ఎమ్బీయస్‌ : కా-క పుట్టిస్తున్న కాక

కారుపార్టీ వాళ్లు, కమలం పార్టీ వాళ్లు పొత్తు పెట్టుకోబోతున్నారన్న వార్త రాష్ట్రరాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బిజెపి, టిడిపికి దగ్గరవుతోందని సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అది సహజమైన పొత్తుగానే అనిపిస్తోంది కూడా. తెరాసకు, బిజెపికి…

కారుపార్టీ వాళ్లు, కమలం పార్టీ వాళ్లు పొత్తు పెట్టుకోబోతున్నారన్న వార్త రాష్ట్రరాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బిజెపి, టిడిపికి దగ్గరవుతోందని సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అది సహజమైన పొత్తుగానే అనిపిస్తోంది కూడా. తెరాసకు, బిజెపికి మొదట్లో సయోధ్య వున్నా, ఉపయెన్నికలలో నేనూ వున్నానంటూ బిజెపి ముందుకు రావడంతో తెరాస మండిపడింది. వాళ్లిద్దరికి చాలాకాలంగా పడటం లేదు. ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణ తీర్మానం తర్వాత తెరాస మంచి వూపు మీద వుంది. ఎన్నికలలో తనదే విజయం అని, తెలంగాణలో తెచ్చుకునే పార్లమెంటు సీట్లతో కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓ వూపు వూపవచ్చని అనుకుంటోంది. ఇక బిజెపి కూడా మోదీ రంగం మీదకు వచ్చాక జాతీయస్థాయిలో కాలరెగరేస్తోంది. మోదీ ప్రభావంతో రాష్ట్రంలో కూడా ఓట్లు, సీట్లు రాలతాయని నమ్మకంగా వుంది. ఇద్దరికీ కార్యక్షేత్రం తెలంగాణయే. మరి అలాటప్పుడు పొత్తు కుదిరేదెలా? మరి యీ వార్త ఎలా వచ్చింది? తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసియార్‌ ముందుకు వచ్చినా కాంగ్రెసు ఉత్సాహం చూపడం లేదట. కెసియార్‌ ఢిల్లీ వెళ్లినా స్పందన లేదట. షరతులు లేకుండా విలీనం అయితే ఓకే అనీ, గొంతెమ్మ కోరికలు కోరితే చేర్చుకోమని కాంగ్రెసువారు అన్నారనీ, వారిని అడలగొట్టడానికి కెసియారే యీ బిజెపి పుకారు లేవదీశారని ఒక ఊహాగానం. నిజమేనా?

టి-కాంగ్రెసు నాయకులందరూ తెరాసతో విలీనానికి ఉవ్విళ్లూరుతూండగా కాంగ్రెసు అధిష్టాం తెరాస పట్ల ఉదాసీనంగా ఎందుకుంటుంది? ప్రభుత్వవ్యతిరేక ఓటు బలంగా వుందని అందరికీ తెలుసు. తెరాస కాంగ్రెసులో విలీనం అయిపోతే ఆ ఓటుకి గుత్తాధిపత్యం టిడిపికే దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణలో వైకాపాకి వున్న బలం స్వల్పమే. క్యాడర్‌ పెద్దగా లేదు. టిడిపికి మంచి నిర్మాణవ్యవస్థ వుంది. అందువలన కాంగ్రెసు వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా టిడిపికే వెళ్లి, (తెరాసను విలీనం చేసుకున్న) కాంగ్రెసు ఎక్కువ సీట్లు తెచ్చుకోలేదు. విభజన చేయడం వలన సీమాంధ్రలో ఎలాగూ దెబ్బ తింటాం, తెలంగాణలో బాగా పుంజుకుంటాం అనే లెక్క వేసుకున్న కాంగ్రెసు యీ పరిస్థితికి సమాధాన పడలేదు కదా. ఇక తెరాస పక్షాన్నుండి చూసుకున్నా – వాళ్లు కూడా కాంగ్రెసులో విలీనం అయిపోయి, ఇన్నేళ్ల వాళ్ల తప్పుల్ని నెత్తిన వేసుకోలేరు కదా. కాంగ్రెసును యిన్నాళ్లూ అందరూ తిడుతూనే వున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రకటించారు కాబట్టి తెలంగాణలో కొందరు వాళ్ల పట్ల మెత్తబడవచ్చు. కానీ చాలామంది తెలంగాణ వాదులు – 'ఈ యిచ్చేది 2009లోనే యిచ్చి వుంటే వెయ్యిమంది ప్రాణాలు దక్కేవి కదా, ఇన్నాళ్లూ వూరుకుని యిప్పుడు రాహుల్‌ను ప్రధాని చేయడానికి హడావుడిగా చేశారు' అని తప్పుపడుతున్నారు. అంతేకాకుండా విభజనసమయంలో పెట్టే ఆంక్షలను కూడా తప్పుపడుతున్నారు. తెరాస యిప్పుడేమంటోంది? '28 రాష్ట్రాల విషయంలో లేని ఆంక్షలు తెలంగాణాకు మాత్రమే ఎందుకు?' అని అడుగుతోంది. అందువలన కాంగ్రెసు పట్ల కినుక తప్పదు.

ఫైనల్‌గా తెలంగాణ బిల్లు ఎలా వుంటుందో యిప్పటిదాకా తెలియదు. కానీ పరిమిత ఆంక్షలు తప్పవు అని జయపాల్‌రెడ్డి సూచించారు. యూటీ అనరు కానీ వ్యవహారం యూటీలాగే నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తన అధికారాలలో అతి ముఖ్యమైనవి గవర్నరుకి దఖలు పరుస్తుంది. ఆ గవర్నరు నిష్పక్షపాతమైన అధికారియో, న్యాయాధీశుడో అయివుండడు కదా. ఫక్తు రాజకీయవేత్త అయి, తన రాష్ట్రంలో ఏదో స్కాములో యిరుక్కుని, పదవి పోగొట్టుకుని, అక్కడే వదిలేస్తే తన వారసుడి కొంపకు ఎసరు పెడతాడని భయపడి అధిష్టానం చేత తరమబడినవాడై వుంటాడు. కేంద్రంలో ఎవరుంటే వాళ్ల పార్టీ మనిషో, లేక వాళ్ల కనుసన్నల్లో మసలే వ్యక్తో అయి వుంటాడు. అలాటివాడు తెలంగాణలో గుండెకాయను తన యిష్టం వచ్చినట్టు ఏలతాడు. హైదరాబాదు ఆదాయంలో ఎంత ఆంధ్రకు పోవాలో, ఎంత తెలంగాణకు పోవాలో ఆ మహానుభావుడే పర్యవేక్షిస్తాడు. అతనికి తెలంగాణపై వలపక్షం ఏమీ వుండదు, ఎందుకంటే అతను రెండు రాష్ట్రాలకూ గవర్నరు. రాజభవన్‌లో వున్నంతమాత్రాన అతను సచ్ఛీలుడని, ఏ ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగడని గ్యారంటీ ఏమీ లేదు. రాజభవన్‌లో ఎన్‌డి తివారీ ఎటువంటి పనులకు పాల్పడ్డారో తెలుసు. గవర్నరు ఏం చేసినా, ప్రజలకు అపనమ్మకం కలగక తప్పదు. దానితో బాటు అటువంటి వ్యక్తికి అధికారం అప్పగించిన తెలంగాణ కాంగ్రెసు నాయకుడి సారథ్యంలో ఎన్నికల ముందు ఏర్పడే తెలంగాణ ప్రభుత్వంపై కోపం కలగక మానదు. 

కాంగ్రెసుకు యీ బెడద ఎలాగూ తప్పదు. వారితో కలిస్తే తెరాసకూ వాతలు తప్పవు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విడిగా వుంచి వుంటే, యిప్పుడు ఆయన ఎమ్మెల్యేలు సంజాయిషీలు చెప్పుకునే స్థితిలో వుండేవారు కారు. 2009 డిసెంబరు తర్వాత వారు సమైక్యబాట పట్టారు కాబట్టి ప్రజలు వారికి జేజేలు పలికేవారు. కాంగ్రెసుకు అవసరమైనపుడు మద్దతు యిస్తూ, మంత్రిపదవులు అనుభవిస్తూ, యిలాటి సంకట సమయాల్లో కాంగ్రెసును వ్యతిరేకిస్తున్నాం అంటూ కాంగ్రెసుపై వ్యతిరేకత సెగ తమను తాకకుండా చూసుకునేవారు. కానీ విలీనమై దెబ్బ తినేశారు. సినిమాహీరోగా నీరాజనాలు అందుకున్న చిరంజీవి జనాల చేత యిప్పుడు ఛీత్కరించబడుతున్నారు. పార్టీలో చేరేవరకూ సోనియా ఆయన మాటకు విలువ యిచ్చేవారు. ఇప్పుడు గుంపులో గోవిందా అయిపోయారు. ఆయన యూటీ అన్నా, ఊటీ అన్నా వినేవాడు లేడు. రేపు సీమాంధ్రలో కాంగ్రెసుకి ఘోరపరాజయం తప్పదు. వారితో కలిసిపోయినందుకు మాజీప్రజారాజ్యం వారికీ శృంగభంగం తప్పదు. ఇది చూశాకైనా తెరాస కాంగ్రెసులో విలీనం గురించి పునరాలోచనలో పడవచ్చు. 

పైగా యుపిఏ అంపశయ్యమీద వుంది. 2014లో మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదు. ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వస్తే కెసియార్‌ బృందం విడిగా వచ్చి లబ్ధి పొందుదామని చూడాలంటే కష్టం. ఎందుకంటే పార్టీ మార్పిడి నిరోధ చట్టం వలన వాళ్లు మళ్లీ ఎన్నికలకు వెళ్లవలసి వస్తుంది. చిన్నపార్టీలోంచి విడిగా వచ్చేసి పార్టీ పెట్టుకోవడం సులభమే కానీ కాంగ్రెసు వంటి పెద్ద పార్టీలోంచి విడివడాలంటే చాలామంది ఎంపీలను కూడగట్టుకోవాలి. అందువలన విడిగా ఫ్రీ రాడికల్‌గా వుండడమే మేలు. ఎన్‌డిఏ, మూడో కూటమి, ప్రాంతీయ పార్టీల నాలుగో కూటమి.. యిలా దేనిలోనైనా చేరవచ్చు. తెరాసకు సిద్ధాంతపరమైన యిబ్బందులు ఏమీ లేవు కాబట్టి ఎవరితోనైనా చేరవచ్చు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే నిధులు చాలా కావాలి. ఉమ్మడి రాజధానిపేరుతో రాజధానిలో వుండబోయే ఆంధ్రులను అదుపులో వుంచాలి. అడలగొట్టాలి. ఇవన్నీ చేయాలంటే కేంద్రంలోని ప్రభుత్వంలో భాగస్వామి కావాలి. కాంగ్రెసు పార్టీలో చేరి ఆ స్వాతంత్య్రాన్ని పోగొట్టుకోవడం తెరాస చేయదు. విలీనం కాకపోతే మిగిలిన ఆప్షన్‌ – పొత్తులు. ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు పెట్టుకుని, తర్వాత మరొకరితో జత కట్టడానికి ఏ పార్టీకి అభ్యంతరాలుండవు. తెరాసకు ముందే వుండవని 2009లోనే కెసియార్‌ చూపారు. 

ఇలా ఆలోచిస్తే… కాంగ్రెసుతో పొత్తులు కుదరలేదు కాబట్టి కెసియార్‌ బిజెపి తనను ఆహ్వానించినట్టు పుకారు పుట్టించారని అనాలి. కానీ కాంగ్రెసు పొత్తుల గురించి యిప్పుడు ఆలోచిస్తున్నట్లుగా ఏమీ తోచటం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో సాధించే విజయాలపై వారి బార్గయినింగ్‌ పవర్‌ వుంటుంది. ఇంకో వారం ఆగితే కాంగ్రెసు పడవ మునుగుతోందో, తేలుతోందో తేలిపోతుంది. ఇప్పటికిప్పుడు పొత్తు సంగతి తేల్చమని కెసియార్‌ పట్టుబట్టారని అనుకోవడానికి లేదు. అందువలన బిజెపియే తెరాసను సౌండ్‌ చేసి వుంటుంది అనుకోవడం తార్కికం. ఓ పక్క టిడిపితో సంప్రదింపులు చేస్తూ మరో పక్క తెరాసతో ఎలా చేస్తుంది? అనే ప్రశ్న అవివేకులే వేస్తారు. విభజన జరిగిపోతే సీమాంధ్రలో టిడిపితో, తెలంగాణలో తెరాసతో పొత్తు కుదుర్చుకోవచ్చు కదా! అనేక పార్టీలు ఒక రాష్ట్రంలో మిత్రులుగా, మరో రాష్ట్రంలో శత్రువులుగా వ్యవహరించడం చూశాం. ఎన్‌సిపి మహారాష్ట్ర యూనిట్‌కు కాంగ్రెసుతో పొత్తు వుంటుంది. తక్కిన రాష్ట్రాల యూనిట్లకు వుండదు. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోయినా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు స్ట్రాటజీలు వుండడమూ వింత కాదు. సిబిఐ ఆంధ్ర ప్రాంతంలో టిడిపితో, తెలంగాణలో తెరాసతో పొత్తు పెట్టుకుంది కదా. బిజెపి రేపు అదే పని చేయవచ్చు. టిడిపి తెలంగాణలో పోటీ చేసినపుడు బిజెపి పోటీ చేసిన చోట తన అభ్యర్థిని పెట్టకుండా తెరాసకు ఎలాట్‌ చేసిన స్థానాల్లో మాత్రం పెట్టవచ్చు. పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా పొత్తు కుదరని స్థానాల్లో 'ఫ్రెండ్లీ కాంటెస్టు' పేర పోటీ పడతారు. ఇవన్నీ మామూలే.

కాంగ్రెసు సీమాంధ్రలో వైకాపాతో, తెలంగాణలో తెరాసతో పొత్తు పెట్టుకుందామని చూస్తోంది అంటారు. అది బహిరంగంగా వుంటుందో, ఎన్నికల అనంతరం వుంటుందో తెలియదు. అదే పని బిజెపి ఎందుకు చేయకూడదు? జగన్‌ ఢిల్లీ వెళ్లినపుడు బిజెపి వారు కూడా సాదరంగానే ఆహ్వానించారు. ఇక్కడ సిద్ధాంతాలకు ప్రాధాన్యత లేదు. గెలుచుకుని వచ్చే సీట్లకే ప్రాధాన్యత. సీమాంధ్రలో వైకాపా బలంగా వుంది, తెలంగాణలో తెరాస బలంగా వుంది అని సర్వేలు చెపితే యిద్దర్నీ దువ్వడానికి రెడీ. దువ్వే కళ కాంగ్రెసుకే కాదు, బిజెపికీ తెలుసు. వైకాపా బలహీనపడుతోంది, టిడిపి పుంజుకుంటోంది అనే రిపోర్టులు వస్తే టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశం బిజెపికి మాత్రమే వుంది. వైకాపా యివాళ కాకపోయినా రేపైనా కాంగ్రెసుతో కలుస్తుందన్న అనుమానం బిజెపి మెదడులో మెదిలితే వారు టిడిపినే ఎక్కువ నమ్ముతారు. కానీ టిడిపితో రాష్ట్రమంతా పొత్తు పెట్టుకోవడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. తెలంగాణలో టిడిపి యీ ఎన్నికలలో పెద్దగా గెలవదని అందరి సందేహం. అస్పష్టమైన విధానంతో ఏ ప్రాంతమూ నమ్మని పరిస్థితి తెచ్చుకుంది టిడిపి. అందువలన రెండు చోట్లా కొన్ని కొన్ని సీట్లు తెచ్చుకుని ఆగిపోతుందని అంచనా. అలాటప్పుడు తెలంగాణలో తెరాసను గట్టిగా పట్టుకోవడమే లాభదాయకం. 

బిజెపితో కలిస్తే ముస్లిములు దూరమవుతారన్న భయం కెసియార్‌కు లేదా? అంటే మరి గతంలోనూ బిజెపితో కలిసి పని చేశారు కదా. పైగా విభజన తర్వాత మజ్లిస్‌ బాగా పుంజుకుంటుంది. విభజన వలన బిజెపి బలపడి మన దుంప తెంపుతుంది అని ప్రచారం చేసి మజ్లిస్‌ తెలంగాణ జిల్లాలలో కూడా తన అభ్యర్థులను నిలబెడుతుంది. ముస్లిము ఓట్లు గణనీయంగా వాళ్లకే పడతాయి. పడతాయో లేదో తెలియని ఆ ఓట్ల కోసం కెసియార్‌ బిజెపిని వదులుకోరు. బిజెపి వద్ద నిధుల కొరత లేదు. పైగా తెరాస ఒంటరిగా పోటీ చేసే స్థితిలో ఎన్నడూ లేదు. పార్టీకి క్యాడర్‌ లేదు. నిర్మాణం లేదు. ఎప్పుడు చూసినా నాయకులు ప్రెస్‌ కాన్ఫరెన్సులలో కనబడతారు. లేదా ఆర్నెల్లకో సారి భారీ సభ పెడతారు. గ్రామస్థాయిలో కార్యకర్తలను తయారుచేసి, తర్ఫీదు యివ్వడంపై యిన్నాళ్లూ శ్రద్ధపెట్టలేదు. ఇప్పుడే ప్రారంభించారు. సమయం చాలదు. 
తెరాసతో పొత్తు వుండదు. ఒంటరిగానే పోటీ చేస్తాం అని రాష్ట్రస్థాయి బిజెపి నాయకులు గంభీరప్రకటనలు చేస్తున్నారు. ఎందుకంటే వారందరూ తెలంగాణవారే. తమ కేదో బలం వుందని వాళ్లు అనుకుంటూ వుంటారు. గతంలో సొంతంగా ఎదిగే సమయంలో టిడిపితో పొత్తువలన నష్టపోయామని, యిప్పటికైనా విడిగా పోటీ చేస్తే పుంజుకోవచ్చని వాళ్ల ఊహ. ఆంధ్రప్రాంతంలో పార్టీ ఏమై పోయినా వాళ్లకు పట్టదు. కానీ జాతీయస్థాయి నాయకులకు వీళ్ల బలం ఎంతో తెలుసు. వీళ్ల వలన ఏమీ కాదనీ తెలుసు. తెలంగాణ విషయంలో వీళ్లను నమ్ముకుని వీళ్లు చెప్పినట్టు ఆడడం వలననే చివరకు ఎటూ కాకుండా చెడ్డామని వాళ్లు గ్రహించారు. తెలంగాణ బిల్లు సమర్థించి వాళ్లు బావుకునేది ఏమీ లేదు. తెలంగాణ తెచ్చిన ఘనత కాంగ్రెసుకు, తెరాసకు పోతుంది. ఇక ఆంధ్రలో క్షౌరం. నిజానికి సోనియాపై కోపంతో రగులుతున్న ఆంధ్రులకు సోనియాకు బుద్ధి చెప్పగల మొనగాడిగా మోదీకి పట్టం కట్టేవారు – విభజన విషయంలో సమన్యాయం చేయగలిగి వుంటే. ఆంధ్రులకు తృప్తి కలగించని తెలంగాణ బిల్లును గుడ్డిగా సమర్థించిన బిజెపిని, కాంగ్రెసును ఒకే గాటకు కడతారు వారు. 

ఈ విషయాలు క్రమేపీ గుర్తిస్తున్న బిజెపి అధినాయకత్వం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరడానికి టిడిపి, తెరాసలతో పొత్తు పెట్టుకోవడానికి నిర్ణయిస్తే, స్థానిక నాయకత్వం సరేననాల్సిందే! ఈ పరిణామాలు గమనిస్తున్న కాంగ్రెసుకు కాక పుడుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ యిచ్చినా తెరాస-బిజెపి కూటమిని ఎదుర్కొని ఎన్నికలలో గెలవడం అంత సులభమేమీ కాదు వాళ్లకు! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2013)

[email protected]