సినిమా రివ్యూ: డి ఫర్‌ దోపిడి

రివ్యూ: డి ఫర్‌ దోపిడి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: డి 2 ఆర్‌ ఫిలింస్‌ తారాగణం: వరుణ్‌ సందేశ్‌, సందీప్‌ కిషన్‌, రాకేష్‌, నవీన్‌, తనికెళ్ల భరణి, దేవాకట్టా, హేమ తదితరులు సంగీతం: మహేష్‌…

రివ్యూ: డి ఫర్‌ దోపిడి
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: డి 2 ఆర్‌ ఫిలింస్‌
తారాగణం: వరుణ్‌ సందేశ్‌, సందీప్‌ కిషన్‌, రాకేష్‌, నవీన్‌, తనికెళ్ల భరణి, దేవాకట్టా, హేమ తదితరులు
సంగీతం: మహేష్‌ శంకర్‌, జిగర్‌
కూర్పు: ధర్మేంద్ర కాకర్ల
ఛాయాగ్రహణం: లూకాజ్‌ ప్రుచ్నిక్‌
నిర్మాతలు: రాజ్‌ నిడిమోరు, కృష్ణ డి.కె.
కథ, కథనం, దర్శకత్వం: సిరాజ్‌ కాళ్ల
విడుదల తేదీ: డిసెంబర్‌ 25, 2013

బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న దర్శక ద్వయం రాజ్‌, కృష్ణ నిర్మించిన ‘డి ఫర్‌ దోపిడి’ నిర్మాణం పూర్తి చేసుకుని చాలా కాలమవుతోంది. ఈ చిత్రం చూసి బాగా నచ్చడంతో దీనిలో నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నాడు హీరో నాని. దిల్‌ రాజు కూడా ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ తీసుకోవడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. మరి అందుకు తగ్గ విషయం ఈ దోపిడిలో ఉందా… నిజంగా ఆడియన్స్‌ మది దోచుకుంటుందా?

కథేంటి?

విక్కీ (వరుణ్‌ సందేశ్‌) గాళ్‌ఫ్రెండ్స్‌ని మెయింటైన్‌ చేయడం కోసం క్రెడిట్‌ కార్డులపై పది లక్షల వరకు అప్పులు చేసేస్తాడు. రాజు (సందీప్‌ కిషన్‌) సినిమా హీరో కావాలంటే ఇరవై లక్షల రూపాయలు ఎదురు కట్టాలి. తన పక్కింట్లో ఉండే అమ్మాయిని పడగొట్టాలంటే తనకి సిక్స్‌ ప్యాక్‌ బాడీ అవసరమని బన్ను (రాకేష్‌) ఫీలింగ్‌. అందుకోసం అతనికో మూడు లక్షలు కావాలి. తన మేనమామ కూతుర్ని గాఢంగా ప్రేమించిన హరీష్‌ (నవీన్‌) తన మామకి పన్నెండు లక్షలు సంపాదించి చూపించాలి. ఇంత డబ్బు సంపాదించాలంటే బ్యాంక్‌ లూటీ చేయడమే మార్గమని నలుగురూ ఓ బ్యాంక్‌ దోపిడీకి స్కెచ్‌ వేసుకుని వెళతారు. అక్కడేం జరుగుతుందనేదే ‘డి ఫర్‌ దోపిడి’. 

కళాకారుల పనితీరు!

వరుణ్‌ సందేశ్‌ ఎప్పటిలానే తెలుగుని తన నోట్లో మర్డర్‌ చేస్తూ తనకొచ్చింది చేసాడు. నటనకి పెద్ద స్కోప్‌ లేని క్యారెక్టర్‌లో సందీప్‌ కిషన్‌ సింపుల్‌గా కానిచ్చేసాడు. మిగిలిన ఇద్దరు కుర్రోళ్లు తమ ఉనికి చాటుకోడానికి ప్రయత్నించారు. తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. దేవా కట్టా… తెర ముందు కంటే తెర వెనుకే కంఫర్టబుల్‌ అనుకుంట. హేమతో పాటు బ్యాంకులో బందీ అయిన ఇతర నటీనటులంతా పెద్దగా చేసిందేమీ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

మహేష్‌ శంకర్‌ సంగీతం సోసోగా ఉంది. పాటలు ఎక్కువ లేని ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. ఎడిటింగ్‌ బాలేదు. కెమెరా వర్క్‌ చిన్న సినిమాల స్థాయికి తగ్గట్టే ఉంది. నిర్మాతలు బాగా పొదుపు పాటించారు. మేకింగ్‌ వేల్యూస్‌ అస్సలు బాలేదు. హీరోల పాత్రల తాలూకు ‘లేమి’ తెరపై నిర్మాణ విలువల్లోను తాండవించింది. 

దర్శకుడు సిరాజ్‌ రొటీన్‌కి భిన్నంగా వెళదామని చూసాడు. ఆలోచన మంచిదే.. కానీ ఆచరణ బాలేదు. ఇలాంటి చిత్రానికి అవసరమైన సరంజామా అతను సమకూర్చుకోలేదు. కథ, కథనాల్ని అలా అలా గాల్లో అనేసుకుని తెరకెక్కించినట్టే అనిపిస్తుంది తప్ప గ్రౌండ్‌ వర్క్‌ చేసిన ఫీలింగ్‌ ఎక్కడా రాదు. మనీ, స్వామిరారా తదితర చిత్రాలని చూస్తే ఈ క్రైమ్‌ కామెడీలో ఏమి మిస్‌ అయిందనేది క్లియర్‌గా తెలుస్తుంది. 

హైలైట్స్‌:

  • నాని వాయిస్‌ ఓవర్‌లో పాత్రల పరిచయ సన్నివేశాలు

డ్రాబ్యాక్స్‌:

  • ద్వితీయార్థంలో దారి తోచని కథనం
  • లాజిక్‌కి అందని పతాక సన్నివేశం

విశ్లేషణ:

దొంగతనం అస్సలు అలవాటు లేని నలుగురు కుర్రాళ్లు బ్యాంక్‌ రాబరీకి పాల్పడతారు. ఈ పాయింట్‌ వినగానే చాలా ఫన్‌ వర్కవుట్‌ అవుతుందనే భావన కలుగుతుంది. ‘ఐతే’లో నలుగురు అమెచ్యూర్స్‌ కిడ్నాప్‌ చేస్తే అదెంత బాగుంటుందో చూసాం కాబట్టి… దీంట్లో కూడా అంత థ్రిల్లు, అంత ఫన్ను ఉంటుందని అనిపిస్తుంది. కానీ అవి వర్కవుట్‌ కావాలంటే దానికి తగ్గ విధంగా కథనం రాసుకోవాలి. అడుగడుగునా ఉత్కంఠ రేపుతూ వినోదాన్ని పండించాలి. 

కానీ ‘డి ఫర్‌ దోపిడి’లో కథనం పక్క దారి పడుతుంది. దోపిడీకి ముందు ప్రిపరేషన్‌ అంటూ ఏమీ ఉండదు. లోపలకి వెళ్లిపోతారు… సింపుల్‌గా బ్యాగ్‌లో డబ్బు సర్దేస్తారు. తర్వాత అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి కూడా చాలా సాధారణంగా ఉంటాయి తప్ప ఏ కోశాన ఎక్సయిట్‌ చేయవు. కాకపోతే దర్శకుడు మొదట్లో చాతుర్యం ప్రదర్శించాడు. పాత్రల్ని అలరించే వాయిస్‌ ఓవర్‌తో పరిచయం చేసి మంచి మూడ్‌ సెట్‌ చేసాడు. అక్కడక్కడా కొన్ని జోకులు పేలి ఫస్టాఫ్‌లో పెద్దగా విషయం లేకపోయినా సాఫీగా సాగిపోతుంది. కానీ అసలు నడిపించాల్సింది ద్వితీయార్థంలోనే. బయట పోలీసులు, లోపల బ్యాంక్‌ ఉద్యోగులు, కస్టమర్లతో ఇరుక్కుపోయిన దొంగలు… బయట ఎలా పడాలి? ఒకే లొకేషన్‌లో కథ బందీ అయిపోయాక దానిని ముందుకి ఎలా నడిపించాలి? 

ఇలాంటి చోటే దర్శకుడు తన మెదడుకి పదును పెట్టాలి. కానీ తన కథతో పాటు దర్శకుడు కూడా వెళ్లి ఆ బ్యాంక్‌ లోపల ఇరుక్కుపోయినట్టు ఎటూ కదల్లేక చేతులెత్తేసాడు. ఎలాంటి సన్నివేశాలు తీస్తే దోపిడి రక్తి కడుతుందో అనేది అర్థం కాక తెల్లమొహం వేసాడు. ఫలితంగా డి ఫర్‌ దోపిడి కాస్తా… ఎస్‌ ఫర్‌ సుత్తిగా తయారవుతుంది. తనికెళ్ల భరణి బ్యాక్‌ స్టోరీ మహా చిరాకు పెడుతుంది. బయట యాక్టింగ్‌ రాని పోలీసులు, ఎన్నోసార్లు చూసి పారేసిన మీడియాపై సెటైర్లు… విసుగుని మరింత పెంచుతారు. గంటా నలభై అయిదు నిముషాల నిడివి ఉన్న సినిమా ‘అప్పుడే అయిపోయిందా’ అనిపించాలి. కానీ ఈ చిత్రం మాత్రం ‘ఇప్పటికి అయ్యిందా’ అనే ఫీలింగ్‌ తెస్తుంది. 

ఇక దొంగలు పశ్చాత్తాప పడడం, వాళ్లని పోలీసులు కూడా క్షమించేయడం లాంటివి లాజిక్‌కి ఏమాత్రం అందవు. కనీసం వారికి ఆ పోలీసులతో పాత పరిచయం కానీ, అనుబంధం కానీ ఉన్నా వేరే సంగతి. బ్యాంక్‌లో బందీలైన వారికి దొంగలపై మంచి అభిప్రాయం ఏర్పడడానికి కావాల్సిన సన్నివేశాలని దర్శకుడు రాసుకోలేదు. ఏ క్షణంలోను అయ్యో వీళ్లు అన్యాయంగా ఇక్కడ ఇరుక్కుపోయారే… ఎలాగైనా బయటపడితే బాగుణ్ణనే ఫీలింగ్‌ ఒక్కసారి కూడా కలగదు. పాత్రలని సరిగా ఎస్టాబ్లిష్‌ చేయకపోవడం వలన, వాటిని లవబుల్‌గా తీర్చి దిద్దకపోవడం వలన వచ్చే సమస్య అది. ఇలాంటి కథలు చెప్పుకోడానికి ఎంత సింపుల్‌గా ఉంటాయో తెరపైకి ఆకట్టుకునేలా తీసుకురావడానికి అంత కష్టపెడతాయి. దర్శకుడు కష్టపడ్డానికి ట్రై చేయలేదు. సో… చూసేందుకు జనం కష్టపడాల్సి వస్తుంది. హెచ్‌ ఫర్‌ హార్డ్‌వర్క్‌ చేస్తే… ఆర్‌ ఫర్‌ రిజల్ట్‌ అదే వస్తుంది. లేదంటే ఎంత సి ఫర్‌ చెట్టుకి అంత జీ ఫర్‌ గాలి! 

బోటమ్‌ లైన్‌: డి ఫర్‌ దో‘పిడి’ – వి ఫర్‌ విసిగించింది!

– గణేష్‌ రావూరి

[email protected]

twitter.com/ganeshravuri