స‌ర్వే చేయ‌కుండానే అభ్య‌ర్థిని ఎంపిక చేశారా?

జ‌న‌సేన అంటే ఓ విచిత్ర‌మైన పార్టీ. టీడీపీ నాయ‌కుల్ని తీసుకొచ్చి, త‌మ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించుకుంటున్నారు. దీంతో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణా…

జ‌న‌సేన అంటే ఓ విచిత్ర‌మైన పార్టీ. టీడీపీ నాయ‌కుల్ని తీసుకొచ్చి, త‌మ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించుకుంటున్నారు. దీంతో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ అభ్య‌ర్థిగా రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన టీడీపీ ఇన్‌చార్జ్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ పేరును అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో మ‌రికొన్ని అంశాలున్నాయి.

అన్న‌మ‌య్య జిల్లా రైల్వేకోడూరు అభ్య‌ర్థి మార్పుపై స‌మాలోచన చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో ఏముందంటే… “రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే ఎన‌మ‌ల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటల్లో రైల్వే కోడూరు స్థానం అభ్య‌ర్థి మార్పుపై నిర్ణయం తీసుకుంటారు” అని పేర్కొన్నారు.

ఏ స‌ర్వే చేయ‌కుండానే ఎన‌మ‌ల భాస్క‌ర‌రావును అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించార‌ని… ఈ ప్ర‌క‌ట‌న చెబుతోంది. రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ రూపానంద‌రెడ్డి వ్య‌తిరేకిస్తుండ‌డం, అలాగే త‌మ అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కోర‌డంతో ప‌వ‌న్ తలొగ్గారు. టీడీపీ ఇన్‌చార్జ్ రూపానంద‌రెడ్డి స్వ‌గ్రామ‌మైన ముక్కావారిప‌ల్లె స‌ర్పంచ్ అరవ శ్రీధర్‌ను మూడు రోజుల క్రితం జ‌న‌సేన‌లో చేర్చుకున్నారు. ఆయ‌న‌కే టికెట్ ఇవ్వ‌డానికి ఖ‌రారైంది.

ఇప్పుడు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థిపై వ్య‌తిరేక‌త అంటూ కొత్త డ్రామాకు తెర‌లేపారు. భాస్క‌ర‌రావును కాద‌ని శ్రీ‌ధ‌ర్‌ను నిలిపితే జ‌న‌సేన‌కు కొత్త స‌మ‌స్య త‌ప్ప‌దు. ఆయ‌న్ను ప్ర‌తిపాదించిన నాయ‌కులంతా, శ్రీ‌ధ‌ర్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. దీంతో అభ్య‌ర్థిని మార్చిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం వుండ‌దు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌కు రైల్వేకోడూరు సీటు కేటాయించ‌డంపై చంద్ర‌బాబు సామాజిక వర్గం గుర్రుగా వుంది. టీడీపీ నాయ‌కుడు విశ్వ‌నాథ‌నాయుడు వ‌ర్గం జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అసంభ‌వం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు తెలియ‌క‌పోవ‌డంతో గంద‌ర‌గోళ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.