వాలంటీర్లపై నిందలు వేస్తూ వచ్చి వాళ్లు యిళ్లకు వెళ్లి యివ్వాల్సిన పనేముంది? అంటూ రచ్చ చేస్తూ వచ్చి, యిప్పుడు పెన్షన్ల పంపిణీ సంక్షోభం వచ్చాక ఇప్పుడు మాత్రం గ్రామ సచివాలయాల సిబ్బందిని వాడుకోండి, వాళ్లను పెన్షనర్ల యిళ్లకు పంపండి అంటోంది టిడిపి. 1.35 లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులున్నారు. ప్రతీవాణ్నీ బయటకు తరిమి, తలా ఏభై మందికి యిచ్చి రమ్మనమంటే రెండు గంటల్లో అయిపోతుంది అంటున్నారు. ఇది నాకు అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు గతంలో ఐటీఐటీ అనేవారు. ఇటీవల రిమోట్, రిమోట్ (వర్క్ ఫ్రం హోమ్) అంటున్నారు. ‘ఇంటి దగ్గరే కూర్చుని పని చేసుకోండి, నెలకు లక్షా, రెండు లక్షల ఆదాయం వచ్చే ఉపాయం నేను చూపిస్తాను. సంపద సృష్టించడం నాకు వచ్చినంతగా వేరెవరికీ రాదు’ అని చెప్తున్నారు.
‘అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగుల విషయంలో యీయన రిమోట్ ఆప్షన్ అమలు చేయవచ్చు కానీ ప్రయివేటు కంపెనీలను యీయన ఎలా శాసించగలడా?’ అని ఆశ్చర్యపడుతూ వచ్చాను. ఇప్పుడు ప్రభుత్వోద్యోగులనే బయటకు వెళ్లమని ఎలా చెప్తున్నాడు? చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి, యిళ్ల దగ్గర పంపిణీ చేసే ఏర్పాటు చేసేయండి అని చెప్పేశాడట. అదో ఘనకార్యమని తెలుగు మీడియా చాటుతోంది. చెప్పడానికి హోదా ఏముంది కనుక? పైగా సాధ్యాసాధ్యాల గురించి డిస్కస్ చేశాడా? సచివాలయ సిబ్బంది ‘మేం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాం, మా యింటికి వచ్చి పెన్షన్ డబ్బులు పట్టుకెళ్లమని వాళ్లకు చెప్పండి’ అని బాబుకి చెప్తే..? ఈ అనుభవం తర్వాతైనా ఆయన రిమోట్ హామీ విషయంలో తమాయించుకుంటే మంచిది.
సచివాలయ సిబ్బందిని వాడుకోవాలన్న సలహా యిస్తూనే ‘వాళ్లు పనీపాటా లేకుండా ఉన్నారు’ అని కామెంట్ చేశారు చంద్రబాబు వీరాభిమాని ఐన మాజీ ఎంపీ. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు కాబట్టి, ఆ పార్టీ బతికిపోయింది. లేకపోతే ప్రస్తుతం వైసిపిపై కారాలూ, మిరియాలూ నూరుతున్న ఉద్యోగులు ఆ పార్టీపై కూడా నూరేవారు. తమది కాని పని చేసే ఉద్యోగిని నేనింకా చూడలేదు. బ్యాంకులో క్లర్కు ప్యూన్ పని చేయడు. కస్టమరు చెక్కు పోస్టు చేసి, లెడ్జర్ని పక్కన స్టూలు మీద పెట్టేవాడు. వెనక్కాల పదడుగుల దూరంలో ఉన్న ఆఫీసరుకి దాన్ని చేర్చవలసిన ప్యూన్ వచ్చేదాకా అది అక్కడ స్టూలు మీద పడి ఉండాల్సిందే! కస్టమరు లబలబ లాడినా ఏ లాభమూ ఉండేది కాదు. అలాగే ఆఫీసరు క్లర్కు పని చేయడు. ‘ఇప్పుడే బయటకు వెళ్లారండి, వచ్చేస్తారు. వెయిట్ చేయండి.’ అంటాడు. ఓ కౌంటరు క్లర్కు పక్క కౌంటర్ పని చూడడు. ప్రభుత్వాఫీసుల్లో పరిస్థితి దీని కంటె తరుగే కానీ, మెరుగు ఉండదు.
ఈ రోజు కేసులు వేసిన ఐఏఎస్‌లు, టీవీ చర్చల్లో వచ్చి సలహాలు యిస్తున్న ఐఏఎస్‌లు తమ స్థాయికి తక్కువైన పని ఎప్పుడైనా చేశారా? రిటైరయ్యాక కూడా సీనియారిటీ బట్టి గౌరవమర్యాదలు పొందుతూంటారు. మార్కెటింగు శాఖలో పోస్టింగు వచ్చిన ఉద్యోగి సంగతి సరే, ఫ్యాను కింది ఉద్యోగం తెచ్చుకున్న వాణ్ని ‘నువ్వు ఎండలో పడి తిరుగు’ అంటూ ఊరుకుంటాడో లేదో వీళ్లకు తెలియదా? ఏదైనా అదనపు పని యిస్తే ‘పోనీకదాని చేస్తే రేపణ్నుంచి దాన్ని కూడా తన రొటీన్‌లో కలిపేసి పని పెంచేస్తార’ని ఉద్యోగి భయపడతాడు. బాంకుల్లో కూడా పక్క కౌంటరు పని కూడా కాస్త చూడమంటే, దాన్ని సగంసగం చేసి, అసలు డెస్క్ క్లర్కు వచ్చాక అన్నీ సరిదిద్దుకో వలసి వచ్చేట్లా చేస్తారు. లేకపోతే రెండు కౌంటర్లూ యిక నువ్వే చూడమంటారని భయం.
ఇప్పుడీ సచివాలయ సిబ్బంది కూడా అంత కంటె బాగా చేస్తారని అనుకోవడానికి లేదు. ఇప్పుడీ పంపిణీ భారం తమ నెత్తిన వేసుకుంటే టిడిపి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసి, వాళ్ల పన్లన్నీ తమ నెత్తిన రుద్దుతారనే బెదురు ఉంటుంది. అందువలన సాధ్యమైనంత చెత్తచెత్తగా చేసి వీళ్ల వలన కాదులే అనిపిస్తారు. ఆఫీసుకి వస్తేనే యిలా చేస్తే, యింటికి వెళ్లి యిమ్మంటే యింకేం చేస్తారో తెలియదు. అడ్రసు దొరకలేదండీ అంటూ వెనక్కి వచ్చేసినా వచ్చేయగలరు, వడదెబ్బ కొట్టిందండి అంటూ రెండు రోజులు సిక్ లీవ్ పెట్టేయగలరు. ఇవన్నీ తెలిసే చీఫ్ సెక్రటరీ గారు ‘ఆఫీసుకి వచ్చిన వాళ్లకైనా యివ్వండి చాలు’ అన్నారు. ఇప్పుడు టిడిపి వాళ్ల ఆరోపణేమిటి? ఎన్నికల కమిషనర్ వాలంటీర్లు లేకుండా చేయండి అన్నారు తప్ప పెన్షన్లను యింటికి పంపిణీ చేయవద్దని చెప్పలేదు, యిదంతా చీఫ్ సెక్రటరీ గారి నిర్వాకమే, ఆయనే జనాల్ని మంచాల మీద ఆఫీసులకు తెప్పిస్తున్నాడు అంటున్నారు. వాలంటీర్లు లేకుండా యింటికి పంపిణీ చేయగలరా? అని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీని అడిగిందా?
ఆ మధ్య ఆంధ్ర హైకోర్టు వారు అమరావతి అద్భుత నగరాన్ని ఆర్నెల్లలో కట్టేయండి అని ఆంధ్ర సర్కారును ఆదేశించారు. సాధ్యాసాధ్యాల సంగతి ఆలోచించకుండా యీ న్యాయమూర్తులు యిలాగే ఆదేశాలిచ్చేస్తారు అంటూ బ్యూరోక్రాట్లు చిర్రుబుర్రు లాడారు. మరి ఈ కమిషనర్ కూడా బ్యూరోక్రాటేగా, ఆయనైనా సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఉండాలిగా.., ఉంటారుగా. ఆయన యిళ్లకు యిమ్మనమని స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఏది సాధ్యమో దాన్ని చీఫ్ సెక్రటరీ చేస్తున్నారు. టీవీల్లో మాట్లాడేవాళ్లు కూడా ఏదైనా చెప్తే ఆచరణ సాధ్యమైనది చెప్పాలి. కొందరు ఎటిఎమ్‌లకు వెళ్లి తీసుకోవచ్చుగా అంటున్నారు. పైన చెప్పినట్లు గత కొన్నేళ్లగా ఎటిఎమ్‌ల నిర్వహణ తగలడింది. పైగా అవి ఎంత దూరంలో ఉన్నాయో తెలియదు. పెన్షన్ విషయంలో మూణ్నెళ్లు వరుసగా తీసుకోకపోతే రద్దు చేసేస్తారనే నియమం ఉందనుకుంటా. అందువలన సంతకాలు తప్పనిసరి అయి వుంటాయి. ఎటిఎమ్‌లైతే చనిపోయినవారి పేర ఎవరైనా విత్‌డ్రా చేసేయగలుగుతారు. తక్కిన పథకాలన్నీ బటన్ నొక్కి డిబిటి ద్వారా యిస్తున్నా పెన్షన్ విషయంలో ఫిజికల్‌గా పంపిణీ చేయడానికి యిదే కారణ మనుకుంటున్నా.
ప్రభుత్వనిర్వహణ గురించి ప్రతిపక్షం ఎప్పుడూ సలహాలివ్వదు. పథకం అమలులో తడబాట్లు వస్తే దాన్ని చూపించి ఎన్‌క్యాష్ చేసుకోవచ్చని సంతోషిస్తుంది కూడా. కానీ పెన్షన్ల పంపిణీ విషయంలో టెన్షనంతా టిడిపియే పడుతోంది. ఎందుకంటే ఈ నెల పెన్షన్ల పంపిణీ యిబ్బందికి తాము నింద మోయాల్సి వస్తుందని దాని భయం. ఇబ్బంది పడుతున్నామన భావన బాధితులకు కలగకుండా వైసిపి ఏదో చేయాలన్న పేరాశ తోడైంది. వైసిపి అలా ఎందుకు చేస్తుంది? ప్రజలెంత యిబ్బంది పడితే ప్రతిపక్షాలంత డిఫెన్సివ్‌లోకి వెళతాయని దానికి తెలుసు. ఇబ్బంది పడకపోతే వాలంటీరు వ్యవస్థ దండగమారిది, యిన్నాళ్లూ దాని మీద బోల్డంత అనవసరంగా తగలేశారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తాయని తెలుసు. అందువలన వైసిపి యిలాగే ప్రవర్తిస్తుందని టిడిపి, జనసేన ముందే ఊహించాల్సింది. ‘నాన్నకు పెళ్లవుతోందన్న సంబరమే కానీ, సవతి తల్లి వస్తోందన్న స్పృహ లేదు’ అనే సామెత ఉంది. ఇప్పుడు సాక్షి టీవీ నిండా మంచాల మీద సచివాలయానికి వస్తున్న పెన్షనర్ల ఫోటోలే! ఇది టిడిపి వారు ముందుగా గెస్ చేసి ఉండాల్సింది.
సౌకర్యం ఆపించారని టిడిపిని, ఆదుకోగలిగి కూడా ఆదుకోవటం లేదని వైసిపిని ప్రజలు తిట్టుకుంటున్నారో, లేక యిదంతా తమ కర్మమనుకుని సరిపెట్టుకుంటున్నారో తెలియదు. అది తేలేదాకా నిమ్మగడ్డ వారు బయటకు తొంగి చూడరు. నిజానికి తను అనుకున్న డెమోక్రసీ పరిరక్షణ జరిగినందుకు యీ పాటికి ఆయన కాలరెగరేసి ప్రెస్‌మీట్ పెట్టాలి. కానీ ఎక్కడా కానరావటం లేదు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్లు ఎందరు బయటకు వచ్చి ధీరోదాత్తులుగా పోజు కొడతారో తెలియదు. ఎన్నికల కమిషన్‌కు చెప్పి వైసిపికి ముకుతాడు వేశామన్న సంబర పడ్డారు కానీ యిలా బూమెరాంగ్ అవుతుందని టిడిపి హితులు ఆలోచించలేదు. విడిగా చూస్తే ధర్మం, న్యాయం, సమతూకం, ఔచిత్యం గట్రా, ఎట్సెట్రా అని పేర్లు పెట్టవచ్చు కానీ వాలంటీర్ల పట్ల టిడిపి, జనసేనల వైఖరి గమనంలోకి తీసుకుని కలిపి చూస్తే మాత్రం వాలంటీర్లపై కోపంతో, అనుమానంతో తమకు కష్టం తెచ్చిపెట్టారని పెన్షనర్లు అనుకున్నా అనుకోవచ్చనే సందేహం వారికి కలుగుతోంది.
కథ అడ్డం తిరిగాక, యిప్పుడు దాన్ని మలుపు తిప్పి నిలువుగా చేద్దామని చూస్తున్నారు. డిబిటి పద్ధతిలో పెన్షన్లివ్వండి అని అనాలోచిత సలహా పడేశారు పురంధేశ్వరి. గ్రామగ్రామానా బ్యాంకులున్నాయా? ఎటిఎమ్‌లున్నాయా? వాలంటీర్లకు బదులుగా జనసైనికులు వెళ్లి పెన్షన్లు యివ్వాలని పవన్ పిలుపు నిచ్చారు. టిడిపి కార్యకర్తలు పెన్షనర్లను దగ్గరుండి ఆఫీసులకు తీసుకెళ్లవచ్చు అంటున్నారు కొందరు టిడిపి నాయకులు. ఉగ్రనారసింహుడి దగ్గరకు చెంచులక్ష్మిలా సచివాలయాల వద్ద పడిగాపులు కాచే పెన్షనర్ల వద్దకు మజ్జిగ గ్లాసులతో వెళుతున్నారు టిడిపి వారు. ఎన్నికల ప్రచారం పనులు మానుకుని, యీ సపర్యలు చేయవలసిన పనెందుకు పెట్టుకున్నారు? వాలంటీర్లు యింటికెళ్లి పెన్షన్లివ్వడం వైసిపి ప్రాపగాండా అయితే, జనసేన, టిడిపి కార్యకర్తలు యివ్వడం వృద్ధజన సేవ అవుతుందా? సేవలందించాక, మా పార్టీని కాస్త గుర్తుంచుకోండి అని చెపుతున్నారేమో అనే సందేహం ఎన్నికల కమిషన్‌కు వస్తే…?
టిడిపి, జనసేనలకు వాలంటీర్ల గుణగణాల గురించి స్థిరాభిప్రాయం ఉన్నట్లు తోచదు. వాలంటీర్లు అమ్మాయిల ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ యీ మధ్య కూడా అన్నారు. ఆయనకు ఆవేశం, ఆయాసం, అస్వస్థత వస్తాయి తప్ప దేన్నయినా లాజికల్ కన్‌క్లూజన్‌కు తీసుకురావాలనే ఆలోచన మాత్రం రాదు. ఉద్దానం బాధితుల గురించి కడుపు తరుక్కుపోతోందని అన్నాడు. అక్కడ వైసిపి ప్రభుత్వం ఆసుపత్రులు కట్టిస్తే అవి బాగున్నాయనో, బాగాలేవనో, చాలవనో ఏదో ఒకటి అనాలిగా. లేదు, ఆ సినిమా రీలు అయిపోయింది. ప్రస్తుతం నడుస్తున్నది వాలంటీ‘రీలు’. ఓ అభాండం వేశారు, దాని గురించి కేసు పెట్టారా? వాలంటీరు వ్యవస్థ వచ్చే ముందు యింతమంది మాయమయ్యారు, తర్వాత యింతమంది పెరిగారు అని గణాంకాలిచ్చారా? అబ్బే.
ఈయన వరస యిలా ఉంటే, కూటమి భాగస్వామి చంద్రబాబు ట్రాఫికింగ్ మాట అనరు కానీ, వ్యవస్థ భ్రష్టు పట్టించారంటారు. తాము వస్తే వాలంటీర్ల జీతాలు పెంచుతామంటారు. ఓ జోక్ ఉంది. ఓ పిల్లాడు తల్లితో అడుగుతూంటాడు – ‘పక్కింటి ఆంటీని నేనేమని పిలవాలో నువ్వూ నాన్నా ఓ మాట అనుకుని చెప్పండి. నువ్వు అత్తయ్యా అని పిలవమంటావు, నాన్న పిన్నీ అని పిలవమంటాడు’ అని. అలా కూటమి వాళ్లు వాలంటీర్లు దుర్మార్గులని కాస్సేపు, ‘అయ్యో పాపం, ఐఏఎస్‌లకు వెళ్లవలసిన కుర్రాళ్లను ఐదు వేల ఉద్యోగంలో కుదేసి వారి భవిష్యత్తును జగన్ చెడగొడుతున్నాడు’ అని కాస్సేపు అంటారు. ఐదు వేలు ఏం సరిపోతాయి? పెట్రోలు డబ్బులకే రాదది అంటారు. ఐఏఎస్ స్టాండర్డ్ వాళ్లు, గోల్డ్ మెడలిస్టులు వాలంటీరు ఉద్యోగానికి వస్తారని నేననుకోను. దారిద్ర్యం వలన వచ్చినా, నెలలో వాలంటీరింగుకి ఎన్ని గంటలు పడుతుంది? తక్కిన సమయమంతా చదువుకోవచ్చు. 50 యిళ్లు తిరగడానికి ఎంత పెట్రోలు కావాలి? సైకిలు మీద నైనా తిరగవచ్చు.
అయినా ఆ లెక్కలు వేసుకునేది ఆ వ్యక్తి. ఇంతకంటె మంచి ఆఫర్ ఉంటే ఆ పనే చేస్తాడు. దీనిలో ఉన్న ఎడ్వాంటేజిలు అతనికి నచ్చి ఉంటాయి. సొంత ఊళ్లో ఉంటాడు. 50 యిళ్ల వాళ్లతో కలిగిన పరిచయాలతో వాళ్లకు చిన్న పనులు చేసి, అదనంగా సంపాదించుకోవచ్చు. ఇన్సూరెన్సులు చేయించవచ్చు, రియల్ ఎస్టేటు డీలింగ్స్ చేయవచ్చు. పబ్లిక్ రిలేషన్స్‌ను లాభదాయకంగా మలచుకోవచ్చు. బోడి ఐదువేల జీతానికి యిన్ని అభాండాలు మోయాలా అనుకుంటే మానేయవచ్చు. వాలంటీరు చేసే పనేముంది? అదేదో సచివాలయ సిబ్బంది చేయవచ్చు అంటున్న టిడిపి వారు మరి వాలంటీర్ల జీతాలు పెంచుదామని ఎందుకనుకుంటున్నారు?
వాళ్లు ఓటర్లను ప్రభావితం చేస్తారన్న సందేహమే వాళ్లను అయోమయంలోకి నెడుతోంది. మనియార్డర్ తెచ్చి యిచ్చిన పోస్ట్‌మన్‌కు కృతజ్ఞులుగా ఉంటామా? పంపిన నాన్నకు కృతజ్ఞులుగా ఉంటామా? ప్రభుత్వ పథకాల విషయంలోనైతే ‘ముఖ్యమంత్రి వాళ్ల యింట్లోంచి యిస్తున్నాడా? మాదే మాకు యిస్తున్నాడు’ అని ఓటర్లు అనేస్తున్న యీ రోజుల్లో పంపిన వాడి మీదైనా కృతజ్ఞత ఉంటుందని అనుకోలేము. పైగా వాలంటీరుకి వైసిపి మీద అభిమానం ఉండాల్సిన పనేముంది? ఎవరి హయాంలో తనకు ఉద్యోగం వచ్చిందో ఆ పార్టీపై ఉద్యోగికి కృతజ్ఞత ఉంటుందా? నెవర్. పార్టీ అభిమానాలు మారిపోతూనే ఉంటాయి. ఐదేళ్లగా మా జీతాలు పెంచలేదు అనే కోపం వాలంటీర్లలో ఉందేమో ఎవరికి తెలుసు? ‘వాలంటీర్లు మా వాళ్లే’ అని ధర్మాన, విజయసాయి అనవచ్చు కానీ ‘వైసిపి మాదే’ అని వాలంటీర్లు అనలేదుగా. ‘నా బిసి, నా ఎస్సీ, నా మైనారిటీ’ అని జగన్ అనవచ్చు కానీ ఆ వర్గాల వారందరూ ‘మా జగన్’ అని అనాలని లేదుగా! ధర్మాన మాట పట్టుకుని వాలంటీర్లందరూ ఉత్తి పుణ్యాన వైసిపి కార్యకర్తలుగా పని చేస్తారని తీర్మానించడం తెలివితక్కువ.
మీడియా మాటలు వినేసి, వాలంటీర్లు సమాచారం సేకరించి యిచ్చేస్తున్నారని కొందరు అనేస్తూంటే నాకు నవ్వు వస్తుంది. ఆధార్ కార్డు నెంబరు లేదా మొబైల్ నెంబరు ఉంటే చాలు, మీ జాతకమంతా బయటివాళ్లకి తెలిసిపోతోంది. పెన్షనర్ల ఆ వివరాలు ఎప్పుడో సేకరించి ఉంటారు. అలాటిది ప్రతీ నెలా వచ్చి సమాచారం తాజాగా సేకరించాలా? ఏమిటి సేకరిస్తారు, ఏముందని సేకరిస్తారు నా బొంద! పార్టీ అభిమానాలు పర్మనెంటా? మొన్నటిదాకా టిడిపి అంటే పడి చచ్చినవాడు కూడా యివాళ వాళ్ల బామ్మ వడదెబ్బ కొట్టి చచ్చిపోతే అభిప్రాయం మార్చుకోవచ్చు. ఈ భయమే టిడిపిని ఉక్కపోతకు గురి చేస్తోంది. పెన్షనర్ల కంటె తీవ్రంగా వడదెబ్బ తగులుతున్నది వాళ్లకే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)