ఒక సాధారణ సన్నివేశాన్ని రాసిచ్చినా… దాన్ని తనదైన శైలిలో మార్చుకొని రక్తి కట్టించగల నేర్పరి సునీల్. కమెడియన్గా ఆయనకి విశేషమైన పాపులారిటీ లభించిందంటే కారణం అదే. మామూలుగా సునీల్ స్టేజీపై మాట్లాడినా నవ్వొచ్చేస్తుంటుంది. అదేంటో కానీ… ఆయన హీరో అయిపోయాక మాత్రం ఆ చాతుర్యం కనిపించడం లేదు. ప్రేక్షకులు ఎలాంటి విషయాలకు నవ్వుతారో జడ్జ్ చేయడంలో సునీల్ పూర్తిగా విఫలమవుతున్నట్టు కనిపిస్తున్నాడు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన `భీమవరం బుల్లోడు` విషయానికే వద్దాం. ఈ సినిమా గురించి సునీల్ మామూలుగా చెప్పలేదు. “టైటిల్స్ దగ్గర్నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారండీ, ఇంటికొచ్చాక కూడా ఆ నవ్వు ఆపరండీ. ఈ సినిమా చూశాక మీరు అనుకొన్న స్థాయిలో నవ్వకపోతే నా సినిమాలు చూడడం ఆపేయండీ“ అంటూ సెలవిచ్చాడు. కట్ చేస్తే సినిమా 1980 సరుకుతో ప్రేక్షకుల ముందుకొచ్చిందని అర్థమైంది. ఏ సన్నివేశంలోనూ నవ్వు సహజంగా రాదు. బలవంతంగా నవ్వాల్సి వస్తుంటుంది.
ఇలాంటి సినిమా గురించి కూడా సునీల్ ఆహా ఓహో… అంటూ భుజానికెత్తుకోవడం వెనక ఆయన కన్ఫ్యూజన్ ఉందని అర్థమవుతోంది. సినీ విశ్లేషకులు కూడా అదే తేలుస్తున్నారు. సగం హీరోయిజమ్, సగం కామెడీపై దృష్టిపెడితే ఇలాగే ఉంటుందనీ… సునీల్ పూర్తి స్థాయిలో కామెడీపై దృష్టిపెట్టి సినిమా చేస్తేనే ఫలితం దక్కుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.