ఇంటి వద్దకే వలంటీర్లు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయకుండా అడ్డుకున్నది చంద్రబాబునాయుడే అని ఒకటికి వందసార్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి, మరీ పెన్షనర్ల ప్రాణాలు తోడేస్తున్నారని అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కడప నుంచి ఇచ్ఛాపురం వరకూ వైసీపీ నేతలు ఎవరు మాట్లాడినా చంద్రబాబును పెన్షనర్ల ద్రోహిగా ప్రజల ముందు నిలబెడుతున్నారు.
తాజాగా విజయవాడలో తూర్పు నియోజకవర్గ జోనల్ ఎన్నికల కార్యాలయాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్‌తో కలిసి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పింఛన్‌దారులను ఇబ్బందిపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని తూర్పారపట్టారు. శవ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబునాయుడు అని విమర్శించారు.
కుట్ర, నీచ రాజకీయాలకు చంద్రబాబునాయుడు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తుంటే అడ్డుకున్నది చంద్రబాబునాయుడే అని ఆయన తీవ్ర విమర్శ చేశారు. పేదలకు, సామాన్యులకు వైసీపీ సీట్లు ఇస్తుంటే, చంద్రబాబునాయుడు అవహేళన చేస్తున్నారని నాని తప్పు పట్టారు. ఈ ఎన్నికలు పూర్తి అవగానే చంద్రబాబునాయుడు తన సొంత రాష్ట్రమైన తెలంగాణకు పారిపోతాడని ఆయన విమర్శించారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తూర్పులో వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు. జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నట్టు అవినాష్ తెలిపారు.