మొదటిసారి మౌనం మాట్లాడితే వినాలని కోట్లాదిమంది అభిమానులు అప్పట్లో ఒళ్లంతా చెవులు చేసుకున్నారు. కళ్లని బుల్లితెరకి అంటించి ఆత్రుతగా ఎదురుచూసారు. ‘థియేటర్లలో హల్చల్ చేసే నా సినిమాలే మాట్లాడుతుంటే…ప్రత్యేకించి నే మాట్లాడేదేముంది? నేనేం మాట్లాడినా, ఏం చెప్పినా…నే సృష్టించిన కదిలేబొమ్మలు చెప్పే కబుర్లంత కమ్మగా ఉండవేమో?’ ఇదీ ఒకప్పటి ఆయన అభిప్రాయం. అందుకే, అప్పట్లో తన కొత్త సినిమా రిలీజైనప్పుడు కూడా ప్రెస్‌ని కలిసేందుకు ఇష్టపడేవారు కాదు.
అత్యుత్సాహంతో మీడియాయే ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించినా తప్పుకున్న సందర్భాలు లెక్కకుమిక్కిలి. ఆడియో ఫంక్షన్లలో సినీ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు కూడా ఆయన ఎంతో మొహమాటపడేవారు. ఆత్మీయులు, అభిమానులు బలవంతం చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వేదికనెక్కినా…మైకు ముందుకొచ్చేవారు కాదు. ఒకవేళ మైకే ఆయనముందుకొచ్చినా…‘ఒకటీ అరా’ పదాలతో మాట్లాడాననిపించేవారు.
‘మెగాఫోన్ పట్టుకున్న మెగాడైరక్టర్‌కి ఈ సభాపిరికితనమేంటో?’ కొంతమంది గొణుక్కునేవాళ్లు.
‘‘అగ్రతారలందరితోనూ సూపర్‌డూపర్ హిట్‌సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ ప్రతిభాశాలి అందరిముందుకు దర్జాగా వచ్చి తన విజయాల గురించి ఏకరువు పెట్టకుండా అజ్ఞాతంగా ఉండిపోవడమెందుకో?’ మరికొందర్లో బాధ.
‘‘రెండక్షరాల ప్రేమని సెల్యూలాయిడ్‌పై అత్యద్భుత దృశ్యకావ్యాల్లా సుందరంగా సురుచిరంగా మలచే స్వప్నలోక సంచారి ఒక్కసారి మాట్లాడితే ఎంతబాగుండునో?’’ ఇలా సంవత్సరాల తరబడీ ఎంతోమంది ఆకాంక్షించారు. అభిలషించారు. ఆయన గుండెలోతుల్లోని భావాల్ని వినాలని సంబరపడ్డారు.
చివరికి, శాపవిముక్తుడైనట్లు ఆ మౌనముని మాట్లాడడం ప్రారంభించారు. తెలుగునాట పేరెన్నికగన్న టీవీలో ప్రతివారం ఓరాత్రి ప్రత్యేకించి కేటాయించుకున్న శ్లాట్‌లో ఆయన ఇటీవల మాట్లాట మొదలెట్టారు. పూర్తయిందనిపించారు. గతంలో తాను రూపొందించిన సినిమాలు, సాధించిన విజయాలు, ఆయా చిత్రాల్లో నటించిన నాయికానాయకులతో వర్క్ ప్లేస్‌లో తను పంచుకున్న జ్ఞాపకాల దొంతరల సమాహారంగా మలచిన కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడారు.
తన సినిమాల్లో హీరోహీరోయిన్లను కూడా అతిథులుగా ఆహ్వానించి అప్పటి సంగతుల్ని ముచ్చటించారు. దశాబ్దాల మౌనం వీడి టీవీషోలో మాటామంతి చేసిన ఆయనెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో? ఆయన దర్శేకంద్రుడు రాఘవేంద్రరావు, బి.ఎ.
రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తరం నుంచి ఇవాళ్టి యువత వరకూ.ఆయన సినిమాలు చూస్తూ, తింటూ, తాగుతూ పెరిగినవాళ్లెందరెందరో అభిమానులు ఇండస్ట్రీలోనూ, బయట ప్రేక్షకలోకంలోనూ కోట్లలో ఉన్నారు. వాళ్లందరూ ఆయన చెప్పే మాటల్ని ప్రతివారం, ప్రతిఎపిసోడ్ క్రమం తప్పకుండా చూస్తూ సంతోషించారు.
ఇంతకీ…ఆయన ఏం చెప్పారు? ఆ విశేషాలు రేపటి తరం సినీ సృజనశీలురకు పాఠాలుగా పనికొస్తాయా? లేక…ఈ సందేహం ఇన్ని ఎపిసోడ్ల మాటల ముగింపు తర్వాత చాలామందికి వచ్చింది. ఇంతకీ …ఆయన చెప్పిన విషయాల్లో ఎక్కువగా…హీరోయిన్ల బొడ్డుచుట్టూ…ఆ బొడ్డుమీద కెమెరాసాక్షిగా పడ్డ పళ్ల చుట్టూ తిరుగుతుండడంతో…ఇవేనా? భావి దర్శకులు తెలుసుకోవాల్సినవి…అనే విమర్శలూ వెల్లువెత్తాయి. ఓ మహా దర్శకుడు, మహత్తర సృజనశీలి దగ్గర్నుంచీ ఈ కబుర్లకన్నా మిన్నగా ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది…ఇదే మాట పదేపదే ఆయన అభిమానులు చాలామంది చెప్పారు. ఇంకా చెప్తునే ఉన్నారు.
ఇన్ని ఎపిసోడ్ల ‘మౌనం వీడిన తర్వాత’ రాఘవేంద్రరావు గురించి కొత్తగా తెలుసుకున్నదేమిటి?
రాఘవేంద్రరావు బి.ఎ అంటే…బొడ్డుమీద యాపిల్ అనే అర్ధం అట. ఒకప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి..ఇప్పుడు కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో చిత్రసీమలో ముందుకు దూసుకుపోతున్న యువకథానాయకుడు నాని వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్య కూడా టెలికాస్ట్ అయింది.
‘హీరోయిన్ బొడ్డు చూపించి సినిమాని ఒడ్డెక్కించే దర్శేకంద్రుడాయన’ రాఘవేంద్రరావు పేరు చెప్పగానే తెలుగునాట ఎక్కువగా వినిపించేే వ్యాఖ్య ఇదే. ఈ వ్యాఖ్యని ఆయన ప్రశంసగానే తీసుకుంటారనడానికి ఆ ’ కార్యక్రమమే నిదర్శనం. కారణం…1975 లో అలనాటి అందాల నటుడు శోభన్‌బాబు హీరోగా తొలిసినిమా ‘బాబు’ తీసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసినా…వాటిలో అన్నమయ్య, రామదాసులాంటి భక్తి సినిమాలున్నా..వాటిల్లోనూ శృంగారాన్ని ప్రముఖంగా దట్టించే దర్శకశైలి ఆయనకు మాత్రమే సొంతం. అన్నమయ్యను శృంగార అన్నమయ్యగా, రామదాసుని శృంగార రామదాసుగా చిత్రీకరించారనే చిన్నపాటి విమర్శలు అక్కడక్కడా వినిపించాయంటే ఆయన పట్టు అంత రసవత్తరమనే చెప్పాలి.
శృంగారాన్ని ఆలంబనగా చేసుకుంటూనే రకరకాల ఇతివృత్తాలతో సినిమాలు తీసారాయన. ఆయన తీసిన సినిమాల అనుభవాలనుంచి స్ఫూర్తి పొందాలని తహతహలాడే నవదర్శకులకు ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువగా…హీరోయిన్ బొడ్డుపై పూలెలా వెయ్యాలో, ఏయేరకాల పళ్లు విసరాలో ఒద్దికగా, ఓపిగ్గా నేర్చుకున్నట్లే ఉందని పలువురి అభిప్రాయం కూడా. అంతేకాదు…కార్యక్రమంలో ఒక్కోసారి ఆయన కూడా ఇరుకున పడ్డారు. అదీ ప్రేక్షకులకు దొరికిపోయేలా…!
ఉదాహరణకి: మెగాస్టార్‌తో ఆయన తీసిన చిత్రం ‘ఘరానామొగుడు’లో నటించిన అలనాటి అందాల తార నగ్మా ‘సౌందర్యలహరి’లో పాలుపంచుకుంటూ దర్శేకంద్రుడు తనకు బూతులు నేర్పారంటూ బాహాటంగానే చెప్పింది. ఆ సమయంలో రాఘవేంద్రరావు కూడా నవ్వలేక నవ్వడాన్ని కెమెరా క్యాచ్ చేయడం..ఆ మాటల్ని కనీసం కట్ చేయకుండా యధాతథంగా టెలికాస్ట్ అవడం తెలిసిన విషయమే.
దైనందిన జీవితంలో అలసటనుంచి కాస్తంత సెద తీరాలంటే ఒకప్పుడు సినిమా ఒక్కటే ఉపశమన మార్గం.
కౌంటర్లో టిక్కెట్ కొని థియేటర్లోకి అడుగుపెట్టిన సామాన్యుడికి వినోదం, ఆనందం, ఆహ్లాదం అందించాలనే ఏకైక లక్ష్యంతోనే తాను సినిమాలు తీసినట్లు రాఘవేంద్రరావు మౌనం వీడి ఇప్పుడు చెప్పినా…అంతకుముందు ఆయనే అన్నట్లు ఆయన సినిమాలు ఇదే విషయాన్ని గట్టిగానే నొక్కివక్కాణించాయి. అప్పట్లో హీరోయిన్లు రాఘవేంద్రరావు సినిమాలో ఒక్క చాన్స్ కోసం ఎంతగానో తపించిపోయేవారు. ఆ చాన్స్ వచ్చిందా…? తెరపై శృంగారాన్ని కుండపోతగా కుమ్మరించేందుకు తహతహలాడేవాళ్లు. అదే విషయం ‘ఈ కార్యక్రమం’ లో తారసపడిన తారలంతా ముక్తకంఠంతో వల్లెవేస్తున్నారు. వ్యక్తపరిచారు. ఇంకొంతమంది తారలు ‘అప్పట్లో నామీద పళ్లు పడలేదం’టూ ెయలు పోయారు.
‘‘నిజమా!’ అని ఆశ్చర్యపడుతూనే దర్శేకంద్రుడు‘పళ్లు పడలేదని బాధగా ఉందా?’ అని ప్రశ్నించడం కూడా ఈ ప్రోగ్రామ్‌కే హైలెట్. ‘జ్యోతి, ఆమెకథ, అమరదీపం, ప్రేమలేఖలు, కల్పన..లాంటి ఉత్తమాభిరుచి గల సినిమాలెన్నో ఆయన ఖాతాలో నమోదైనా సింహభాగం సినిమాలు హీరోయిన్ బొడ్డు చుట్టూనే తిరగడంతో చివరికి, ఆయన పేరు చివర బి.ఎ కూడా ‘బొడ్డుపై యాపిల్’గా మారిపోయింది. అప్పట్లో ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు ఆంతరంగికంగా సరదాగా అనుకునే ఆ మాటలే ఇప్పుడు ‘ఈ కార్యక్రమం’ పుణ్యమాని అశేష జనావళికి చేరింది.
నిజానికి ఏ సృజనకైనా సిలబస్ ఉండదు. ఊహ పరిగెట్టినంతవరకూ సృజన పాదరసంలా పరిగెడుతుంది. సినిమాని ఇలాగే తీయాలనే నిబంధనలుండవని మేధావులు చెప్తుంటారు. టెంపో సడలకుండా ఎవరి శైలిప్రకారం ఎవరికి నచ్చిన సబ్జెక్ట్‌తో వాళ్లు సృజన సాగిస్తుంటారు. సినిమా ఇలా తీస్తేనే సెక్సస్ సాధిస్తుందంటే అంతమంది అదే సూత్రాన్ని పాటించి ఉండేవారు మరి!
రామ్‌గోపాలవర్మ ‘శివ’ తీస్తున్నప్పుడు ఆయన పద్ధతికి అప్పటికి ఓ ఒరవడికి అలవాటు పడినవాళ్లు అవాక్కయ్యారు. వర్మ అందుకున్న విజయం తర్వాత ఆయన్నే గురువుగా ఎంచుకున్న ఏకలవ్యశిష్యులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అలా క్కూడా కెమెరాని వాడొచ్చని…వర్మ రుజువు చేసారు. అందువల్ల…ఎవరిశైలి వారిదే. అయినా, ఒక్కో శైలినుంచి స్ఫూర్తిని అందుకోవడం అవసరం కూడా. ఆ మేరకు ‘మౌనం వీడిన రాఘవేంద్రరావు’ ఏమేరకు స్ఫూర్తినిచ్చారు? సమాధానం ఆశాజనకంగా లేదనే విమర్శలే వినిపించాయి.
ఇంచుమించు అన్ని ఎపిసోడ్లలోనూ మెయిన్ కంటెంట్ ‘హీరోయిన్ బొడ్డు, పూలు, పళ్ల’ చుట్టూనే తిరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరో, హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాల్ని సినిమాల్లో చూస్తూ ఎవరికి వాళ్లు మౌనంగా, మానసికంగా ఆనందించాలే తప్ప…ఆయా సన్నివేశాల ‘థీరీ’లు చెప్పుకుంటుంటే…ఇంట్లోని డ్రాయింగ్‌రూంలో కూచున్న కుటుంబసభ్యుల మనోభావాలెలా ఉంటాయో? కూడా కార్యక్రమ నిర్వాహకులు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ పోగ్రామ్‌లో అదే కరువైందనే విమర్శకి సమాధానం ప్రేక్షకులకి ఎలా లభిస్తుంది?
దశాబ్దాలు ఊరించి ఊరించిన మౌనం ఒక్కసారి పెదవి విప్పి మాట్లాడితే…మహా సంచలనం కావాలి. దర్శేకంద్రుడి నుంచి అలాంటి సంచలనం కోసం అభిమాన ప్రేక్షకులు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా వారి ఆశ నెరవేరుతుందా? సమాధానం మాత్రం దర్శేకంద్రుడి నుంచే రావాలి. మరోసారి ‘మౌనం మాట్లాడాలి’.
పివిడిఎస్. ప్రకాష్