జాతి సగర్వ ప్రతీక!

ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా వంద కోట్ల అవని జనులు మన గుండెల నిండా  జాతి ఘనత ప్రతీకగా అదే మనకు అండ ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా Advertisement కొత్త చేతులలోన భవితను …

ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా
వంద కోట్ల అవని జనులు మన గుండెల నిండా 
జాతి ఘనత ప్రతీకగా అదే మనకు అండ
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా

కొత్త చేతులలోన భవితను 
మనదు జాతి కొలువు దీర్ప
అవినీతి రూపుమాయుననే ఆశలు చిగుళ్లు తొడగగ
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా

తెలుగుజాతి తొలిసారిగ
రెండు చోట్ల ఎగరేయగ
విడిపోయీ కలిసుండే నవీన రీతికి సాక్షిగ
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా

తల్లి వేరు వరకు కుళ్లి
రాజకీయమంత కునారిల్ల
పరిశుద్ధాత్మల సాక్షిగ ప్రక్షాళన లక్ష్యముగా
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా

అడుగడుగున ఆడబతుకు 
కీచక పర్వం పాలవుతోంటే..
దుర్మార్గుల దునుమాడే నవజాతిని కాంక్షిస్తూ
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా

జనం దీవెనల కొరకు
నేతల వంచనలే మించిపోగ
అవ్యవస్థకు నిత్యం జాగృత గీతాలాపనలా
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా

ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా
వంద కోట్ల అవని జనులు మన గుండెల నిండా 
జాతి ఘనత ప్రతీకగా అదే మనకు అండ
ఎగురుతోంది చూడరా మువ్వన్నెల జెండా