కుప్పంపై ఆంధ్ర‌జ్యోతి షాకింగ్ పోస్టుమార్టం

ఆంధ్ర‌జ్యోతి నిజాలు రాయ‌ద‌నే మాటే గానీ, రాస్తే మాత్రం దాని క‌థే వేర‌బ్బా.  కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చంద్ర‌బాబుతో పాటు టీడీపీ శ్రేణుల‌కు షాక్ ఇచ్చాయి. ఏకంగా 89 పంచాయ‌తీల‌కు గాను,…

ఆంధ్ర‌జ్యోతి నిజాలు రాయ‌ద‌నే మాటే గానీ, రాస్తే మాత్రం దాని క‌థే వేర‌బ్బా.  కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చంద్ర‌బాబుతో పాటు టీడీపీ శ్రేణుల‌కు షాక్ ఇచ్చాయి. ఏకంగా 89 పంచాయ‌తీల‌కు గాను, 74 స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు గెల‌వ‌డం, మ‌రోవైపు టీడీపీ మ‌ద్ద‌తుదారులు కేవ‌లం 14 స్థానాల‌కు ప‌డిపోవ‌డం కోలుకోలేని షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి.

కుప్పం ఫ‌లితాల‌పై నిన్న చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడిన అంశాల‌కు, నేడు ఆయ‌న సొంత ప‌త్రిక‌గా చెప్పుకునే ఆంధ్ర‌జ్యోతిలో వెలువ‌డిన క‌థ‌నానికి పూర్తి వైరుధ్యం ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు నింద‌లు మానుకుని, వాస్త‌వాలు గ్ర‌హించి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రాన్ని, ఆవ‌శ్య‌క‌త‌ను ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం ముక్కుసూటిగా చెబుతోంది. ముందుగా కుప్పం ఫ‌లితాలపై చంద్ర‌బాబు ఏమ‌న్నారో తెలుసుకుందాం.

‘కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోలేదు. ప్రజాస్వామ్యమే ఓడింది. నా నియోజకవర్గానికి కోట్ల రూపాయలు పంపి వెదజల్లారు. బయటి వ్యక్తులు వందల మంది వచ్చి అక్కడ కూర్చున్నారు. దీనిపై పోలీసులకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. కుప్పం ప్రజలు శాంతికాముకులు. 

శాంతియుత ప్రాంతాన్ని కూడా వైసీపీ నేతలు కలుషితం చేస్తున్నారు. ప్రభుత్వం దిగజారి కుప్పంలో నా పీఏపై కూడా కేసు పెట్టింది. విపరీతమైన ప్రలోభాలు పెట్టారు. వీటిపై ఏ చర్యలు లేవు.  ఉన్మాదంతో గుద్దుకొని అదే గెలుపని భ్రమిస్తున్నారు. కుప్పంలో గెలుపు సాధించి టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేసి మైండ్‌ గేమ్‌ ఆడాలని అనుకొంటున్నారు’ అని చంద్ర‌బాబు అన్నారు.

చంద్ర‌బాబుపై ఈగ వాల‌నివ్వ‌ని, జ‌గ‌న్ అంటే ప‌చ్చి వ్య‌తిరేక‌త‌తో రాసే ఆంధ్ర‌జ్యోతిలో కుప్పం పంచాయ‌తీ ఫ‌లితాల‌పై చేసిన పోస్టుమార్టం వాస్త‌వాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టింద‌ని …ఆ ప‌త్రిక‌ను వ్య‌తిరేకించే వారు చెబుతుండ‌డం విశేషం. ‘కుప్పంలో ఏం జరిగింది?’ శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతిలో క‌థ‌నం రాశారు. 

ఈ క‌థ‌నానికి వాడిన స‌బ్ హెడ్డింగ్స్ చ‌దివితే చాలు…మొత్తం సీన్ క‌ళ్లెదుట ఆవిష్కృత‌మ‌వుతుంది. ‘టీడీపీకి ఎందుకీ ప‌రాభ‌వం?’, ‘ప‌ట్టుకోసం వైసీపీ ప‌క్కా వ్యూహం’, ‘ఓడిస్తే సంక్షేమం క‌ట్ అనే ప్ర‌చారం’, ‘టీడీపీలో కాన‌రాని పోరాట ప‌టిమ‌’, ‘అభ్య‌ర్థుల‌కు అండ‌గా నిల‌వ‌ని నేత‌లు’, ‘ఆర్థిక‌, నైతిక మ‌ద్ద‌తు క‌రవు’…వీటిని చ‌దివితే చాలు …ఆంధ్ర‌జ్యోతి విశ్లేష‌ణ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక క‌థ‌నంలోకి వెళ్దాం.

‘కుప్పం నియోజకవర్గ పరిధిలో అత్యధిక గ్రామాలను సొంతం చేసుకోవాలన్న వైసీపీ పట్టుదల! ‘కుప్పంలో మనకు ఎదురే ముంది! జయం మనదే’ అని టీడీపీలో (అతి) ఆత్మ విశ్వాసం! ఈ రెండింటిలో వైసీపీ పట్టుదలే గెలిచింది. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం, వైసీపీ మద్దతుదారులను ఓడిస్తే సంక్షేమ పథకాలు ‘కట్‌’ చేస్తారనే భయం… టీడీపీలో లోపించిన పోరాట పటిమ! కుప్పం ‘పంచాయతీ’లో తెలుగుదేశం ఘోర వైఫల్యానికి ఇవే కారణమని విశ్లేషిస్తున్నారు’

‘కుప్పం నియోజక వర్గంలో తొలి నుంచీ వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గ్రామాల వారీగా మంగళవారం సాయంత్రం వరకు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. తమదైన శైలిలో సర్వే చేసుకుని… పోలింగ్‌కు ముందురోజు రాత్రి రంగంలోకి దిగి, అవసరమైన చోటల్లా మరోసారి ‘పంపకాలు’ చేపట్టారు. ఇలాంటి వ్యూహాలు, అప్రమత్తత టీడీపీలో కనిపించలేదు. వైసీపీ తరహాలో ఆర్థిక సహకారం అందకపోవడం, సొంతంగా ఆర్థిక బలం లేకపోవడంతో ఒక దశ తర్వాత టీడీపీ మద్దతుదారులు పూర్తిగా చేతులెత్తేశారు’

‘చంద్రబాబు అమరావతి కేంద్రంగా రాష్ట్రవ్యాప్త ఎన్నికలను పర్యవేక్షిస్తుండగా… ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నేతల్లో గెలిచి తీరాలన్న పోరాట పటిమ ఏమాత్రం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ… ‘పార్టీ బలంగా ఉంది. మన వాళ్లే గెలుస్తారు’ అంటూ చంద్రబాబును మభ్యపెట్టినట్లు కార్యకర్తలు చెబుతున్నారు’

ఇలా సాగింది ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థుల‌పై నింద‌లే వేయ‌డం మానేయాల్సిన అవ‌స‌రాన్ని ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం చెప్ప‌క‌నే చెబుతోంది. త‌న పార్టీలో వైఫ‌ల్యాల‌ను పెట్టుకుని, గెలుపును, ప్ర‌జాస్వామ్యాన్ని వ‌క్రీక‌రించేలా మాట్లాడ్డం చంద్ర‌బాబు లాంటి సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌కు గౌర‌వాన్ని ఇవ్వ‌దు. 

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది