అచ్చిరాని భాగస్వామ్యాలు

అఖిల్ సినిమా ఏజెంట్.. సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి. నిర్మాణ భాగస్వామి కూడా. కానీ సగంలోనే భాగస్వామ్యం వద్దని రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకని? నిర్మాణ వ్యయం పెరుగుతోంది. లాభాలు వచ్చే అవకాశం లేదనే…

అఖిల్ సినిమా ఏజెంట్.. సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి. నిర్మాణ భాగస్వామి కూడా. కానీ సగంలోనే భాగస్వామ్యం వద్దని రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకని? నిర్మాణ వ్యయం పెరుగుతోంది. లాభాలు వచ్చే అవకాశం లేదనే సీన్ అర్థం అయిపోయింది కనుక. కానీ అనవసరపు వార్తలకు అవకాశం ఇస్తుందని పేరు మాత్రం అలాగే వుంచారు.

భోళాశంకర్ సినిమాకు ముందు కెఎఎస్ రామారావు పేరు, ఆయన సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ పేరు పైన వుండేవి. కానీ ఏమైంది. నిర్మాణ వ్యయం పెరిగింది. సోలో సినిమాగా మారింది.

గాండీవధారి అర్జున సినిమా ఆరంభంలో వదిలిన పోస్టర్లు చూస్తే నాగబాబు సమర్పించు అని వుంటుంది. ఎందుకంటే సినిమాను రెమ్యూనిరేషన్ పద్దతిలో కాకుండా భాగస్వామ్య పద్దతిలో హీరో వరుణ్ తేజ్ చేయాలనుకున్నారు కనుక. కానీ వున్నట్లుండి పోస్టర్ల మీద నుంచి నాగబాబు పేరు మాయం అయింది. ఎందుకని? సినిమా ఖర్చు పెరిగిపోతోంది అని అర్థం అయింది కనుక.

రెమ్యూనిరేషన్ 8 కోట్లు అని ఫిక్స్ చేసుకుని, నాగబాబు పేరు తీసేసారు. కానీ ఇప్పటి వరకు వరుణ్ పే చేసింది మాత్రం ఆరు కోట్లే. కానీ ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయింది. నిర్మాతకు ఇరవై కోట్లు నష్టం తప్పలేదు. అందువల్ల ఇక ఆ రెండు కోట్లు అడగడం, ఇవ్వడం అనేవి వుండకపోవచ్చు.

విరూపాక్ష సినిమాది డిఫరెంట్ కేసు. ఈ సినిమాలో కూడా హీరో సాయి ధరమ్ నిర్మాణ భాగస్వామి. కానీ పేరు వేసుకోలేదు. సినిమా సక్సెస్ అయింది. లెక్కల దగ్గర తేడా వచ్చింది. నిర్మాత-హీరో ఎడమొహం..పెడమొహం అయ్యారు.

అంతకు ముందు జెర్సీ సినిమాలో నాని లాభాల్లో వాటా వంతున నటించారు. కానీ సినిమాకు లాభాలు తక్కువ వచ్చాయి. దాంతో రెమ్యూనిరేషన్ లెక్కల్లో చూసుకుంటే రెండు కోట్లు తక్కువ వచ్చింది. హీరో ఫీల్ అవుతున్నారని తెలిసి, నిర్మాత ఆ రెండు కోట్లు పట్టుకెళ్లి ఇచ్చేసారు.

మొత్తం మీద చూసుకుంటే హీరోలు, దర్శకులకు నిర్మాణ భాగస్వామ్యాలు అంతగా అచ్చిరావడం లేదేమో?