ఎమ్బీయస్: అభాగ్యనగరులు

ఒకమ్మాయిని యిద్దరు ప్రేమిస్తారు. ఒకరితో మరొకరు పోటీపడతారు. అవతలివాళ్లలో వున్న లోపాలను ఎత్తి చూపి వాడి వైపు వెళ్లకు, మంచివాడు కాడు అని భయపెడతారు. ఇంతలో వాళ్లిద్దరూ అన్నదమ్ములనో, మరోటనో తేలుతుంది. లేదా ఒకరినొకరు…

ఒకమ్మాయిని యిద్దరు ప్రేమిస్తారు. ఒకరితో మరొకరు పోటీపడతారు. అవతలివాళ్లలో వున్న లోపాలను ఎత్తి చూపి వాడి వైపు వెళ్లకు, మంచివాడు కాడు అని భయపెడతారు. ఇంతలో వాళ్లిద్దరూ అన్నదమ్ములనో, మరోటనో తేలుతుంది. లేదా ఒకరినొకరు కాపాడుకుని మిత్రులయిపోతారు. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడతారు. నువ్వు చేసుకో అంటే నువ్వు చేసుకో అంటారు. ఇలాటి కథలు, సినిమాలు అనేకం చూశాం. అప్పుడు అనిపిస్తుంది – అసలు అమ్మాయి ఏమనుకుంటోందో యీ మహానుభావులు తెలుసుకునే ప్రయత్నం చేశారా? మీలోమీరు ఒప్పందాలకు వచ్చేయడం, దానాలు చేసేయడమేనా?  

అలా చేసేముందు నీ మనసేమిటి? కథేమిటి? వ్యథేమిటి? అని అమ్మాయిని అడిగే పనిలేదా? అని. హైదరాబాదు పరిస్థితి అదే! భాగ్యనగరం మీదనే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారికి కన్ను. దీన్ని ఎలా పంచుకోవాలా? అని కొట్టుకుంటూ వుంటే ఎలా ఎగరేసుకుపోవాలా? అని ఆలోచిస్తూ తాజాగా కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఈ రంధిలో హైదరాబాదు వాసులను అడిగి చూడాలన్న యింగితమే లోపించింది. 

అలజడుల తాకిడి లేని హైదరాబాదు 
విభజన ఉద్యమం పుష్కరం క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో వరంగల్, కరీంనగర్ జిల్లాలు, తక్కిన జిల్లాలలో కొన్ని కేంద్రాలు బాగా స్పందించాయి. హైదరాబాదులో ఉస్మానియా క్యాంపస్ తప్ప వేరెక్కడా పెద్దగా స్పందన లేదు. నగరజీవనంతో అస్తవ్యస్తమవుతూ వుంటే కొత్త గొడవలు ఎవడికి కావాలి అనుకున్నారు. హైదరాబాదు ఎప్పుడూ అంతే. నిజాంకు, ఈస్టిండియా కంపెనీతో లేదా ఫ్రెంచ్‌వారితో యుద్ధాలు జరిగినపుడు అవన్నీ రాజధాని అవతలే జరిగాయి. నిజాం కోస్తా ప్రాంతాలను కంపెనీకి అప్పగించాడు. తర్వాత రాయలసీమను అప్పగించాడు. కర్ణాటకలో ప్రాంతాలను అప్పగించాడు. వాళ్లు ఒకరి అధీనంలో నుండి మరొక అధీనంలోకి వెళ్లారు. కానీ హైదరాబాదు మాత్రం ఎప్పుడూ రాజధానిగానే వుంది. ఆటుపోట్లకు అతీతంగా తన పని తను చేసుకుంటూనే పోయింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధపోరాటం జరిగింది. హైదరాబాదు మాత్రం ప్రశాంతంగానే వుంది. ఆ తర్వాత యూనియన్ సైన్యాలు వచ్చాయి. కమ్యూనిస్టులను వేటాడి, వేటాడి చంపేశాయి. అంతా పల్లెపట్టునే. హైదరాబాదు ప్రశాంతం. ఆ పల్లెప్రాంతాలను దోచుకునే నిజాం హైదరాబాదుపై పెట్టుబడి పెట్టాడు. అయినా తక్కిన ప్రాంతాల కష్టనష్టాలతో హైదరాబాదుకు ప్రమేయం లేదు. తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చింది, కొద్దికాలానికి మావోయిస్టు ఉద్యమం అన్నారు. తెలంగాణ జిల్లాలు అల్లకల్లోలం కావడంతో డబ్బున్నవాళ్లందరూ హైదరాబాదులో మకాం పెట్టారు. పొలాలు పోయినా ప్రాణాలు దక్కాయి.

1969లో విభజనోద్యమం జరిగింది. సమైక్యవాదులందరూ హైదరాబాదులో తలదాచుకున్నారు. 1972లో మరో విభజనోద్యమం జరిగింది. మళ్లీ సమైక్యవాదులందరూ హైదరాబాదులోనే మకాం పెట్టారు. 2001 నుండి మళ్లీ విభజనోద్యమం తలెత్తింది. తమ నియోజకవర్గాలకు వెళ్లడానికి దడిసే ప్రజాప్రతినిథులందరూ యిక్కడే మకాం. గత నెలగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం. అక్కడికి వెళితే రాజీనామాలంటూ వెనకబడతారన్న భయంతో యిక్కడే తిష్ట. సొంతూళ్లో ఎమ్మెల్యేల యిళ్లపై రాళ్లు పడవచ్చు కానీ హైదరాబాదు వాసాలపై ఏమీ పడవు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ యిక్కడ భాయ్‌భాయ్. డబల్ సేఫ్. ఎటొచ్చీ ఉస్మానియా యూనివర్శిటీవైపు మాత్రం వెళ్లకూడదు. హై కోర్టు కొద్దికాలం పాటు డేంజర్ జోన్‌గానే వుండేది కానీ సుప్రీం కోర్టు కన్నెఱ్ఱ చేశాక ఆ న్యాయవాదులు వేరే చోటకు వెళ్లి గొడవ చేస్తున్నారు తప్ప న్యాయస్థానం జోలికిి, న్యాయాధిపతుల జోలికి వెళ్లడం లేదు. తెరాస ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని రాజీనామాలు చేసినా, యిక్కడ ఆకు కదలదు. విభజనవాదులకు యిక్కడ పోటీ చేయడానికి భయం. బిజెపి తన నిజామాబాద్ ఎమ్మెల్యేచేత రిజైన్ చేయిస్తుంది కానీ అంబర్‌పేట ఎమ్మెల్యేను చేయనీయదు. మిలియన్ మార్చ్, సాగరహారం యిలాటి కార్యక్రమాలు పెట్టుకుంటే ‘చలో హైదరాబాద్, రెండు రోజుల ముందే హైదరాబాదు వచ్చేసి బంధువుల యిళ్లల్లో తలదాచుకుని ప్రదర్శనావేదికకు వచ్చేయండి’ వంటి పిలుపులు యిస్తారు. విగ్రహాలు విరిగినా, మరో అఘాయిత్యం జరిగినా దానికి నేతృత్వం వహించేది – మెదక్ ఎమ్మెల్యే, మెహబూబ్‌నగర్ ఎంపీ, సిరిసిల్ల ఎమ్మెల్యే ! వాళ్లంతా కలిసి నిజామాబాద్ ఎంపీని, రాజ్యసభ మెంర్నీ అల్లరిపెట్టారు. హైదరాబాదు ప్రతినిథులకు ఏ ప్రమేయమూ వుండదు. కానీ నష్టం జరిగేది హైదరాబాదు నగరశోభకు, బ్రాండ్ ఇమేజికి!

విశ్వసనీయత పెంచుకున్న హైదరాబాదు 
గతంలో కొంతకాలంపాటు హైదరాబాదు మతకలహాలకు పెట్టింది పేరుగా విలసిల్లింది. మాట్లాడితే కర్ఫ్యూ. వినాయకచవితి ఉత్సవాలు జరిగినా, పంఖా ఉత్సవాలు జరిగినా ఊరి జనానికి టెన్షన్. తెల్లవారేవరకూ యిరానీ హోటల్స్ తెరిచే వుండేవి. అసాంఘిక శక్తులకు అడ్డాగా వుండేవి. ఇల్లు అద్దెకిస్తే కదిలేవారు కారు. స్థలం కొంటే కబ్జా అయిపోయేది. గూండాల అండ చూసుకుని గుడిసెలు వేసేవారు. రాజకీయనాయకులు ఓట్లకోసం వారికి మద్దతు పలికేవారు. ఎన్టీయార్ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయి. శాంతిభద్రతల గురించి భయం పోయింది. ఇది ఉత్తరభారతీయులను విపరీతంగా ఆకర్షించింది. ఎక్కడ ఉద్యోగం చేసినా హైదరాబాదులో స్థిరపడసాగారు. చిన్నా చితకా కబ్జాలు తగ్గి, పెద్ద స్థాయిలో కబ్జాలు చేశారు కానీ ఫ్లాట్స్ నిర్మాణం పుంజుకుని, కొద్దిపాటి భద్రత ఏర్పడింది. రాష్ట్రంలో ప్రతి జిల్లా వారూ హైదరాబాదులో పెట్టుబడి పెట్టసాగారు. అప్పటిదాకా చిన్న నగరంగా వుండే హైదరాబాదు మెట్రో స్థాయిని చేరుకోసాగింది. చూస్తూండగానే స్థానికుల స్థలాలకు అనూహ్యమైన రేట్లు పలకసాగాయి. 

‘ఎవరో వచ్చి అభివృద్ధి చేసేదేముంది? నిజాం కాలంలోనే హైదరాబాదు దేశంలో ఐదో స్థాయిలో వుంది’ అని చెప్తూ వుంటారు. ఏ ప్రమాణాలలో ఐదోదో వారికే తెలియాలి. నా స్వానుభవం చెప్పగలను. 197లో శ్రీనగర్ కాలనీలో (అప్పట్లో దాన్ని బంజారా హిల్స్ రోడ్డు నెం.2 అనేవారు. వెళ్లాలంటే అమీర్ పేట వద్ద బస్సు దిగి కల్లు కాంపౌండ్ దాటుకుని వెళ్లవలసి వచ్చేది) గజం 12 రూ.ల చొప్పున స్థలం చూసి, బండలు ఎక్కువ వున్నాయని వదిలేశాను. తర్వాత బదిలీలపై యితర రాష్ట్రాలు తిరిగి 1995లో తిరిగి వచ్చేసరికి అక్కడ గజం 12 వేలు పలుకుతోంది! ఇప్పుడు అక్కడ ఎంత రేటుందో అడిగి చూడండి. అలాగే మాదాపూర్ విషయంలో కూడా దెబ్బ తిన్నాను. గజం 11 రూ.లకు తీసుకోబోయి తటపటాయించి, వదిలేశాను. రియల్ ఎస్టేటు బట్టి నగరం ఎదుగుదలను నిర్ధారించగలవా? అంటే ఔననే అనాలి. ఈ పీరియడ్‌లోనే పర్యావరణం నాశనం అయింది, నీరు కలుషితం అయింది. గాలి వేడెక్కింది. మానవహక్కులు హరించారు. అదీ ఒక అభివృద్ధా? అంటే అది వేరే విషయం. ఆ సూచికలు వేరు. ఆర్థికసంబంధమైన సూచికలు వేరు.  తీవ్రవాదులు యిటీవల కలవరపెడుతున్నారన్నా మామూలు ప్రజలందరికీ హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరమనీ, శాంతి, భద్రత వున్న నగరమనీ అర్థమైంది. చాలు.

హైదరాబాదుతో ముడిపడిన కుటుంబాలు – ప్రతీ గ్రామంలో!
రాష్ట్రంలోని ప్రతీ యింటినుండి ఎవరో ఒక కుటుంబసభ్యుడు హైదరాబాదులో వుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయం పూర్తిగా దైవాధీనం అయింది. ఎప్పుడు ఏ సూపర్ బజారు వచ్చి దెబ్బ కొడుతుందో లేదో తెలియక వ్యాపారాలను నమ్ముకోవడానికి లేకుండా వుంది. అందువలన గ్రామాలలో, పట్టణాలలో వున్న యువకులు ఏదో ఒక కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడం, హైదరాబాదు వచ్చేసి ఉద్యోగప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరు, ఎక్కణ్నుంచి వచ్చావు అని ఎవరూ అడగరు. మేం యిస్తున్న జీతానికి చెప్పిన పని చేస్తావా లేదా అని చూస్తారు. నువ్వు ఈశాన్యభారతం నుండి వచ్చినా సరే, వాయువ్యచైనా నుండి వచ్చినా సరే, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఉద్యోగాలు తెచ్చుకున్నవాళ్లు యింటికి డబ్బు పంపి అక్కడ పొయ్యిలో పిల్లి లేచేట్లు చూస్తున్నారు. కెసియార్ కరీంనగర్ ఉపయెన్నికలో నెగ్గిన దగ్గర్నుంచి, హైదరాబాదులో భయాందోళనలు ముప్పిరిగొన్నాయి. ఇక్కడున్నవారు బయటివారిని తరిమేస్తారేమోనన్న సందేహాలు మొదలయ్యాయి. నిజానికి హైదరాబాదు నుండి ఎవర్నీ తరిమివేయలేదు. తరుముతానని అంటున్నవారు హైదరాబాదేతరులే! 

హైదరాబాద్ వాసులకు భవిష్యత్తు గురించిన చింత 2009 డిసెంబరు 9 తర్వాత తారస్థాయికి చేరింది. ఇక్కడకు వచ్చే పెట్టుబడులు మందగించాయి. బంద్‌లు, షూటింగులపై దాడులు, నిరసనలతో పరిశ్రమలు వేరే చోటకి తరలి వెళ్లసాగాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలు కరువు కాసాగాయి. అయితే రాత్రికి రాత్రి ఏ ఉత్పాతమూ జరగదు కాబట్టి పరిస్థితి మెరుగుపడకపోయినా యింతకంటె దిగజారదులే అన్న నమ్మకంతో నగరవాసులు ఉగ్గబట్టుకుని చూస్తూ వున్నారు. ఇప్పుడు హఠాత్తుగా జులై 30 ప్రకటన వచ్చింది. హైదరాబాదు వాసుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే దాన్ని తెలంగాణకు రాజధాని చేస్తూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అనేశారు. ఉద్యోగులకు ఆప్షన్లు లేవు, గీప్షన్లు లేవు, తట్టాబుట్టా పట్టుకుని బయలుదేరడమే అని కెసియార్, ఇక్కడ ఉండాలంటే రాజీనామా చేయాల్సిందే అని హనుమంతరావు ప్రకటించేశారు. ఇక సీమాంధ్రలో ఆందోళన ప్రారంభమైంది. హైదరాబాదు చేజారిపోతే  మన గతి ఎలా? అది తప్ప రాష్ట్రంలో వేరే దిక్కు లేదే అని భయపడి ఉద్యమం చేస్తున్నారు. ‘ఇది ఉత్తుత్తి భయం, హైదరాబాదును తలదన్నేలా వేరే రాజధాని నిక్షేపంలా కట్టుకోవచ్చు’ అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. రేపు హైదరాబాదును వేరే రాష్ట్రం చేసి, యిక్కడి ఉద్యోగాలు స్థానికులేక అంటే తెలంగాణలోని యితర జిల్లాల వారికీ యిలాటి భయాలే కలుగుతాయి. ‘మీరూ కట్టుకోండి కొత్తగా తళతళలాడే రాజధాని, యీ కలుషితమైన నగరం మీకెందుకు’ అని హైదరాబాదు వారు తెలంగాణవారిని వెక్కిరించవచ్చు.

భాగ్యనగరవాసి ఆగ్రహం
ప్రస్తుతానికి మాత్రం సగటు హైదరాబాదు వాసి అసంతృప్తిగా, ఆగ్రహంగా వున్నాడు. రాష్ట్రం విడిపోతే హైదరాబాదు కళ తప్పుతుందన్న ఆందోళనతో వున్నాడు. నగరానికి వచ్చే ఫ్లోటింగ్ ట్రాఫిక్ తగ్గింది. సీమాంధ్రలో ఉద్యమం కారణంగా అంటున్నారు కొందరు. ‘అక్కడ ఉద్యమమే లేదు, సీమాంధ్ర మీడియా వాళ్ల వినోదం కోసం కాస్సేపు ఆటలాడి వెళ్లిపోతున్నారు’ అని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. ఉద్యమం లేకపోతే హైదరాబాదుకి రావడం ఎందుకు మానేశారంటారు? శత్రునగరంగా చూస్తున్నారా? ఏది ఏమైనా యీ పరిణామం పట్ల ఆటోవాళ్లు, టాక్సీవాళ్లు, హోటల్ వాళ్లు, ఆతిథ్యరంగం వాళ్లు సంతోషంగా లేరు. భారీగా ఖర్చు పెట్టి అలంకరణలు చేసి పెట్టుకున్న దుకాణాల వాళ్లలో గుబులు పట్టుకుంది. ‘ఇంత అవసరమా? హైదరాబాదుకు పోటీగా ఆంధ్రలో మరో రెండు నగరాలు తయారవుతే మన టర్నోవర్ తగ్గదా?’ అన్న ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి. ‘అలవాటు పడ్డ నగరం కాబట్టి యిక్కడికే వస్తారులే’ అని ధైర్యం చెప్పుకుందామన్నా యితర ప్రాంతాల నాయకులు హైదరాబాదులో హల్‌చల్ చేస్తూ శాంతిభద్రతల విషయంలో గాభరా కలిగిస్తున్నారు. 

ఇక్కడ పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు కూడా సమావేశం పెట్టుకోకూడదంటే ఎవరికైనా భయం వేయదా? తెలంగాణ ప్రకటన – అదీ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం – వస్తేనే యింతగా హెచ్చరిస్తున్నారే, రాష్ట్రం ఏర్పడ్డాక యింకేమవుతుందో, పోనుపోను యిది ఎక్కడివరకు పోతుందో అన్న భీతి కలగదా? అందరూ కలిసి హైదరాబాదును ధ్వంసం చేస్తే రాష్ట్రమంతా ప్రభావితం కాదా? ఏ వరంగల్లో, ఏ శ్రీకాకుళమో, ఏ కడపో దెబ్బ తింటే ఆ జిల్లా వరేక అది పరిమితం. కానీ హైదరాబాదు పతనమైందంటే రాష్ట్రమే అట్టడుక్కి వెళుతుంది. ఈ విషయం హైదరాబాదీలను కలత పెడుతోంది. హైదరాబాదు యుటీ అవుతుందా, ప్రత్యేకరాష్ట్రం అవుతుందా? జిఎచ్‌ఎంసి ప్రాంతమా? ఎచ్‌ఎండిఏ ప్రాంతమా? ఉమ్మడి రాజధానా? శాశ్వతమా? పదేళ్లా? అని నిరంతరం వాదనలు జరుగుతున్నాయి. ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిలో ఏది జరిగితే మంచిదో అనేదానిపై వివిధ ప్రాంతవాసులకు వివిధ అభిప్రాయాలు వుండవచ్చు కానీ హైదరాబాదు వాసులకు మాత్రం ఒక్కటే అభిప్రాయం – తక్కిన రాష్ట్రం ఏమైనా మేం సురక్షితంగా వుండాలి, ప్రత్యేకంగా వుండాలి అని. మా ఐడెంటిటీ కాపాడబడాలి అని. ఎందుకంటే హైదరాబాదీలలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వాసులందరూ వున్నారు. వీళ్లకు స్వీయరక్షణ ముఖ్యం. వీరి భయాలను తొలగించడానికి కేంద్రం ఏమీ చేయడం లేదు. ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు కేంద్రం చేతిలో, ఆస్తులు, అప్పుల విభజన, హైదరాబాదు ఆదాయంలో పంపకాలు – యిలా ఏ విషయంలోనూ క్లారిటీ యివ్వకుండా జులై 30 ప్రకటన వెలువడింది. వీటిలో దేనికి రాజ్యాంగ సవరణ అవసరమో, ఆ సవరణ పాస్ అవుతుందో లేదో తెలియదు. అంతా గందరగోళం.

ఉమ్మడి రాజధాని ఎందుకు సాధ్యం కాదు?
అసలు ఉమ్మడి రాజధాని అనే కాన్సెప్టే రాజ్యాంగంలో లేదట. హరియాణా విడగొట్టినపుడు కూడా ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదనకు రాష్ట్రం కావాలని ఆందోళన చేసిన హరియాణా నాయకులచేత ఔననిపించి, చండీగఢ్‌ను యూటీ చేసి వదిలేశారట. హరియాణా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే వాళ్లు ‘చండీగఢ్ మాది’ కావాలంటే పంజాబ్ వాళ్లనే పొమ్మనమను అని తీర్మానం చేసి కూర్చున్నారు. నలభై ఏళ్లయింది. ఆ వివాదం అలాగే వుంది. ఇప్పుడు హైదరాబాదు కూడా అలాగే వివాదాస్పదం చేయబోతారా? 

‘ఉమ్మడి రాజధాని ఎలా చేస్తారు? ఆంధ్రకు, హైదరాబాదుకు మధ్యలో రెండు జిల్లాలు వుండగా..’ అని కొందరంటారు. ఏ కమ్యూనికేషనూ, రవాణా లేని రోజుల్లోనే బ్రిటిషువాళ్లు ఎక్కడో ఇంగ్లండు నుండి మనల్ని పాలించారు – సమర్థవంతంగా! అన్ని రాష్ట్రాలలోని కేంద్రప్రభుత్వ ఆఫీసులూ ఢిల్లీ అధీనంలో చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల హెడాఫీసులు బొంబాయిలో వుంటే బ్రాంచీలు మారుమూల గ్రామాల్లో కూడా వున్నాయి. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే రాజరికపు రోజుల్లో అయితే  కోట బయట వేళ్లాడే ధర్మగంట కొట్టాలి కానీ యిప్పుడేముంది ఈమెయిల్ కొడితే చాలు. అధికార వికేంద్రీకరణ జరిగింది. ప్రజల వద్దకు పాలన, రచ్చబండ పేరుతో నేతలు వద్దన్నా ఊళ్లకు వచ్చి తిరుగుతున్నారు. అయినా హైదరాబాదును ఆంధ్రకు రాజధాని చేస్తే కొత్తగా వచ్చే నష్టం, కష్టం ఏమీ లేదు. ఇప్పుడెంత దూరం వుందో అప్పుడూ అంతే దూరం వుంటుంది. వేరే రాష్ట్రం ఏర్పడింది కదాని దూరంగా జరిగిపోదు. 

కొత్త రాజధాని అంటే అనుత్పాదక వ్యయమే
కొత్త రాజధాని కట్టడం అంటే ఏమిటి? భవనాలు నిర్మించడం. దానివలన కాంట్రాక్టర్లు బాగుపడతారు తప్ప ప్రజలకు ఏం కలిసి వస్తుంది? ఆ డబ్బుతో నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు కడితే మంచిది కదా. నిజాం గారు రాజు కాబట్టి తనకు, తన జనానాకు, బంధువులకు పెద్ద పెద్ద బంగళాలు, సమ్మర్ ప్యాలెస్‌లు, వింటర్ ప్యాలెస్‌లు కట్టించేసుకున్నాడు. అవన్నీ ప్రజాస్వామ్యంలో మనవి అయ్యాయి కాబట్టి వాటిల్లోనే ప్రభుత్వాఫీసులు పెట్టేసారు. ఇప్పుడు ప్రజాధనంతో అవన్నీ కట్టడమంటే వృథావ్యయమే కదా. లక్ష కోట్ల రూపాయలుంటే రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలన్నీ బాగుపడి పోతాయట. అలాటప్పుడు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు పెట్టి యీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బోల్డు సెక్యూరిటీతో బంగళాలు కట్టాలా? కేళీవిలాసాలకు రాజభవన్‌లు, తన్నుకోవడానికి ఎసెంబ్లీ భవనాలు, నిరసనలు తెలపడానికి అసెంబ్లీకి ముందు గాంధీ విగ్రహాలు, ఢిల్లీ వెళ్లడానికి విమానాశ్రయాలు నిర్మించాలా? ఇప్పటికే డబ్బులు చాలటం లేదంటూ పన్నులు వేస్తున్నారు. కొత్త రాజధానికి కొత్త రోడ్లు అంటూ ప్రయివేటు భాగస్వామ్యంతో రోడ్లు వేయించి టోల్ వసూలు చేస్తారు. జేబులు గుల్ల. ప్రజలపై యింత భారం మోపితే వారు సహిస్తారా? పాలకులకు యిది తెలియదా? 

అందుకే యుటి దిశగా కేంద్రం ఆలోచిస్తోందని పిటిఐ ఒక కథనాన్ని యిచ్చింది. ఎచ్‌ఎండిఏ పరిధిని మొత్తంగా తీసుకుని కేంద్రపాలిత రాష్ట్రంగా చేస్తే ఎన్నికలు జరిపి, స్థానిక రాజకీయనాయకులకు పదవులు పదిలంగా వుంటాయి కాబట్టి వారికి దానికి మొగ్గు చూపవచ్చు. సీమాంధ్రులు కూడా విభజన ఎలాగూ తప్పదు కాబట్టి యిది కొంతలో కొంత మేలు అని వూరుకోవచ్చు. కానీ తెలంగాణ నాయకులు వూరుకుంటారా? అన్నదే ప్రశ్న.  హైదరాబాదు కేంద్రంగా మరిన్ని ఆందోళనలు జరగడం తథ్యం. భాగ్యనగరవాసులు భాగ్యం ఎలా వుందో భవిష్యత్తే చెప్పాలి. 

ఎమ్బీయస్ ప్రసాద్