టీ20 వరల్డ్ కప్ పోటీలకు ముందు టీమిండియా పేలవమైన ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. తొలి టీ20 వరల్డ్ కప్ హీరోగా టీమిండియా అభిమానులకు 'దేవుడు' అయిపోయిన జార్ఖండ్ డైనమైట్ ధోనీ, అభిమానుల 'అల్లరి'తో టీ20లకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సౌతాప్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓటమి పాలైన విషయం విదితమే.
గతంలో టెస్ట్ మ్యాచ్‌లకూ ధోనీ ఇదే తరహాలో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. జట్టు ప్రదర్శన అద్వాన్నంగా వున్న సమయంలో ధోనీ టెస్ట్ మ్యాచ్‌లనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జట్టు మేనేజ్మెంట్ ధోనీ ఆట తీరుపై అసహనం వ్యక్తం చేసిన తరుణంలో, అది ముందే పసిగట్టిన ధోనీ, వ్యూహాత్మకంగా టెస్ట్ కెరీర్‌కి గుడ్ బై చెప్పాడు. ఇప్పుడే అదే పరిస్థితులు పునరావృతమయ్యలా కన్పిస్తోంది.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా గత కొంతకాలంగా ధోనీ ఆటతీరులో దారుణమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకటిలా ధోనీ, బ్యాట్ ఝుళిపించలేకపోతున్నాడు. పదునైన వ్యూహాలతో జట్టుని ముందుకు నడిపించలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో జట్టు ప్రయోజనాల కోసం ధోనీని పక్కన పెట్టడమే బెటర్.. అన్న నిర్ణయానికి సెలక్టర్లు, బీసీసీఐ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ధోనీకి ఈపాటికే చేరిపోయి వుండాలి.
ఆటలో గెలుపోటములు సహజం. అయితే దారుణ పరాజయాల్ని చవిచూసినప్పుడు కెప్టెన్‌ని బాధ్యుడిగా చేయడమూ సహజమే. గంగూలీ కూడా ఇలానే కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. ధోనీ అందుకు అతీతుడు కాదు కదా. ఇంకో టీ20 మిగిలే వుంది. ఈ ప్రదర్శన చూశాక టీమిండియా, వన్డేల్లోనూ సౌతాఫ్రికాపై నిలబడ్తుందా.? అన్నది అనుమానమే. ఎటూ టెస్టుల్లోంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ, వన్డేలతోపాటు టీ20ల్లోంచీ తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమేమో.!