రివ్యూ: శ్రీమంతుడు
రేటింగ్: 3.25/5
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, మహేష్‌బాబు ప్రొడక్షన్స్
తారాగణం: మహేష్, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్, ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిషోర్, సుకన్య, సితార, తులసి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
పోరాటాలు: ఎఎన్‌ఎల్ అరసు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ (సివిఎం)
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: ఆగస్టు 7, 2015
మనకి అన్నీ ఇచ్చిన ఊరుకి తిరిగి ఏదైనా చెయ్యడం, సొంత ఊరుని దత్తత తీసుకుని అక్కడి అవసరాలన్నీ సమకూర్చడం అనే పాయింట్‌లో చాలా డెప్త్ వుంది. మంచి డ్రామా, భావోద్వేగాలు నిండిన క్లాసీ సినిమా అవడానికి తగ్గ కాన్సెప్ట్ ఇది. ఇలాంటి పాయింట్‌కి ఒక కమర్షియల్ స్క్రీన్‌ప్లే రాయవచ్చుననే ఆలోచన వచ్చినందుకే రచయిత, దర్శకుడు కొరటాల శివని మెచ్చుకోవాలి. మహేష్‌లాంటి సూపర్‌స్టార్‌తో ఇలాంటి కథ చేద్దామని అనుకోవడంలోనే చాలా సాహసముంది. ఆ కథని కమర్షియల్‌గా చెప్పగలననే నమ్మకం ఉండడమే కాక, అందుకు అనుగుణంగా కథనం రాసుకున్న తీరు మాత్రం అబ్బుర పరుస్తుంది.
ఊర్లోని మంచితో పాటు చెడుని కూడా దత్తత తీసుకున్నా అనేయడం తేలికే. కానీ అటు హీరో పాత్రౌచిత్యం దెబ్బ తినకుండా, ఇటు కథ నేల విడిచి సాము చేస్తున్న భావన రాకుండా ఎమోషన్‌ని, యాక్షన్‌ని పక్క పక్కన పెట్టి పరుగెత్తించడం ఈజీ టాస్క్ కానే కాదు. రచయితగా అనుభవమున్న కొరటాల శివ దర్శకుడిగా మారిన తర్వాత కూడా రైటర్‌గా తనకున్న అడ్వాంటేజ్‌నే యూజ్ చేసుకుంటున్నాడు తప్ప ఫ్లాషీ, స్టయిలిష్, ఓవర్ ది టాప్ టేకింగ్ జోలికి పోవడం లేదు. 'మిర్చి' కథ వినడానికి చాలా మామూలు కథలా వుంటుంది. కానీ అందులో అటు ఎమోషన్స్‌కి, ఇటు యాక్షన్‌కి ఆస్కారమున్న కథనంతో కాక పుట్టించాడు. ఊరి బాగు కోసం శత్రువుతో కలిసి ప్రేమగా వుండడానికి సిద్ధపడ్డ హీరో పాత్ర కంటే, ఊరిని దత్తత తీసుకుని, తనకున్న దాంట్లో కొంత ఊరికి తిరిగివ్వాలనే లక్షణాలున్న పాత్ర సాత్వికంగా తోస్తుంది. ఇక్కడ హీరోయిజం మిక్స్ చేయడం మరింత కష్టం. కానీ రైటర్‌గా తన టాలెంట్‌ని శివ చాలా బాగా చూపించాడు.
ముగ్గురు విలన్లని మూడు దశల్లో హీరో కలుసుకోవడం, ఆ తర్వాత ముగ్గురినీ ఒకే చోట కలవడం… ఇలా యాక్షన్ త్రెడ్‌ని అసలు కథతో పాటు కలిపి తెలివిగా కుట్టేశాడు. సైకిలేసుకుని తిరుగుతూ, కుటుంబాలు కలిసుండడం వల్ల వుండే మంచి గురించి బోధించే హీరో ఆ వెంటనే వెళ్లి వస్తాదుల్ని ఎత్తి కుదేసేయడం మామూలుగా అయితే సింక్ అవ్వదు. కానీ హీరో ఆటిట్యూడ్‌ని మొదట్లోనే బాగా రిజిష్టర్ చేసి, ఎప్పటికప్పుడు అతనిలోని సాఫ్ట్ మరియు హార్డ్ యాంగిల్స్‌ని స్పష్టంగా చూపిస్తూ ఆ బ్యాలెన్స్ పాటించాడు. రచయితగా శివ చాతుర్యం తెలిసే మరో కోణం.. జగపతిబాబు పాత్రకి రాసిన గతం. అది రైటర్‌గా మాస్టర్ స్ట్రోక్.
ఇక సంభాషణల్లో కూడా శివ ప్రతి సన్నివేశంలో తన బలం చాటుకున్నాడు. తండ్రి, కొడుకుల మధ్య సంభాషణ, నాయికానాయకుల మధ్య సంభాషణ, నాయకుడు-ప్రతినాయకుడి మధ్య సంఘర్షణ, కుటుంబాలు కలిసి వుండడం గురించి ఇచ్చే వివరణ… అన్నిట్లోను శివ ముద్ర తెలుస్తుంది. అయితే రచయితగా తనెంత మంచి పాత్రని తీర్చిదిద్దినా, ఎంత ఉన్నతమైన విలువల్ని ఊహించుకున్నా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నటుడు దొరకనప్పుడు అదంతా వృధా అయిపోతుంది. ఇందులో హర్షవర్ధన్ పాత్రలోకి మహేష్ ఒదిగిపోయాడు. అతని నటన చూస్తున్నప్పుడు ఒక శ్రీమంతుడు తన ఊరి కోసం పడే తపనే కనిపిస్తుంది తప్ప అతనొక సూపర్‌స్టార్ అనిపించడు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని, ఆ భావోద్వేగాల్ని ఆకళింపు చేసుకుంటే తప్ప ఇలాంటి పర్‌ఫార్మెన్స్ వీలు కాదు. ప్రతి చిత్రానికీ మహేష్ తన నటన, ఆహార్యం, వాచకంలో చూపిస్తోన్న మార్పులు అనితర సాధ్యం. ఇలాంటి నటుడు ఉండడం తెలుగు సినిమా అదృష్టం.
ఫ్లాలెస్ పర్‌ఫార్మెన్స్‌తో కథానాయకుడు కదం తొక్కుతుంటే కథాపరంగా వున్న లోటుపాట్లు కూడా కొన్నిసార్లు కనుమరుగు అయిపోతుంటాయి. ఇక సపోర్టింగ్ కాస్ట్ కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ఎంత డబ్బున్నా కొడుకు మనసు గెలుచుకోలేని తండ్రిగా, అతడి నుంచి ఫోన్ కాల్ వస్తేనే మురిసిపోయే అపర శ్రీమంతుడిగా జగపతిబాబు నటన బాగుంది. శృతిహాసన్ కూడా కీలక సన్నివేశాల్లో తన వంతు చేయగలిగింది చేసింది. రాజేంద్రప్రసాద్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ విలనీ బాగానే పండింది. సుకన్య, సితార, తులసి.. ఇలా ప్రతి ఒక్కరి ప్రెజెన్స్ తెలిసింది. వెన్నెల కిషోర్, అలీ ద్వయం సీరియస్ టోన్‌లో వున్న సినిమాకి కాస్త సరదానద్దింది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటల్లో జాగోరే, శ్రీమంతుడా, జత కలిసే సంగీత పరంగా, సాహిత్య పరంగా (రామజోగయ్య శాస్త్రి) కూడా బాగున్నాయి. జాగోరే పాట చిత్రీకరణ సినిమాలో మేజర్ హైలైట్స్‌లో నిలుస్తుంది. అరసు ఫైట్లు కాన్సెప్ట్ బేస్డ్‌గా వున్నాయి. దర్శకుడి ముద్ర తెలిసే ఫైట్లన్నమాట. పెళ్లి మండపంలో వచ్చే ఫైటు, మావిడితోటలో వచ్చే ఫైట్ ఆకట్టుకుంటాయి. కథానుసారం మందకొడి గమనం అర్థం చేసుకోదగిందే అయినప్పటికీ ద్వితీయార్థం చివర కొంచెం ఎక్కువ సాగతీసినట్టు అనిపిస్తుంది. ఫైటు, పాట, ఫైటు.. ఇలా వచ్చే ఆ సీక్వెన్స్ దగ్గర ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. మొదటి సినిమాకే నిర్మాతలు అభిరుచిని చాటుకున్నారు. కమర్షియల్ సినిమానే అయినా కథాబలం వున్నది ఎంచుకుని, రాజీ పడకుండా ఖర్చు పెట్టారు.
స్టోరీ టేకాఫ్ కావడానికి కాస్త ఎక్కువ సమయమే అవసరమైంది. సినిమా ఆరంభంలో అంత ఉత్తేజం లేకపోయినప్పటికీ ముఖేష్‌రిషికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం, పెళ్లి మండపంలో ఫైట్ సీన్‌లాంటివి పెట్టి గ్రాఫ్ పడకుండా కేర్ తీసుకున్నారు. ఎక్కువ శాతం ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం ఫక్తు హాస్య ప్రియులకి అంతగా రుచించకపోవచ్చు. ఊరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన హీరో… చివర్లో తండ్రి వెంట అలా ఉన్నపళంగా వెళ్లిపోవడం సబబు అనిపించలేదు. తను లేని మరుక్షణం అక్కడేం జరుగుతుందనేది తెలిసిన కథానాయకుడు అలా కదిలి వెళ్లిపోకుండా కథని అక్కడే ఒక కొలిక్కి తీసుకు రావాల్సిందేమో. లోపాలు లేకపోవడమంటూ లేదు కానీ ఇలాంటి సున్నితమైన కథని, మెజారిటీ ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలోనే 'శ్రీమంతుడి' విజయ రహస్యం దాగి వుంది. వాణిజ్యాంశాలతో కూడిన ఉత్తమ లక్షణాలున్న ఇలాంటి అరుదైన చిత్రాన్ని అందించినందుకు శ్రీమంతుడి బృందాన్ని అభినందించాలి.
బోటమ్ లైన్: మనసులు గెలిచే 'శ్రీమంతుడు'
– గణేష్ రావూరి