సినిమా రివ్యూ: భమ్‌ బోలేనాథ్‌

రివ్యూ: భమ్‌ బోలేనాథ్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఆర్‌.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: నవదీప్‌, నవీన్‌ చంద్ర, పూజ ఝవేరి, ప్రదీప్‌, ప్రవీణ్‌, పోసాని కృష్ణమురళి, కిరీటి తదితరులు సంగీతం: సాయి కార్తీక్‌ కూర్పు: ప్రవీణ్‌…

రివ్యూ: భమ్‌ బోలేనాథ్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: ఆర్‌.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నవదీప్‌, నవీన్‌ చంద్ర, పూజ ఝవేరి, ప్రదీప్‌, ప్రవీణ్‌, పోసాని కృష్ణమురళి, కిరీటి తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: భరణి కె. ధరన్‌
నిర్మాత: సిరువూరి రాజేష్‌ వర్మ
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కార్తీక్‌ వర్మ దండు
విడుదల తేదీ: ఫిబ్రవరి 27, 2015

గంజాయిని మంటల్లో వేస్తే దాని నుంచి వచ్చే పొగ పీలిస్తే బాగా నవ్వొస్తుందని ఈ చిత్రంలో చూపించారు. డ్రగ్స్‌ ఏ రూపంలో తీసుకున్నా కానీ కారణం లేకుండా నవ్వుతుంటారని తెలియజేసారు. దాంట్లో ఎంత నిజముందో డ్రగ్‌ ఎడిక్ట్స్‌కే తెలియాలి. కానీ ‘భమ్‌ బోలేనాథ్‌’లోని కామెడీని చూసి నవ్వుకోవాలంటే మాత్రం థియేటర్లలో అలా గంజాయి పొగ వదిలే అరేంజ్‌మెంట్‌ ఉండాలి. లేదా టికెట్‌తో పాటు నవ్వుకోడానికి సదరు డ్రగ్స్‌ పంపిణీ చేయాలి. 

చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లని చూపించి అదే మా చెడ్డ కామెడీ అనుకుంటే తీసినోళ్లు నవ్వుల పాలవ్వడం తప్ప చూసినోళ్లకి నవ్వు రాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్రైమ్‌ కామెడీలు అరుదుగా వస్తుంటాయి కానీ వాటిలో చాలా వరకు సక్సెస్‌ అయ్యాయి. మనీ, అనగనగా ఒక రోజు, స్వామి రారాలాంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. కామెడీని థ్రిల్‌ని మిక్స్‌ చేయడం అంత తేలిక కాదు కానీ ఆ మిక్స్‌చర్‌ సరిగ్గా కుదిరితే మాత్రం మహ బాగా వర్కవుట్‌ అవుతుందని అలాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలెన్నో చెప్పాయి. కానీ ఈ మిశ్రమాన్ని అలరించేలా తెరకెక్కించడం అందరి వల్లా కాదు కాబట్టే ఈ జోనర్‌ని ఎక్కువమంది ఎటెంప్ట్‌ చేయలేదు. 

రామ్‌గోపాల్‌వర్మ తర్వాత ఈమధ్య కాలంలో క్రైమ్‌ కామెడీని అంత పర్‌ఫెక్ట్‌గా తీసింది సుధీర్‌ వర్మ ఒక్కడే. కార్తీక్‌ వర్మకి అలా తీయాలనే కోరిక అయితే ఉంది కానీ ఆకట్టుకునేలా తీయడమెలా అనే కిటుకు మాత్రం తెలిసినట్టు లేదు. నిరుద్యోగి అయిన వివేక్‌ (నవదీప్‌) ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మిని (పూజ) పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేస్తుంటాడు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్‌, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్‌ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలు ఏ పాయింట్‌లో కనెక్ట్‌ అవుతాయి, ఎలా కంచికి చేరతాయనేదే ‘భమ్‌ బోలేనాథ్‌’. 

Watch Bham Bholenath Public Talk

ఇలాంటి కథల్లో ప్రధాన పాత్రలు ఎంత ఆసక్తి కలిగిస్తే వాటితో కనెక్ట్‌ అయి, ట్రావెల్‌ అవ్వడం అంత ఈజీ అవుతుంది. మెయిన్‌ లీడ్స్‌లో ఏ క్యారెక్టర్‌నీ సరిగా డిజైన్‌ చేసుకోలేదు. క్యారెక్టరైజేషన్లు, వారికున్న సమస్యలు, లక్ష్యాలు అన్నీ ఇంతకుముందు ఎక్కడో చూసినవే కావడంతో ‘భమ్‌ బోలేనాథ్‌’కి ఆదిలోనే చుక్కెదురైంది. విలన్‌ని పరిచయం చేసినా కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అసలు కథ ఇంటర్వెల్‌ దగ్గర కానీ మొదలు కాకపోవడంతో అంతదాకా బోలేనాథ్‌ గోల గోలగా అనిపిస్తుంది. రెండు గంటల సినిమాలో గంట సమయాన్ని వృధా చేయడం బట్టి చూస్తే షార్ట్‌ ఫిలిం కోసం రాసుకున్న కాన్సెప్ట్‌ని సినిమా కోసమని అక్కర్లేని సన్నివేశాలతో సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. 

ఇంటర్వెల్‌ వరకు విషయం లేకపోయినా కనీసం కథైతే మొదలైంది కాబట్టి ద్వితీయార్థమైనా ఆసక్తి కలిగిస్తుందని ఆశ పడితే అది ఆవిరైపోవడానికి ఆట్టే సమయం పట్టదు. మూడు కథలు ఒకే కారుతో కనెక్ట్‌ అవ్వడమనేది తప్ప స్క్రిప్ట్‌లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ ఏమీ ఉన్నట్టు లేదు. ఒక పావుగంట పాటు ఫర్వాలేదనిపించినా కానీ ఆ తర్వాత షరా మామూలుగా సమయాన్ని వృధా చేసి.. అత్యంత దయనీయమైన క్లయిమాక్స్‌తో ముగించారు. 

ఎంత టాలెంట్‌ ఉన్నా కానీ లక్‌ అస్సలు లేని క్యారెక్టర్‌తో నవదీప్‌ రిలేట్‌ చేసుకున్నట్టున్నాడు. నటుడిగా వంక పెట్టలేం కానీ అతని దురదృష్టానికి మాత్రం జాలి పడక తప్పదు. మంచి టాలెంట్‌ ఇలాంటి సినిమాల్లో పడి ఇప్పటికే చాలా వేస్ట్‌ అయిపోయింది. ఇప్పటికీ అతనికి న్యాయం చేసే సినిమాలు దొరక్కపోవడం ప్యూర్‌ బ్యాడ్‌ లక్‌ అనుకోవాలి. క్యారెక్టర్‌కి కావాల్సిన విధంగా నవీన్‌ చంద్ర ఉన్నాడు. అతని నటనలోను ఆర్టిఫిషియాలిటీ లేదు. హీరోయిన్‌ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. మొత్తం తారాగణమంతా తమ వంతు ప్రయత్నం చేసారు కానీ దర్శకుడి వియర్డ్‌ సెన్సాఫ్‌ హ్యూమర్‌ వల్ల ఏ ఒక్కరూ దీన్ని కాపాడలేకపోయారు.

టెక్నికల్‌గా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. తీత వరకు కార్తీక్‌ వర్మ తనకి బేసిక్స్‌ తెలుసని చాటుకున్నాడు. కానీ రాతలోనే బోలేనాథ్‌ని అధోగతి పాలు చేసేసాడు. పట్టుమని రెండు గంటలైనా లేని సినిమాలో ఎండ్‌ కార్డ్‌ కోసం వెయిట్‌ చేయించాడంటే ఇక సినిమా ఎలా ఉందనేది మీరే ఊహించుకోవచ్చు. రోలింగ్‌ టైటిల్స్‌లో క్యారెక్టర్స్‌ గోల్స్‌ రీచ్‌ అయ్యాయో లేదో చూపిస్తుంటే అదేంటో కూడా పట్టించుకోకుండా ‘బయటకు దారి’ ఎటో వెతుక్కుంటూ పోతున్నారంటే ఆయా పాత్రలతో ఆడియన్స్‌ ఏమాత్రం బాండ్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. 

Watch Bham Bholenath Public Talk

ట్రెయిలర్స్‌తో నమ్మకం కలిగించిన ‘భమ్‌ బోలేనాథ్‌’ అక్కడక్కడా కాస్త ప్రామిసింగ్‌గా అనిపించిన మాట నిజమే కానీ.. కలిగించిన ఇంట్రెస్ట్‌ని కాసేపైనా సస్టెయిన్‌ చేయలేకపోవడం, కామెడీ కోసం చేసిన ఎటెంప్ట్స్‌ అన్నీ దారుణంగా మిస్‌ఫైర్‌ కావడంతో తీవ్రంగా డిజప్పాయింట్‌ చేస్తుంది. చూడక ముందు కనీస ఆసక్తిని రేకెత్తించని సినిమాలు నస పెట్టినా ఓకే కానీ ఇలా స్టఫ్‌ ఉందనిపించి గాలి తీసేస్తే మాత్రం ఆ నీరసం డబుల్‌ అవుతుంది. 

బోటమ్‌ లైన్‌:  ఇదేం గోల నాథ్‌?!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri