Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: వర్ణ

సినిమా రివ్యూ: వర్ణ

రివ్యూ: వర్ణ
రేటింగ్‌: 0.5/5
బ్యానర్‌: పివిపి సినిమా
తారాగణం: ఆర్య, అనుష్క, అశోక్‌ కుమార్‌ తదితరులు
సంగీతం: హారిస్‌ జైరాజ్‌
నేపథ్య సంగీతం: అనిరుధ్‌
కూర్పు: కోలా భాస్కర్‌ 
కళ: కిరణ్‌
ఛాయాగ్రహణం: రామ్‌జీ
నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి
కథ, కథనం, దర్శకత్వం: శ్రీ రాఘవ
విడుదల తేదీ: నవంబర్‌ 22, 2013

7/జి, బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తదితర చిత్రాలతో తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌కి ఇక్కడ కూడా మంచి గుర్తింపొచ్చింది. అతని దర్శకత్వంలో రూపొందిన సినిమా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత బాగుంటుందనే నమ్మకం కలిగింది. అయితే శ్రీ రాఘవ ఈమధ్య తన శైలి ప్రేమకథలు మానేసి కొత్త జోనర్స్‌ ఎక్స్‌ప్లోర్‌ చేయడం మీద కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు. ‘యుగానికి ఒక్కడు’ ద్వితీయార్థంలోనే అదో రకం అనుభూతిని కలిగించినా, ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న థ్రిల్స్‌ వల్ల అది ఇక్కడ పాస్‌ అయిపోయింది. ఈసారి ‘ఫాంటసీ’ జోనర్‌లో ప్రయోగం చేశాడు. నిస్వార్ధమైన, నిజమైన ప్రేమకి మరణం ఉండదని తనదైన శైలిలో చెప్పాలని చూశాడు. 

కథేంటి?

రెండు జంటల ప్రేమకథ ఇది. భూగ్రహంపై ఉన్న మధు బాలకృష్ణ (ఆర్య), రమ్య (అనుష్క) ప్రేమించుకుంటారు. అలాగే భూగ్రహానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో లోకంలో మహేంద్ర (ఆర్య) అనాధ అయిన వర్ణని (అనుష్క) ప్రేమిస్తాడు. మధు, రమ్య ఇద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో అనూహ్య సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత మధు మరో లోకానికి వెళ్లిపోతాడు. అక్కడ అతని వల్ల ఆ లోకంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, మహేంద్ర, వర్ణ ఎలా ఒక్కటవుతారు అనేది మిగతా కథ. 

కళాకారుల పనితీరు!

దర్శకుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడనేది ప్రేక్షకులే కాకుండా కనీసం నటీనటులకి కూడా అర్థమైనట్టు లేదు. అందుకే ఆర్య, అనుష్క ఇద్దరూ కూడా పలు సన్నివేశాల్లో అయోమయంగా కనిపించారు. ఒక పాత్రలో వీరనారిగా ఎప్పుడూ ముఖం చిరాగ్గా పెట్టుకుని చూస్తూ, మరో పాత్రలో తనేం చేస్తుందో తనకే తెలియని సందిగ్ధావస్థలో ఉంటూ అనుష్క ఏదో చేసేసింది. కత్తి దూసే పాత్ర చేస్తున్నప్పుడు కనీసం కత్తి పట్టుకోవడమైనా నేర్చుకుని ఉండాల్సింది. ఆర్య అయితే ‘నేను దేవుడ్ని’లో బాలా క్రియేటివిటీ బారిన పడ్డట్టు ఈసారి శ్రీరాఘవ సృజనాత్మకతకి బలయ్యాడు. మిగిలిన పాత్రధారుల్లో ఆ ‘దేవత’ పాత్ర పోషించిన ఫారిన్‌ లేడీని ఎక్కడ్నుంచి తీసుకొచ్చారో కానీ క్లోజప్‌ వేసినప్పుడల్లా దేవతలు కనిపించేట్టు చేసింది. అలాగే ఆ ఫారిన్‌ రాజు, ఆ లోకంలో ఆర్య తండ్రి అందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి దర్శకుడి దాడిలో తాము కూడా భాగం పంచుకున్నారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

అనువాద సంభాషణల్ని అచ్చమైన తెలుగులో రాయవచ్చునని శ్రీరామకృష్ణ ఎప్పటికి తెలుసుకుంటాడో? అసలే సన్నివేశాలన్నీ మానని గాయాలు చేస్తుంటే సంభాషణలు కారం చల్లుతాయి. హారిస్‌ జైరాజ్‌ కూడా తను ఏ లోకానికి అప్పీల్‌ అయ్యే పాటలు చెయ్యాలో, అక్కడ ఏ వాయిద్యాలు వాడతారో తెలియని అయోమయంలో చిక్కుకున్నాడు. బహుశా నేపథ్య సంగీతం చేయడానికి కూడా తన బుర్ర ఇక పని చేసి ఉండదు. అందుకే అనిరుధ్‌తో ఆ పని చేయించుకున్నారు. కెమెరా పనితనం వరకు బాగానే ఉంది. కొన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఫర్వాలేదనిపించాయి కానీ అసలు ఆ వేరే లోకాన్ని సృష్టించాలని, అక్కడ వింత జంతువుల్ని పెట్టాలని శ్రీరాఘవకి ఎందుకు అనిపించిందో? జేమ్స్‌ కేమరూన్‌ అవతార్‌కి తన ఆన్సర్‌ ఇవ్వదలిచాడో ఏమో? పాపం అతడిని నమ్మి ఇన్ని కోట్లు ఈ సినిమాలో పోసిన పివిపి సినిమా వాళ్లని జాలి పడ్డం మినహా ఏమీ చేయలేం. 

శ్రీరాఘవ మామూలుగా ప్రేమకథలు బాగా తీస్తాడు. సహజమైన పాత్రలతో, చాలా సహజంగా అనిపించే సన్నివేశాలతో అతను తీసే ప్రేమకథలు బాగా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం కూడా ప్రేమ చుట్టే తిరిగినా కానీ దానిని ‘పిచ్చి’ డామినేట్‌ చేసింది. ఏదో చేసేయాలనే పిచ్చి. ఎంతో చూపించేద్దామనే పిచ్చి. చివరకు ఏం చేయాలో తెలీక, ఎలా చూపించాలో అర్థం కాక తాను తీసుకున్న క్రియేటివ్‌ గోతిలో తనే పడిపోయాడు దర్శకుడు. 

హైలైట్స్‌:

  •     మల్టీప్లెక్స్‌ థియేటర్లో కూడా ఆడియన్స్‌ పెద్దగా అరుస్తూ తమ ఆక్రోశం వెల్లగక్కడం

డ్రాబ్యాక్స్‌:

  •     ఇలాంటి సినిమాని మల్టీప్లెక్స్‌లో చూడాల్సి రావడం (సింగిల్‌ స్క్రీన్‌ ఆడియన్స్‌ అయితే తెరలు చించేయడం ఖాయం)

విశ్లేషణ:

రెండు లోకాల్లో రెండు ప్రేమకథలు జరుగుతున్నప్పుడు రెండిటికీ మధ్య లింక్‌ ఎలా పెడతాడనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రేమ గొప్పతనం గురించి మాట్లాడే సినిమాలో కనీసం ఒక్కటైనా గొప్పగా అనిపించే లవ్‌ సీన్‌ లేకుండా పోయింది. అయినా కానీ ఏదో కొత్తగా చూపించబోతున్నాడనే ఆసక్తి అసహనాన్ని జయించి కూర్చునేలా చేస్తుంది. తీరా అసలు పాయింట్‌కి వచ్చేసరికి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. తెరపై ఏం జరిగిందో అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. చూసింది నిజమా కాదా అని తేల్చుకోడానికి మనకి రిమోట్‌తో రివైండ్‌ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండదు కాబట్టి... ఒక్కసారి మనల్ని మనమే గిల్లుకుని చూసుకోవాలి. 

ఎక్కడో ఒక చోట ఈ చిత్రం గాడిన పడుతుంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని ఎదురు చూసే కొద్దీ దర్శకుడు చేసే క్రియేటివ్‌ ఎటాక్‌కి మెదడు చిత్తడి చిత్తడి అయిపోతుంది. ప్రేమ గొప్పతనం అంతా, ప్రేమ గొప్పతనం ఇంతా అంటూ ఎప్పటికప్పుడు లెక్చర్లు కూడా దంచుతుంటే... ‘ఛీ ఛీ... ప్రేమ ఇంత భయంకరంగా ఉంటుందా, ప్రేమలో పడితే పిచ్చి ఈ రేంజ్‌లో ముదుర్తుందా’ అనిపించి ప్రేమలో పడ్డ వాళ్లు కూడా అర్జంటుగా దానిని ఎలాగైనా వదిలించేసుకోవాలని అనుకుంటారు. 

అసలు ఆ రెండో లోకం ఏమిటి, అసలక్కడికి భూలోక వాసి ఎలా వెళ్లాడు... వెళ్లాక అక్కడ పువ్వులు ఎందుకు వికసించాయి? అసలు ఆ దేవత ఎవరు... ఆ దేవత కోసం రెండు దేశాల యుద్ధాలేంటి? సినిమా ముందుకి సాగే కొద్దీ ‘అహనాపెళ్లంట’లో సుత్తి వీరభద్రరావు పొజిషన్‌కి వచ్చేస్తారు ఎవరైనా సరే. అంతా అయిపోయిందిలే అనుకున్న తర్వాత దర్శకుడు మళ్లీ ఓ ట్విస్ట్‌ ఇస్తాడు... ఏ కొన ప్రాణమైనా మిగిలుంటే అది కూడా హరీమనేలా! 

ఒక సినిమా చూస్తూ బాలేదు అనుకోవడం మామూలే కానీ అసలేం తీశాడు, ఎందుకు తీశాడు, ఇంకా ఎందుకు చూస్తున్నాం అని మనల్ని మనమే పదే పదే ప్రశ్నించుకునేలా చేసేలా సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన హింసకి ప్రేక్షకుల్ని గురి చేసిన ఘనతని శ్రీరాఘవ ‘వర్ణ’తో సాధించాడు. దీనికంటే హాల్లోకి వెళ్లగానే కడుపులో గుద్దేసి, నాలుగు తన్నులు తన్నేసి బయటకి విసిరేసినా ఎక్కువ బాధ పడరు. ఫిజికల్‌ ఎటాక్‌ని అయినా తట్టుకోవచ్చు కానీ ఇలాంటి మానసిక దాడికి గురయితే మెదడులోని నాడులు చితికిపోయి వర్ణ సీక్వెల్స్‌ జనమే తెరకెక్కించే ప్రమాదముంటుంది. 

బోటమ్‌ లైన్‌:  ‘వర్ణ’నాతీతమైన హింస!

-వి.ఆర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?