సినిమా రంగంలో జనాలు దేశ ముదుర్లు, విదేశీ ముదుర్లు లెక్కలో వుంటారు. ఒక చేతిలోంచి డబ్బులు మరో చేతిలోకి రావాలంటే, అంత వీజీ కాదు. సినిమా హిట్ అయిపోతుంది..కలెక్షన్లు కుమ్మేస్తాయి..అంకెలు అదిరిపోతాయి..తీరా లెక్కలు చూపించి, డబ్బులు కట్టాల్సి వచ్చేసరికి ఎక్కడలేని కారణాలు పుట్టుకువస్తాయి.పంచ పాండవులు అంటే మంచం కోళ్లలా నలుగురు అంటూ, మూడు వేళ్లు చూపించబోయి, రెండు వేళ్లు చూపించి, ఒకటి ముడిచాడట…అన్న సామెతలా వుంటుంది వ్యవహారం.
బాహుబలి సినిమా కలెక్షన్లు అన్ని రికార్డులు తిరగరాశాయన్న సంగతి తెలిసిందే కదా? కానీ ఇప్పుడు లెక్కలు తీయమని చెబుతుంటే, కొత్త అంకెలు చెబుతున్నారని వినికిడి. కోస్తాలోని ఓ జిల్లాలో అయితే అమాంతం రెండు కోట్లు తగ్గించేసారట. పైగా సినిమా పబ్లిసిటీకి ఇంత ఖర్చు చేసాం..అన్ని హోర్డింగ్ లు స్వంతంగా పెట్టాం, అన్ని పోస్టర్లు వేసాం..ఇలా రకరకాల ఖర్చులు చూపించి, కిందా మీదా పెడుతున్నారట.
ఎలాగూ పార్ట్ 2 రేట్లు ఆకాశంలో వుంటాయి. వాళ్లకే ఇస్తారో ఇవ్వరో, అందువల్ల పార్ట్ వన్ లోనే కాస్త డబ్బులు మిగుల్చుకుందాం అని చూస్తున్నారట కొందరు బయ్యర్లు. బాహుబలి లాంటి ప్రాజెక్టుకే ఇలా చుక్కలు చూపిస్తే మరి చిన్న సినిమాల సంగతి ఎలా వుంటుంది చెప్పండి. టాలీవుడ్ లో అంతే..ఎవరి స్టేజ్ లో వాడు తమ చాకచక్యం చూపించేస్తారు.