‘దేవుడు’ పిలుస్తున్నాడా.?

దేవుడు నీ గుండెల్లోనే వుంటాడు.. ఎక్కడ చూసినా దేవుడు కన్పిస్తాడు.. నీలోని మానవత్వం వుంటే చిన్న పిల్లల్లోనూ, సాటి మనిషిలోనూ, జంతువుల్లోనూ, చెట్టు, పుట్ట.. ఇలా ప్రకృతిలోని అన్నిట్లోనూ దేవుడు సాక్షాత్కరిస్తాడు. ఇది అందరికీ…

దేవుడు నీ గుండెల్లోనే వుంటాడు.. ఎక్కడ చూసినా దేవుడు కన్పిస్తాడు.. నీలోని మానవత్వం వుంటే చిన్న పిల్లల్లోనూ, సాటి మనిషిలోనూ, జంతువుల్లోనూ, చెట్టు, పుట్ట.. ఇలా ప్రకృతిలోని అన్నిట్లోనూ దేవుడు సాక్షాత్కరిస్తాడు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కానీ, ఎక్కడో వున్న దేవుడి కోసం ఆదుర్దా తప్పడంలేదు మనిషికి.

ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవడం వెనుక మానసిక ప్రశాంతతను పొందడం అనే ఒక భావన వుంటుంది. ఆ ప్రశాంతత కోసం కాకుండా, పుణక్షేత్రాల సందర్శన కూడా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోయిన రోజులివి. ఉత్తరాఖండ్‌ జల విలయం గురించి కేదార్‌నాథ్‌ ఆలయ పూజారి స్పందిస్తూ, ‘దేవుడ్ని చూడ్డానికి వచ్చేవారికి రెస్టారెంట్స్‌, రిసార్ట్స్‌తో పనేంటి.?’ అని ప్రశ్నించారు.

భక్తుల ఆలోచనల్లో మార్పులు రావడంతోనే, ప్రకృతిలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆ పూజారి సెలవిచ్చారు.

సామాన్యుల్లో భక్తి పెరిగిపోతుందా.? లేదంటే కాస్తంత గాలి మార్పు కోసం దేవాలయాల్ని పర్యాటక ప్రాంతాలుగా మార్చుకుంటున్నారా.? అన్న విషయంపై చాలా చర్చే జరుగుతోంది. రెండోదానికే ఎక్కువమంది ఓటేస్తున్నారు. అది నిజం కూడా. ఎప్పుడైతే దేవాలయాల మీద ప్రభుత్వం కన్నేసిందో, దేవాలయాల్ని ఆదాయ మార్గాలుగా ప్రభుత్వాలు చూడ్డం మొదలు పెట్టాయో.. ఇక భక్తి అన్న పదానికి చోటు లేకుండా పోయింది.

దేవాలయాలకు భక్తితో, నమ్మకంతో వెళ్తోన్నవారే ఎక్కువమంది వున్నప్పటికీ, ఈ మధ్యకాలంలో సరదా కోసం వెళ్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఆ కారణంగానే వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కేదార్‌నాథ్‌ ఆలయ పూజారి చెప్పే మాటల్లో వాస్తవం ఎంతుందోగానీ, ఎంతో కొంత లేకపోలేదన్నది నిర్వివాదాంశం. 

మొన్నటికి మొన్న దసరా పండుగ నాడు మధ్యప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో తొక్కిసలాట జరిగితే వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. దేవుడి దర్శనం కోసం వెళితే.. సరాసరి దేవుడి దగ్గరకే వెళ్ళిపోయారు కొందరు అభాగ్యులు. తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్న వాదన సర్వత్రా విన్పిస్తూ వుంటుంది ఇలాంటి సందర్భాల్లో. తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమవడమంటే ఎంతమంది భక్తులు వస్తారనే అంచనాలు లేకపోవడం, దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోవడం. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు, దాదాపుగా ఇప్పుడు దేశంలోని ప్రధాన ఆలయాల వద్ద జరుగుతున్నది భక్తి ముసుగులో వ్యాపారం మాత్రమే. టిక్కెట్ల ధరలు పెంచేసి, భక్తుల్ని నిలువునా దోచుకుంటున్న రోజులివి. ఆలయాల అభివృద్ధి కోసం టిక్కెట్ల ధరలను పెంచితే తప్పేంటి.? అనే వాదన ప్రభుత్వం నుంచి రావొచ్చుగాక.

కానీ, భక్తిని వ్యాపార వస్తువుగా మార్చేసి, మార్కెట్లో అమ్మేస్తోన్న పాలకులు.. దానికి తగ్గట్టుగా భక్తుల భద్రతపై దృష్టిపెడ్తున్నారా.? అంటే అదీ లేదు. దేవాలయాలకు విపరీతమైన పబ్లిసిటీ పెంచేసి, భక్తుల్ని ఆకర్షించి.. వారికి భద్రతా ఏర్పాట్లు కల్పించడంలో వైఫల్యం చెంది.. భక్తుల్ని సరాసరి దేవుడి దగ్గరకి పంపించేస్తున్నారు. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడా.? బలవంతంగా భక్తుల్ని దేవుడి దగ్గరకి పంపించేస్తున్నారా.? అంటే కాసుల వేటలో ప్రభుత్వాలే రెండో పని సమర్థవంతంగా చేస్తున్నాయని అన్పించకమానదు.!