ఎమ్బీయస్‌ : గాంధీ పునరాగమనానికి 100 ఏళ్లు- 1

1915 జనవరి 9 న గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగి వచ్చారు. సరిగ్గా నూరేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'ప్రవాస్‌ భారత్‌ దివస్‌' నిర్వహించింది. గాంధీ గుజరాత్‌లోని రాజకోట్‌ బారిస్టరుగా ప్రాక్టీసు…

1915 జనవరి 9 న గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగి వచ్చారు. సరిగ్గా నూరేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'ప్రవాస్‌ భారత్‌ దివస్‌' నిర్వహించింది. గాంధీ గుజరాత్‌లోని రాజకోట్‌ బారిస్టరుగా ప్రాక్టీసు చేస్తూ, ఒక క్లయింటుకోసం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అక్కడ సాగుతున్న వర్ణవివక్షతకు వ్యతిరేకంగా అహింసామార్గంలో ఉద్యమించి విజయం సాధించాడు. అది భారత దేశపు స్వాతంత్య్రపోరాటయోధులను ఆకట్టుకుంది. గోపాల కృష్ణ గోఖలే 1912లో దక్షిణాఫ్రికాకు వెళ్లినపుడు గాంధీని భారత్‌కు తిరిగివచ్చి స్వాతంత్య్రయుద్ధంలో పాలు పంచుకోమని కోరారు. ఆయన మాట మన్నించి 1915లో గాంధీ తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాలో ఓడ ఎక్కి బొంబాయిలోని అపోలో బందర్‌లో దిగాడు. అప్పట్లో ఆ రేవులో రాజులు, బ్రిటిషువారు తప్ప సామాన్యులకు దిగే హక్కు లేదు. గాంధీ ఖ్యాతి విన్న ఫిరోజ్‌ షా మెహతా, బి.జి.హార్నిమాన్‌ వంటి నగరపెద్దలు అధికారులకు చెప్పి ఆ ఏర్పాటు చేయడమే కాక, గాంధీని రిసీవ్‌ చేసుకోవడానికి స్వయంగా వచ్చారు. సౌరాష్ట్రలోని కఠియవాడ్‌ ప్రాంతానికి చెందిన గాంధీ ఆ ప్రాంతపు సంప్రదాయ దుస్తుల్లో ఓడ దిగాడు – వెంట భార్య, నలుగులు కొడుకులు. ఆ తర్వాత బొంబాయిలో జరిగిన సన్మానసభల్లో గాంధీ పదేపదే చెప్పేవాడు – ''దక్షిణాఫ్రికాలో నేను సాధించిన విజయాల గురించే భారతీయులకు తెలుసు. అనేకానేక వైఫల్యాల గురించి వారికి ఐడియా లేదు. ఇప్పుడు తిరిగి వచ్చాను కాబట్టి నాలోని లోపాలను వారు చూడగలుగుతారు. అది ముందే వూహించి వినమ్రంగా ప్రార్థిస్తున్నాను – 'నేను మాతృదేశసేవకై వచ్చిన సేవకుణ్ని. నేను చేయబోయే పొరపాట్లను మన్నించండి.'' గోఖలే గాంధీకి గురుతుల్యుడు. ''నీకు దేశం గురించి ఏమీ తెలియదు. వస్తూనే పోరాటంలోకి దిగవద్దు. ఒక ఏడాది పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ అనుకో. దేశమంతా తిరుగు. ప్రజలను, వారి బాధలను అర్థం చేసుకో. ప్రయాణపు ఖర్చులు నేను భరిస్తాను.'' అన్నాడు. 

ఆయన సలహా మేరకు భారతయాత్ర ప్రారంభించేముందు గాంధీ పూనా వెళ్లి టిళక్‌ను, గోఖలేను కలిసి ఆశీర్వాదం కోరాడు. గోఖలే తను నడుపుతున్న సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసయిటీలో సభ్యత్వం తీసుకోమన్నాడు. సరే అని గాంధీ అప్లికేషన్‌ పెట్టుకున్నాడు. కార్యవర్గ సమావేశం కొద్ది రోజుల్లో వుంది, అప్పుడు నీ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకుంటారు అన్నారు. ఈలోగా తన సభ్యత్వం ప్రొబేషన్‌లో వున్నట్టుగా భావించిన గాంధీ తనున్న కాలనీలో లెట్రిన్లు శుభ్రపరచడం మొదలుపెట్టాడు. ఈ పని సభ్యుల్లో కొంతమందికి నచ్చలేదు. గాంధీకి వెంటనే సభ్యత్వం యివ్వకూడదని వాదించారు. గోఖలే ఏమీ చేయలేకపోయాడు. ''నీ ఆదర్శాలతో ఆశ్రమం మొదలుపెట్టుకో. మా సొసైటీ ఒప్పుకోకపోయినా నేను జేబులోంచి దానికి డబ్బిస్తాను. ఈ భారతయాత్రకు మాత్రం సొసైటీ ద్వారా పెట్టిస్తాను.'' అన్నారు. 

భారతయాత్ర సాగుతూండగానే 2015 మేలో గాంధీ తన ఆదర్శాలకు అనుగుణంగా అహ్మదాబాద్‌ శివార్లలోని కొచ్‌రబ్‌లో సత్యాగ్రహ ఆశ్రమం నెలకొల్పాడు. దానికి జీవన్‌లాల్‌ దేశాయి అనే బారిస్టర్‌ తన బంగళా యిచ్చాడు. కొన్నాళ్లు పోయాక ఆర్థికపరమైన యిబ్బందులు వస్తే అంబాలాల్‌ సారాభాయ్‌ అనే ధనికుడు రూ.13,000 యిచ్చాడు. ఆశ్రమంలో మొదటి బ్యాచ్‌గా 25 మంది స్త్రీపురుషులు చేరారు. వారిలో 13 మంది తమిళులు! అందరికీ కలిపి ఒకటే వంటశాల. ఎవరికి తగ్గ పనులు వారికి కేటాయించారు. అందరూ తాము నిజమే చెపుతామనీ, అహింస, బ్రహ్మచర్యం పాటిస్తామని, సొంతానికి ఏమీ వుంచుకోమనీ, స్వదేశీ వస్తువులే వాడుతామని ప్రమాణం చేశారు. అస్పృశ్యులను (హరిజనులు/దళితులు) కూడా ఆశ్రమవాసులుగా తీసుకుంటానని గాంధీ అనడంతో అతని భార్య కస్తూర్బా, బంధువు, అనుయాయి అయిన మగన్‌లాల్‌ గాంధీ అభ్యంతరపెట్టారు. కావాలంటే మీరు వెళ్లిపోండి, వాళ్లను మాత్రం చేర్చుకుంటా అన్నాడు గాంధీ. కస్తూర్బా సణిగినా సర్దుకుంది. మగన్‌లాల్‌ ఆశ్రమం విడిచి వెళ్లిపోయాడు. కొన్నాళ్లు పోయాక మనసు మార్చుకుని వచ్చి చేరాడు. గాంధీ భారతయాత్ర సాగిస్తూనే మధ్యమధ్యలో ఆశ్రమానికి వస్తూ వుండేవాడు.

గాంధీ భారతయాత్ర జనవరి నెలాఖరులో ప్రారంభమైంది. బొంబాయి నుంచి రాజకోటకు వెళ్లాడు. సామాన్య జనుల జీవితాలెలా వున్నాయో తెలియాలని థర్డ్‌ క్లాసు పెట్టెలో ప్రయాణం చేశాడు. గాంధీ భారత్‌కు తిరిగి వచ్చిన తేదీ నుండి చనిపోయేవరకు ఏ రోజు ఏం చేశాడో చందూలాల్‌ బి. దలాల్‌ అనే అతను రికార్డు తయారుచేసి పెట్టాడు. మొత్తం 12075 రోజులైతే దానిలో 2119 రోజులు జైల్లో, 4739 రోజుల్లో అహ్మదాబాద్‌, వార్ధా ఆశ్రమాల్లో, 5217 రోజులు ప్రయాణంలో గడిపాడట. ఈ రోజుల్లో ఇండియా, బర్మా, ఇంగ్లండ్‌, సిలోన్‌లు తిరిగాడు. ఇండియాలో చేసిన రైలు ప్రయాణాల్లో చాలా భాగం మూడో తరగతి పెట్టెల్లో చేసినవే. ఈ రాజకోట ప్రయాణం గురించి గాంధీ తన ఆత్మకథలో రాశాడు. రైలు పెట్టెను రైల్వే అధికారుల నిర్లక్ష్యం వలన అపరిశుభ్రంగా వుంచితే, ప్రయాణీకులు దాన్ని మరింత చెత్తగా చేశారని, తుక్కు పడేస్తూ, తమలపాకులు, పొగాకు నమిలి ఎక్కడపడితే అక్కడ వుమ్ముతూ, నిరంతరం పొగ తాగుతూ, తమలో తాము కలహిస్తూ, అరుచుకుంటూ నరకాన్ని తలపించారని రాశాడు. నూరేళ్ల తర్వాత వచ్చిన మార్పు ఏమిటంటే మూడో తరగతికి పేరు మారి రెండవ తరగతి అయింది. పరిస్థితులు యించుమించు అలాగే వున్నాయి. ప్రభుత్వం నిర్మల్‌ అభియాన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరాన్ని ప్రజలు కల్పిస్తున్నారు. 

రాజకోట నుండి కఠియవాడ్‌లోని వీరమ్‌గామ్‌ అనే పట్టణానికి గాంధీ వెళ్లాడు. అప్పట్లో ఆ రెండు వూళ్ల మధ్య కస్టమ్స్‌ గేటు ఒకటి వుండేది. ఆ దారిలో వెళ్లేవారి వద్ద బ్రిటిషువారు డబ్బు వసూలు చేసేవారు. ఇది గాంధీ దృష్టికి వచ్చింది. ఆయన కఠియవాడ్‌ ప్రాంతంలో తిరుగుతూ యీ రుసుము వసూలును అహింసామార్గంలో నిరసనల ద్వారా ఎదుర్కోవాలని ఉద్బోధించాడు. దక్షిణాఫ్రికాలో రైలు పెట్టెలో నుండి టిక్కెట్టు వున్నా తనను బయటకు తోసేసిన వైనం, సత్యాగ్రహమార్గంలో పోరాడి జయించిన సంగతి అందరికీ చెపితే వాళ్లు ఉత్సాహంగా సత్యాగ్రహంలో పాల్గొంటామని అన్నారు. అప్పుడు గాంధీ బొంబాయి గవర్నరుకు ఉత్తరం రాశాడు. ''అది మా చేతిలో వుంటే మేం ఎప్పుడో ఎత్తివేసేవాళ్లం. మీరు భారతప్రభుత్వాన్ని అడగాలి.'' అని గవర్నరు జవాబు రాశాడు. దానితో బాటు ఆయన ప్రయివేటు సెక్రటరీ గాంధీకి ఉత్తరం రాశాడు – ''మీ ఉత్తరంలో మీరు సత్యాగ్రహపద్ధతిలో నిరసన తెలుపుతామని రాశారు. ఇలాటి బెదిరింపులు మంచివి కావు.'' అని. ''ఇది బెదిరింపు కాదు, ప్రజల చేతిలో వున్న న్యాయపరమైన హక్కులేమిటో మీకు తెలియపరచానంతే. బ్రిటిషు ప్రభుత్వపు శక్తి అధికారమని నాకు తెలుసు. సత్యాగ్రహం అనేది ప్రజల చేతిలో గల శక్తి అని మీరు గ్రహించాలి.'' అని గాంధీ బదులిచ్చాడు. అన్నట్టుగానే సత్యాగ్రహాలు, నిరసనలు జరిగాక ప్రభుత్వం దిగివచ్చి రెండేళ్ల తర్వాత కస్టమ్స్‌ గేటు ఎత్తేశారు. కొసమెరుపు ఏమిటంటే – యిప్పుడు కూడా రాజకోట వీరమ్‌గామ్‌ దారిలో వెళ్లే రైళ్లలో రెండో తరగతి పెట్టెల్లో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయిట. చేసేవారు ఎవరంటే – నపుంసకులు. చప్పట్లు చరుస్తూ వచ్చి, డబ్బిచ్చేదాకా వదలటం లేదట! వీరిని ఆపడానికి ఏ సత్యాగ్రహాలు చేయాలో మరి!  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]