ఆ ఏకే47.. గ్రేహౌండ్స్‌ది

హైద్రాబాద్‌లో ఏకే 47 కలకలం సృష్టించిన విషయం విదితమే. హైద్రాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఏకే 47తో ఓ ఆగంతకుడు అరబిందో ఫార్మా వైస్‌ ప్రెసిడెంట్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు కీలక…

హైద్రాబాద్‌లో ఏకే 47 కలకలం సృష్టించిన విషయం విదితమే. హైద్రాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఏకే 47తో ఓ ఆగంతకుడు అరబిందో ఫార్మా వైస్‌ ప్రెసిడెంట్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతోందని ప్రకటించిన పోలీసులు, ఏకే47 గత ఏడాది డిసెంబర్‌లో గ్రేహౌండ్స్‌ పోలీసుల నుంచి మిస్‌ అయ్యిందని తేల్చారు. ఈమేరకు ఫిబ్రవరిలో నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

విశాఖలో కూంబింగ్‌కి వెళ్ళి తిరిగొస్తున్న సందర్భంలో గ్రేహౌండ్స్‌ సిబ్బంది నుంచి ఏకే47 మిస్‌ అయ్యిందన్నది పోలీసులు చెబుతున్న తాజా విషయం. అయితే అలా మిస్‌ అయిన ఏకే47 తుపాకీ, హైద్రాబాద్‌ నగరంలోకి ఎలా ప్రవేశించింది.? కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుండే జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోకి దాన్నెలా తీసుకొచ్చారన్న ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు.

కిడ్నాప్‌కి యత్నించినా, హత్యాయత్నమే జరిగినా.. అదీ ఏకే47తో జరగడం కారణంగా ఈ వ్యవహారం తీవ్ర గందరగోళానికి తెరలేపింది. పోలీసు శాఖ నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌.. ఇలా అతి కొద్దిమంది భద్రతా సిబ్బంది మాత్రమే వినియోగించే ఏకే47 ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్‌ చేయడానికో, హత్య చేయడానికో దుండగులు ఉపయోగించే పరిస్థితి వచ్చిందంటే.. ‘భద్రత’ ఎంత గొప్పగా వుందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా వుంటే, ఈ విషయమై అసెంబ్లీలో ప్రకటన చేయడానికి తాము సిద్ధంగా వున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసనసభ సమావేశాల్లో విపక్ష నేత జానారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఆయన ఏం చెబుతారో వేచి చూడాలి.