సినిమా రివ్యూ: హోరాహోరీ

రివ్యూ: హోరాహోరీ రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: శ్రీ రంజిత్‌ మూవీస్‌ తారాగణం: దిలీప్‌, దక్ష, చస్వ, అభిరామ్‌, ఎం.వి.ఎస్‌. హరనాధరావు, రాకెట్‌ రాఘవ, సీమ, భార్గవి తదితరులు సంగీతం: కోడూరి కళ్యాణ్‌ కూర్పు: జునైద్‌…

రివ్యూ: హోరాహోరీ
రేటింగ్‌: 1.5/5

బ్యానర్‌: శ్రీ రంజిత్‌ మూవీస్‌
తారాగణం: దిలీప్‌, దక్ష, చస్వ, అభిరామ్‌, ఎం.వి.ఎస్‌. హరనాధరావు, రాకెట్‌ రాఘవ, సీమ, భార్గవి తదితరులు
సంగీతం: కోడూరి కళ్యాణ్‌
కూర్పు: జునైద్‌
ఛాయాగ్రహణం: దీపక్‌ భగవంత్‌
సమర్పణ: డి. సురేష్‌బాబు
నిర్మాత: కె.ఎల్‌. దామోదరప్రసాద్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: తేజ
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 11, 2015

సక్సెస్‌ హ్యాంగోవర్‌ రెండేళ్లుండొచ్చు, మూడేళ్లుండొచ్చు. కానీ ఒక సినిమా తాలూకు ప్రభావం ఒక దర్శకుడిపై పదేళ్లకి పైగా ఉండడం, మళ్లీ మళ్లీ అతను అదే సినిమాని తిప్పి తిప్పి తీయడం మాత్రం నిజంగా విచిత్రం. పుష్కరం క్రితం తేజ తీసిన 'జయం' సిరీస్‌లో 'హోరాహోరీ' ఎన్నో చిత్రమనేది కూడా స్పష్టమైన ఐడియా లేదు. బహుశా వీటికి సినిమాకో కొత్త పేరు పెట్టుకోవడం కంటే.. జయం 2, జయం 3.. అంటూ సీక్వెల్స్‌ మాదిరిగా వదిలేస్తే కనీసం తననుంచి జనం కొత్తదనం అయినా ఆశించరు. తెలుగు సినిమాల్లో మూస ధోరణుల్ని విమర్శించే తేజ తన సినిమాలన్నీ ఒకే మూసలో ఉంటున్నాయని గుర్తించకపోవడం విచారకరం. 

జయం కథ చెరకుగడ అనుకుంటే… దానిని మళ్లీ మళ్లీ మిషన్‌లో వేసి ఇంకా రసం పిండాలని చూస్తున్నాడు తేజ. ఎప్పుడో పిప్పి అయిపోయిన అదే చెరకు నుంచి ఇంకో చుక్క అయినా రసం రాకపోతుందా అన్నట్టు తీసిన 'హోరాహోరీ' ఆద్యంతం తలనొప్పిగా తయారైంది. కనీసం జయం సినిమాలో క్లిక్‌ అయిన అంశాలేమిటో గుర్తించి వాటిని అనుకరించడానికి ప్రయత్నించినా అంతో ఇంతో ఆసక్తికరమైన సినిమా తెరకెక్కుతుందేమో. కానీ ఆ పాజిటివ్‌ పాయింట్స్‌ అన్నీ వదిలేసి… బలహీనమైన హీరో, బలవంతుడైన విలన్‌.. ఇద్దరికీ కావాల్సిన హీరోయిన్‌. ఈ త్రెడ్‌ పట్టుకునే ఉయ్యాల ఊగుదామని అనుకుంటున్నాడు. అదేమో అతని అంచనాలకి భిన్నంగా ఉరితాడవుతోంది. 

జయం మైనస్‌ గోపీచంద్‌ అంటేనే ఇంకేం ఉండదక్కడ. అలాంటి విలన్‌ పాత్రని పునఃసృష్టించలేకపోయిన తేజ కేవలం మర్డర్లు చేసేవాడిని చూపిస్తే, వాడే భీకరమైన విలన్‌ అనుకుంటారని భ్రమ పడుతున్నాడు. ఇందులో విలన్‌గా నటించిన చస్వ ఏ క్షణంలోను భయపెట్టలేకపోయాడు. 'బాబోయ్‌ వీడిని ఈ బక్క హీరో ఎలా డీల్‌ చేస్తాడో' అనే ఫీలింగ్‌ ఒక్కసారి కూడా తీసుకురాలేకపోయాడు. విలన్‌ పాత్రధారిని ఎంచుకోవడంలోనే తేజ ఫెయిలయ్యాడు. ఇక హీరో గురించి చెప్పాల్సిన పని లేదు. విలన్‌ వీక్‌ కాబట్టి హీరో అంతకంటే వీక్‌గా ఉండాలన్నట్టుగా సెలక్షన్‌ ప్రక్రియ జరిగిందేమో అనిపిస్తుంది. కొంతలో కొంత హీరోయిన్‌ దక్ష నయం. కొన్ని ఫ్రేమ్స్‌లో బాగుంది. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ కరెక్ట్‌గా ఇచ్చింది. 

టైపింగ్‌ పోటీలు పెట్టడానికి కంప్యూటర్లు దేనికో అర్థం కాదు. రెండు నెట్‌ సెంటర్లలో ఏది ఉండాలని డిసైడ్‌ చేయడానికి 'బెస్ట్‌ ఆఫ్‌ త్రీ' టైపింగ్‌' పోటీలు పెట్టుకుంటారట. ఆ ప్రహసనాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ అర్థం పర్ధం లేని వ్యవహారాన్ని దాదాపు ప్రథమార్ధం అంతా సాగదీసారు. హీరోకి విలన్‌ చేతే ఫైటింగ్‌ టెక్నిక్కులు నేర్పించడం, హీరోకి విలనే గురువు కావడం వంటి అంశాలని చొప్పించి ఇది 'జయం' కాదనిపించుకోవాలని తేజ గట్టిగా ట్రై చేశాడు. వద్దన్నా స్క్రీన్‌లో ఏదో మూల నించి ఆ సినిమాలోని నితినో, సదానో, గోపీచందో కనిపించేస్తూ తేజ ఆడదామనుకున్న దాగుడు మూతల్ని చెడగొడతారు. 

విలన్‌కి దొరక్కుండా హీరోయిన్‌ని దాచి పెట్టిన ఆమె అన్నయ్యకి.. తన చెల్లి ఆచూకీ విలన్‌కి తెలిసిపోయిందని తెలిసినప్పుడు 'ఉంగరం' మీద ఆడిన డ్రామా చూస్తే తేజ ఎంత అవుటాఫ్‌ ఫోకస్‌లో ఈ సినిమా తీసాడో తెలిసిపోతుంది. స్క్రీన్‌ప్లేతో కనికట్టు చేసి నువ్వు నేను, జయంలాంటి ఘన విజయాల్ని అందుకున్న దర్శకుడు ఇప్పుడు స్క్రీన్‌ప్లే స్పెల్లింగ్‌ తెలీనట్టుగా అయోమయానికి గురవడం, మినిమం బలం లేని బేస్‌ వేసి ఈ చిత్రాన్ని నడిపించాలని చూడడం చూస్తే తన బలాన్ని తేజ ఏ స్థాయిలో కోల్పోయాడనేది స్పష్టమవుతుంది. అలా అని మేకింగ్‌ పరంగా రాజీ పడడం కనిపించదు. తన సినిమాల్లో క్వాలిటీ ఎప్పుడూ మిస్‌ అవ్వదు. ఈ చిత్రం కూడా విజువల్‌గా చాలా ప్లీజింగ్‌గా వుంటుంది. 

దక్షిణాది చిరపుంజిగా చెప్పుకునే అగుంబె బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తీసారు. దాదాపుగా సినిమా అంతా రెయిన్‌ ఎఫెక్ట్‌లో నడుస్తుంది. ఆ రెయిన్‌ ఎఫెక్ట్‌తో రొమాంటిక్‌ ఫీల్‌ పుట్టించాలని చూస్తే… బ్యాక్‌డ్రాప్‌లో తప్ప ఫోర్‌గ్రౌండ్‌లో రొమాన్స్‌ లేకుండా పోయింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ లేకపోవడం… హీరో, విలన్‌ మధ్య టెన్షన్‌ మిస్‌ అవడం… అన్నిటికీ మించి కథ, కథనాల్లో విషయం లేకపోవడంతో 'హోరాహోరీ' కాస్తా పరమ బోర్‌గా మారింది. విలన్‌ తన కిటుకులన్నీ హీరోకి నేర్పేసాడు కనుక ఇద్దరి మధ్య హోరాహూరీ పోరు ఉంటుందని అనుకుంటే కనీసం అక్కడా టైటిల్‌ జస్టిఫికేషన్‌ జరగలేదు. సినిమాటోగ్రఫీ, సంగీతం మాత్రమే ఈ చిత్రాన్ని చివరి వరకు చూడడానికి తోడ్పడ్డాయి. కోడూరి కళ్యాణ్‌ కొన్ని మంచి ట్యూన్స్‌ ఇచ్చాడు. చక్కని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తనవంతు చేయగలిగింది చేసాడు.

అన్ని విధాలుగా అవుట్‌ ఆఫ్‌ ఫామ్‌లో ఉన్నాడని, జయం లాంటి సినిమా తీయడానికి డెస్పరేట్‌గా తపించిపోతున్నాడని అనిపించిన తేజ ఈ చిత్రాన్ని ఏ విధంగాను నిలబెట్టలేకపోయాడు. నటీనటుల నుంచి కావాల్సిన అవుట్‌పుట్‌ రాబట్టుకోవడం దగ్గర్నుంచి, ప్రేక్షకుల్ని కదలకుండా కుర్చీల్లో కూర్చోబెట్టి సినిమా చూసేలా చేయడం దగ్గర్నుంచి, ఆహ్లాదకర సంభాషణలు రాయడం దగ్గర్నుంచి, పకడ్బందీ కథనం సిద్ధ పరచుకునే వరకు ఏ విషయంలోను తేజ పాస్‌ అవలేదు. ప్రథమార్ధంలో అసహనంతో వేగిపోవడం, ద్వితీయార్ధానికి వచ్చేసరికి దానికి అలవాటుపడిపోవడం, ఆపై తెరపై జరిగేది చూసి మనలో మనమే నవ్వుకోవడం, అటుపై మన పరిస్థితికి మనమే జాలిపడడం.. ఇలా హోరాహోరీ ఎప్పటికప్పుడు వివిధ ఎమోషన్లని పరిచయం చేస్తూ ఎంగేజ్‌ చేస్తుంది. అనీజీనెస్‌లో స్టేజెస్‌ ఏంటనేది ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి మినహా ఈ చిత్రం చూడ్డానికి ఇంకో కారణం లేదనిపిస్తుంది.

బోటమ్‌ లైన్‌: హరి హరీ!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri