మేమంతా సిద్ధమంటూ ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి బస్సుయాత్ర ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సొంత పార్టీ నుంచి బస్సుయాత్రపై నిట్టూర్పులు. బస్సుయాత్ర నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
ఉదాహరణకు మొదటి రోజు బస్సుయాత్రనే తీసుకుందాం. ఈ నెల 27న ఇడుపులపాయలో మొదలైన బస్సుయాత్ర ప్రొద్దుటూరులో బహిరంగ సభతో కడప జిల్లాలో ముగించారు. అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆళ్లగడ్డకు బస్సుయాత్ర చేరుకుంది. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. కనీసం స్థానిక వైసీపీ నాయకులతో ఏం జరుగుతోందన్న మాటే జగన్ నుంచి లేకపోవడం నిరాశ పరిచింది.
నియోజకవర్గానికి 50 మందితో మాత్రమే జగన్ ఫొటోలు తీసుకుంటారనే నిబంధన విధించినట్టు సమాచారం. దీనివల్ల వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఆళ్లగడ్డ రాజకీయ పరిస్థితులపై కనీసం సిటింగ్ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డితో కూడా చర్చించిన పాపాన పోలేదు. మేధావులు, తటస్థులతో సమావేశం అంటూ మమ అనిపించారనే విమర్శలొస్తున్నాయి.
బస్సుయాత్ర ఉద్దేశమే… స్థానిక వైసీపీ నాయకులతో మాట్లాడ్డం. ఏవైనా అసంతృప్తులు వుంటే సర్దుబాటు చేయడం. అలాగే భవిష్యత్‌పై భరోసా కల్పించేలా స్థానికులను వెన్నుతట్టి ప్రోత్సహించడం. ఇలాంటివి మచ్చుకైనా జగన్ బస్సుయాత్రలో కనిపించలేదు.
గతంలో యువగళం పాదయాత్రలో లోకేశ్ తీరుతో పోల్చుకుంటున్నారు. లోకేశ్ అందరితో సెల్ఫీలు దిగడం, అలాగే గ్రామ, మండల స్థాయి నాయకులతో మాట్లాడుతూ వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఎంతోకొంత ఉత్సాహం నింపారు. జగన్ బస్సుయాత్ర ఇదే రీతిలో సాగితే మాత్రం… టైమ్ , ఖర్చులు వేస్ట్ అనే మాట వైసీపీ నేతల నుంచి వినిపిస్తోంది. లోపాల్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడమా? లేదంటే జగన్‌ను మభ్యపెట్టడమా? అనేది నిర్వాహకుల ఇష్టం.