సినిమా రివ్యూ: టైగర్‌

రివ్యూ: టైగర్‌ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: ఎన్‌.వి.ఆర్‌. సినిమా తారాగణం: సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, సీరత్‌ కపూర్‌, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, ప్రవీణ్‌ తదితరులు మాటలు: అబ్బూరి రవి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌…

రివ్యూ: టైగర్‌
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ఎన్‌.వి.ఆర్‌. సినిమా
తారాగణం: సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, సీరత్‌ కపూర్‌, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, ప్రవీణ్‌ తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌
కూర్పు: చోటా కె. ప్రసాద్‌
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
సమర్పణ: ఠాగూర్‌ మధు
నిర్మాత: ఎన్‌.వి. ప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: వి ఐ ఆనంద్‌
విడుదల తేదీ: జూన్‌ 26, 2015

ఫస్ట్‌ హాఫ్‌లో కొత్తదనం కోసం ఆరాటం… సెకండ్‌ హాఫ్‌లో కమర్షియల్‌గా పాస్‌ అవడం కోసం ఆత్రం! ఈ రెండు పద్ధతుల్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే సినిమా చూసే ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించడానికే ఏ దర్శకుడైనా ప్రయత్నించాలి. అదే సమయంలో తన ప్రయత్నం నిర్మాతకి భారం కాకుండా ఉండేందుకు వాణిజ్య పరంగా నిలబడడానికి అవసరమైన అంశాలూ పొందు పరచాలి. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్‌ అదే సందిగ్ధానికి లోనయి.. తన సినిమాలో రెండూ వుండేలా చూసుకున్నాడు. కానీ ఆ కొత్తదనాన్ని, కమర్షియల్‌ గుణాన్ని బ్యాలెన్స్‌ చేయడంలో మాత్రం తడబడ్డాడు. 

యాక్సిడెంట్‌లో చలనం కోల్పోయి రోడ్‌పై పడిన వాడు తన పరిస్థితిని వివరిస్తూ, ఒక్క క్షణంలో తన పరిస్థితి రివర్స్‌ అయిపోయిందే అని బాధ పడుతూ, తనకి సాయం చేయని వారిని తిట్టుకుంటూ, సాయం చేయడానికి వచ్చిన వాడిని దేవుడంటూ పొగిడేస్తూ… తనకీ పరిస్థితి రావడానికి కారణమైన రెండు రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. అతని స్వగతంలోంచి కనిపించే ఆ గతంలో చెప్పుకోతగ్గ గొప్ప అంశాలేమీ లేవు. కానీ స్నేహితుడి మంచి కోసం ఆలోచిస్తూ, అతనికి జీవితంలో అన్నీ సమకూరాలని నిస్వార్ధంగా తపించే స్నేహితుడు, అటు ప్రాణ స్నేహితుడు, ఇటు ప్రేమించిన అమ్మాయి మధ్య ఎమోషనల్‌గా ఇరుక్కున్నవాడు… క్యారెక్టర్లు, వాటి మధ్య కాన్‌ఫ్టిక్టులు బాగా కుదిరాయి. 

‘ఇన్నాళ్లూ నా మీద జాలి చూపించావా… మరి ప్రేమ ఎలా వుంటుందిరా? నేను నిన్ను చూసి అసూయ పడ్డాననిపించిందా… మరి స్నేహం ఎలా వుంటుందిరా?’ లాంటి ఆకట్టుకునే సంభాషణలు కొన్ని ఆర్డినరీ సన్నివేశాలని కూడా లిఫ్ట్‌ చేసాయి. కథగా చెప్పుకుంటే టైగర్‌లో ఎలాంటి ప్రత్యేకతలు లేవు. ఇన్‌ఫాక్ట్‌ చాలా పాత కథ. కుటుంబ పరువు కోసం కూతుర్ని చంపడానికి వెనకాడని తండ్రి ఓ ప్రేమ జంటని (సీరత్‌, రాహుల్‌) చంపడానికి చూస్తుంటే, దానికి అడ్డుపడే ఆ ప్రియుడి స్నేహితుడు (సందీప్‌). 

స్నేహితుల మధ్య చిన్నప్పుడే ఏర్పడ్డ బంధాన్ని ఎస్టాబ్లిష్‌ చేసి… ఒక ఇంట్రెస్టింగ్‌ నోట్‌లో అసలు కథని ఓపెన్‌ చేసి, దర్శకుడు తన ప్రతిభ బాగానే చూపించాడు. ఫస్ట్‌ హాఫ్‌ వరకు పాత కథని కొత్తగా చెప్పడానికి పెట్టిన ఎఫర్ట్‌ బాగా కనిపించింది. ఒక ఇమాజినరీ లవర్‌ని సృష్టించడం, ఆమె నిజంగా తన ముందుకి రావడం, వాళ్లిద్దరూ ప్రేమలో పడడం, దానిని అతని స్నేహితుడు అప్రూవ్‌ చేయకపోవడం.. వంటివి సాఫీగా, సరదాగా సాగిపోతాయి. 

అయితే ఈ కథకి వున్న సమస్య ఏంటంటే… ఏం జరుగుతుందనేది ముందే తెలిసిపోతూ వుంటుంది. ఇంటర్వెల్‌ పాయింట్‌లోనే నెక్స్‌ట్‌ ఏంటనేది క్లియర్‌ అయిపోతుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో దర్శకుడు కొత్తగా నెరేట్‌ చేసిన పద్ధతి వల్ల సెకండ్‌ హాఫ్‌లో కూడా అదే కొత్తదనం ఉండొచ్చుననిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం రొటీన్‌గా సాగిపోతుంది. టైగర్‌ రంగంలోకి దిగడం, సమస్య సాల్వ్‌ అయిపోవడం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. కమర్షియల్‌ రూట్‌ పట్టడం తప్పేమీ కాదు కానీ కనీసం మరీ రొటీన్‌గా అనిపించకుండా జాగ్రత్త పడి ఉండాల్సింది. 

రొటీన్‌ సీన్స్‌లో కూడా ఉత్కంఠ కలిగించవచ్చు కానీ దానికోసం కూడా ట్రై చేయకుండా సింపుల్‌గా ‘మమ’ అనిపించేసారు. ఇక్కడ గుర్తించదగ్గ విషయం ఏంటంటే.. కమర్షియల్‌ హంగుల కోసమని పాటలు గట్రా ఇరికించలేదు. సెకండాఫ్‌లో ఒక్క పాట కూడా లేకుండా పెద్ద త్యాగమే చేసారు. కానీ దాంతో పాటు ఏదైనా ఒక బాగా కదిలించే సన్నివేశం లేదా ఒక సంఘటన లాంటిది పెట్టుకుంటే టైగర్‌ ప్రత్యేకంగా అనిపించి ఉండేది. ఉదాహరణకి.. ‘గమ్యం’లో అల్లరి నరేష్‌ పాత్రలానో, అంతఃపురంలో జగపతిబాబు క్యారెక్టర్‌లానో ‘టైగర్‌’కి ఒక గుర్తుండిపోయే సెండ్‌ ఆఫ్‌ ఇచ్చి ఉండాల్సింది. ఒక మర్చిపోలేని సినిమాకీ, మామూలు సినిమాకీ ఉన్న డిఫరెన్స్‌ కోసం డైరెక్టర్స్‌ తమని తాము పూర్తిగా నమ్మి కమర్షియల్‌ ముగింపులకి అతీతంగా రిస్క్‌ చేయాలి. టైగర్‌కి అందుకు తగ్గ ముగింపుకి కావాల్సినదంతా ఉన్నా కానీ ఆ దిశగా వెళ్లే ధైర్యం మాత్రం చేయలేదు. 

నటన పరంగా సందీప్‌ కిషన్‌ ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా మొదలైన అరగంటకి కానీ పరిచయం కాని, హీరోయిన్‌ కూడా లేని పాత్రని ధైర్యంగా ఒప్పుకుని చేసినందుకు మెచ్చుకోవాలి. యాక్షన్‌ హీరోగా తనకున్న లిమిటేషన్స్‌ హార్డ్‌ హిట్టింగ్‌ యాక్షన్‌కి స్కోప్‌ ఇవ్వలేదేమో అనిపించింది. సందీప్‌ వరకు ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రాహుల్‌ రవీంద్రన్‌ ఓకే అనిపించాడు. సీరత్‌ కపూర్‌ కూడా ఫర్వాలేదు. విలన్స్‌ ఇద్దరూ ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా తేలిపోయారు. కమెడియన్స్‌కి అంతగా స్కోప్‌ దక్కలేదు. 

సంభాషణలు కొన్ని బాగున్నాయి. ఉన్న మూడు పాటలు సోసోనే కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. చోటా కె. నాయుడి అనుభవం ఈ చిత్రాన్ని విజువల్‌గా ఉన్నతంగా నిలబెట్టింది. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త కేర్‌ తీసుకుని ఉండాల్సింది. దర్శకుడు విఐ ఆనంద్‌ తన సాంకేతిక విభాగం నుంచి మంచి అవుట్‌పుట్‌ రాబట్టుకున్నాడు. ప్రథమార్థంలో చాలా ప్రామిస్‌ చూపించాడు. అయితే ద్వితీయార్థాన్ని చాలా రొటీన్‌గా తీసేసి ఒకింత నిరాశపరిచాడు.

ఆకట్టుకునే ఫస్ట్‌ హాఫ్‌, సందీప్‌ కిషన్‌ సిన్సియర్‌ ఎఫర్ట్‌, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, చోటా సినిమాటోగ్రఫీ టైగర్‌కి ప్లస్‌ పాయింట్స్‌. ఈ ప్లస్సులతో ఈ టైగర్‌ చేసే సైలెంట్‌ రోర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతవరకు ప్రతిధ్వనిస్తుందనేది చూడాలి.

బోటమ్‌ లైన్‌: చూడదగ్గ టైగరే!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri