విజయం ఒంటరిగా రాదు..ఆనందాన్ని, ఉత్సాహాన్ని వెంటేసుకువస్తుంది. దర్శకుడు మారుతి వ్యవహారం ఇప్పుడు అచ్చంగా ఇదే. భలే భలే మగాడివోయ్ సినిమా మారుతి టైమ్ పూర్తిగా ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేసింది. నిన్నటి వ్యవహారాలను, తలకాయనొప్పులను అన్నింటినీ వాష్ అవుట్ చేసేసింది.
మరి ఆరేడు కోట్ల సినిమా పాతిక కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అంటే మాటలు కాదు కదా. అందుకే ఇప్పుడు చాలా మంది కొత్తగా సినిమా తీయాలనుకునేవాళ్లు, మీడియం రేంజ్ సినిమాలు తీసి మాంచి లాభాలు చేసుకోవాలని ఆశపడుతున్నవాళ్లు మారుతి వెంట పడుతున్నారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎనిమిదిన మారుతి బర్త్ డే వస్తోంది. మాంచి సక్సెస్ మోసుకొచ్చిన ఈ బర్త్ డే ను ఏడవ తేదీన మీడియాతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాడట. ఆ రోజు మీడియాతో ముచ్చటించి, లంచ్ పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నాడట మారుతి.
ఇప్పటికే తన డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో తనతో చిరకాలంగా వుంటున్నవారికి మారుతి నజరానాలు ఇచ్చాడని వినికిడి. ఈ అలవాటు గతంలో కూడా మారుతికి వుంది. తన సినిమా టీమ్ కు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం ఆయనకు అలవాటు. ఈ సారి కూడా అలాగే ఇచ్చాడట. ఇప్పుడు బర్త్ డే సందర్భంగా మీడియాకు మాంచి భోజనం పెడతాడట.