ఫేస్ బుక్ లో పరిచయమైన పాకిస్తాన్ యువకుడి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్థాన్ కు వెళ్లింది అంజు. రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ చేరుకున్న అంజు, కేవలం స్నేహం కోసం ఈ పని చేసిందని ప్రారంభంలో అంతా అనుకున్నారు. కానీ పాక్ లో తన ఫ్రెండ్ నస్రూల్లాను కలిసిన ఆమె, అతడ్ని పెళ్లి చేసుకుంది.
పాక్ లో అంజు-నస్రుల్లా పెళ్లి ముస్లిం సంప్రదాయపద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తను కూడా ఇస్లాం స్వీకరించింది. తన పేరును ఫాతిమాగా మార్చుకుంది.
అలా 6 నెలలుగా పాక్ లో ఉన్న అంజు, ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టింది. తన కుటుంబ సభ్యుల్ని కలవాలని ఆమె అనుకుంటోంది. అంజూకు ఇదివరకే పెళ్లయింది. అరవింద్ అనే వ్యక్తితో ఆమె పెళ్లి జరిగి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఆమెకు 15 ఏళ్ల కూతురు, ఓ కొడుకు కూడా ఉన్నారు.
వీళ్లందర్నీ వదిలి పాక్ వెళ్లి నస్రూల్లాను పెళ్లి చేసుకోవడంతో అంజుపై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటి టైమ్ లో ఆమె తిరిగి భారత్ లో అడుగుపెట్టింది. పాక్ వెళ్లి పేరు మార్చుకొని పెళ్లి చేసుకున్న అంజును.. ఆమె కుటుంబం ఆదరిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరోవైపు అంజు కొత్త భర్త నస్రూల్లా వాదన మరోలా ఉంది. ఆమె తన పిల్లల్ని చూసేందుకు మాత్రమే భారత్ కు వెళ్లిందని, త్వరలోనే తన కోసం పాకిస్థాన్ కు తిరిగి వచ్చేస్తుందని అతడు చెబుతున్నాడు. ఈ మేరకు స్వయంగా తనే వాఘా సరిహద్దు వరకు వచ్చి అంజూను భారత్ లోకి పంపించాడు.
అంజూ చట్టబద్దంగానే పాక్ లోకి ప్రవేశించింది. తిరిగి చట్టబద్దంగానే ఇండియాకు వచ్చింది. అయితే ఆమె చేసిన పని స్థానికంగా కలకలం రేపింది. వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆమె భారత్ లో ఉండడం సేఫ్ కాదంటున్నాడు నస్రూల్లా. వీలైనంత త్వరగా తన భార్యను పాక్ కు పంపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.