శ్రీకాకుళం జిల్లాలో కీలక వైసీపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఆమె 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. విభజన వల్ల ఆమెకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. దాని కంటే ముందు 2009లో ఆమె జిల్లా టీడీపీ దిగ్గజ నేత ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.
ఆమెకు నాటి యూపీయే టూ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పదవి కూడా దక్కింది. 2014 ఎన్నికల ముందు ఆమెను వైసీపీ తమ పార్టీలోకి రావాలని కోరిందని చెబుతారు. ఆమె దానికి నిరాకరించారు అని అంటారు. ఆమె 2019 నాటికి మనసు మార్చుకుని వైసీపీ వైపుగా వచ్చారు. అప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. ఆమె రాజ్యసభ సీటు ఆశించారు. కానీ దక్కలేదు. ఆ అసంతృప్తి ఆమెకు ఉంది. ఆమె పార్టీని పటిష్టం చేయలేదని జిల్లా నేతలను కలుపుకుని పోలేదని అధినాయకత్వం భావించి ఆమె ప్లేస్ లో ధర్మాన క్రిష్ణదాస్ ని నియమించింది.
ఆ తరువాత ఆమె టెక్కలి అసెంబ్లీ సీటు కోరుకున్నారని ప్రచారంలో ఉంది. కానీ ఆమెను శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీ చేయించాలని భావించారు. మరి ఏమైందో తెలియదు శ్రీకాకుళం ఎంపీ, టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ఆమెకు ఇవ్వలేదు. దాంతో ఆమె వైసీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం అయ్యారు. తీవ్ర అసంతృప్తికి లోను అయిన కిల్లి కృపారాణి టీడీపీ వైపు వెళ్తారని అనుకున్నారు.
టీడీపీలో కూడా ఆమెకు కోరుకున్న సీట్లు దక్కవు. దాంతో కాంగ్రెస్ లో చేరితే బెటర్ అని ఆమె నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్ ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేశారని వార్తలు వచ్చాయి. ఆమె తొందరలోనే కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటులో ఆమె పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆమె కాకపోతే కుమారుడు విక్రాంత్ ని అయినా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆమె వైసీపీని వీడడం అయితే దాదాపుగా ఖాయం అయిపోయింది అని అంటున్నారు.