ వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఒక సందర్భంలో ఎవరో తనని రెండుసార్లు కాలిస్తే, ఏదో మీదకి టీచర్‌ చాక్‌పీస్‌ ముక్క విసిరితే తప్పుకున్నట్టు అలా సైడ్‌కి చిన్న జర్క్‌ ఇచ్చి తప్పుకుంటాడు. ఒకవేళ గురి బాగుండి కాల్చినా కానీ హీరోకేం అవదు. ఎందుకంటే హీరో కదా? హీరో బాబాయ్‌కే అన్ని బుల్లెట్లు తగిల్తే ఈజీగా బతికిపోతే, ఇక హీరోకి ఏం జరుగుతుంది చెప్పండి? 

సరిగ్గా గమనిస్తే బోయపాటి శ్రీను రాసుకున్న కథ మొత్తం ఒకే సీన్‌ చుట్టూ తిరుగుతుంది. హీరో ఒక పెళ్లి చూపులకి వెళ్లాడు, అక్కడ అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోయారు. వారిని కొట్టి ఆమెని వెనక్కి తెచ్చాడు. దాంతో ఆ అమ్మాయి జీవితం మారిపోయింది. తన వాళ్లందరినీ చంపేసిన విలన్‌ ఆమెని కూడా చంపబోతోంటే హీరో ఆమెకి అండగా నిలుస్తాడు. ఇంతే 'సరైనోడు' కథ. ఇంత చిన్న కథని అన్ని గంటల సినిమాగా, అందులోను ఆసక్తికరంగా తీర్చిదిద్దడం తేలికేం కాదు. బలమైన కథ లేనప్పుడు కథనం విషయంలో బరువు బాధ్యతలు తప్పవు. ఈ సీన్‌ చుట్టూ మిగతా మేటర్‌ అల్లడానికి దర్శకుడు చాలా సబ్‌ ప్లాట్స్‌ పెట్టుకున్నాడు. అందులో భాగంగా హీరో ఒక ఎమ్మెల్యేని ప్రేమిస్తాడు. తండ్రి చనిపోతే విదేశాల్లో చదువుకుంటోన్న అమ్మాయి సడన్‌గా ఎమ్మెల్యే అయిందట. అంత మాత్రాన ఎమ్మెల్యేలకి ఒక డ్రస్‌ కోడ్‌ ఉండదా? స్లీవ్‌లెస్‌ టాప్‌లు, చిరిగిన జీన్స్‌లు వేసుకుంటారా? ఈమె హీరోయిన్‌ కాదని, హీరో ఎంత టైమ్‌ వేస్ట్‌ చేసినా అసలు హీరోయిన్‌తోనే హీరో కలుస్తాడని తెలిసినప్పుడు ఇదంతా టైమ్‌ వేస్ట్‌ వ్యవహారం. పైగా ఆ పార్ట్‌ అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా తియ్యలేదు... ఒక్క నవ్వించిన పెళ్లి చూపుల సన్నివేశం మినహా. 

'డాడీ' ఫైట్‌ దగ్గర్నుంచి 'తెలుసా తెలుసా' పాట వరకు సినిమా చాలా సెన్సిబుల్‌గా, ఇది 'బోయపాటి' సినిమాయేనా అని గిల్లి చూసుకునేంత క్లాస్‌గా నడుస్తుంది. ఇలా ఒకటీ అరా సందర్భాల్లో 'సరైనోడు' ఫర్వాలేదనిపించినా కానీ చాలా చోట్ల నాన్సెన్సికల్‌గా, ఇల్లాజికల్‌గా అనిపిస్తుంది. రౌడీలని ఒంటి చేత్తో ఎత్తి పట్టుకుని నడిచి వెళ్లిన అల్లు అర్జున్‌ ఈ సినిమాని దాదాపుగా అలాగే తన చేతుల మీద మోయాల్సి వచ్చింది. కథ, కాకరకాయ పక్కనపెట్టి కేవలం అల్లు అర్జున్‌ని చూడ్డానికి వెళితే, తన వరకు పైసా వసూల్‌ అనిపిస్తాడు. ప్రతి పాత్రలోకి అంత అలవోకగా పరకాయ ప్రవేశం చేస్తోన్న బన్నీ తన స్టయిలింగ్‌ దగ్గర్నుంచి, తన ఫిజిక్‌ వరకు అన్నిట్లోను చాలా శ్రద్ధ తీసుకున్నాడు. కొన్ని నాసి రకం సన్నివేశాలని కూడా ఫర్వాలేదనిపించేలా మోసాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎక్కువ సమయం ఏడుస్తూనే కనిపించింది. కేథరీన్‌ ఎమ్మెల్యేలు ఇలాక్కుడా ఉంటారా అనిపించేట్టుంది. ఆది పినిశెట్టి స్టయిలిష్‌గా కనిపించాడు కానీ తన పాత్రకి ఇచ్చిన బిల్డప్‌కి తగ్గట్టు భయానకంగా ఒక్క సీన్లోను కనిపించలేదు. సటిల్‌గా నటించే తనలాంటి నటుడు బోయపాటి మార్కు లౌడ్‌ విలన్‌గా సెట్‌ అవడు. శ్రీకాంత్‌, సాయికుమార్‌తో సహా చాలా మంది నటీనటులున్నా కానీ ఎవరికీ గుర్తుండిపోయే పాత్రలు లేవు. 

ఈ మధ్య ఎంత కమర్షియల్‌ సినిమాలో అయినా ఆరు పాటలు, ఆరు ఫైట్ల సంఖ్యని తగ్గించడానికే చూస్తున్నారు. కానీ బోయపాటి టెంప్లేట్‌లో వాటిని తగ్గించే వీల్లేదు. కొన్ని రోజుల పాటు యాక్షన్‌ సీన్‌ చూడ్డానికే మొహం మొత్తేసేటన్ని ఫైట్లున్నాయి. తమన్‌ పాటల్లో ఒకటి, రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆ వైబ్రేటింగ్‌ ఎఫెక్ట్‌తో ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్‌కి మార్కులు పడతాయి. బోయపాటి శ్రీను అవసరం లేని చోట్ల ప్రతాపం చూపించాలని చూసి, చూపించాల్సిన చోట చేతులెత్తేసాడు. పతాక సన్నివేశాలకి ముందు సినిమా పూర్తిగా రాంగ్‌ ట్రాక్‌ పట్టేస్తుంది. ఎప్పుడయితే అంతవరకు ఇచ్చిన బిల్డప్‌కి తగ్గట్టుగా విలన్‌ నడుచుకోవడం లేదో అక్కడే దీని ఆయువు 'పట్టు' పూర్తిగా సడలింది. 

అల్లు అర్జున్‌ వీరాభిమానులు, ఎత్తి కుదేసే టైపు యాక్షన్‌ సీన్ల ప్రియులు మినహా ఇంత ఓవర్‌డోస్‌ మాస్‌ మసాలాని జీర్ణించుకునే శక్తి మామూలు ప్రేక్షకులకి ఉండదు. మాస్‌ జనాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని తీసిన ఈ ఊర మాస్‌ చిత్రానికి వారి సైడ్‌ నుంచి ఎంత సపోర్ట్‌ వస్తే అంత మైలేజ్‌.

బోటమ్‌ లైన్‌: బోయపాటి బ్రాండ్‌ మాస్‌ మసాలా!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?