బీజేపీ వత్తిడి… విశాఖ పీటముడి!

విశాఖ ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ఇవ్వాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర బీజేపీ పెద్దలతో వారు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో విశాఖ ఎంపీ…

విశాఖ ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ఇవ్వాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర బీజేపీ పెద్దలతో వారు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో విశాఖ ఎంపీ సీటు పంచాయతీ కాస్తా ఢిల్లీకి చేరుకుంది.

జీవీఎల్ నరసింహారావు తనకు ఎందుకు విశాఖ ఎంపీ సీటు రాదు అని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకుల సూచనల మేరకే తాను విశాఖకు మూడేళ్ల క్రితం వచ్చానని పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆయన అంటున్నారు. విశాఖ సీటు బీజేపీకి న్యాయంగా ఇవ్వాల్సిందే అంటున్నారు.

బలమున్న చోట సీటు ఇవ్వకపోతే పొత్తులెందుకు అని బీజేపీ నేతలు అంటున్నారు. జీవీఎల్ కి విశాఖ సీటు ఇచ్చే విషయంలో కేంద్ర నాయకత్వం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో బీజేపీ జాతీయ పెద్దలు మాట్లాడుతున్నారని అంటున్నారు.

విశాఖ సీటు విషయంలో టీడీపీ కూడా పట్టుదలగా ఉంది. బాలయ్య చిన్నల్లుడికి ఏడాది క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పనిచేసుకోమని చెప్పేశారు. ఆయన ఇప్పటికే అన్ని రకాలుగా ఖర్చు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇపుడు ఈ దశలో ఆయనను మార్చడం అయ్యే పనేనా అన్నది టీడీపీ శిబిరంలో ఉంది.

విశాఖ ఎంపీ సీటు విషయంలో జీవీఎల్ మాత్రమే కాదు బీజేపీ అగ్ర నేతలు కూడా పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. దేశంలోని 543 ఎంపీ సీట్లలో అతి ముఖ్యమైన సీట్లలో విశాఖ కూడా తమకు ఒకటి అని బీజేపీ భావిస్తోంది. ఈ సీటు ఇవ్వాల్సిందే అని అంటోంది. దాంతో టీడీపీకి ఇరకాటంగా ఉంది అని అంటున్నారు.

గతసారి స్వల్ప తేడాతో ఓటమి పాలు అయిన శ్రీభరత్ కి ఈసారి పోటీకి ముందే సీటు ఉంటుందా లేదా అన్న డౌట్లు తమ్ముళ్లకు వస్తున్నాయి. బీజేపీకి ఈ సీటు ఇస్తే టీడీపీలో కూడా రచ్చ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. బాలయ్య తన అల్లుడికి సీటు ఇవ్వకపోతే ఊరుకోరని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ వత్తిడితో టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. జీవీఎల్ ఢిల్లీ నుంచి నరుక్కు వస్తున్నారని అన్నీ అనుకూలంగా ఉంటే బీజేపీకే విశాఖ సీటు అని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.