భారత రాష్ట్ర సమితి నుంచి ప్రజాప్రతినిధులు కాంగ్రెసులోకి వలస వెళుతున్న పరిణామాల పట్ల పాపం.. కల్వకుంట్ల తారక రామారావు ఖిన్నులు అవుతున్నట్టుగా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం తప్ప భారాస మొత్తం ఖాళీ అవుతుంది అని హెచ్చరికలు చేసి మరీ.. కాంగ్రెసు అటు నుంచి వలసలను ఆహ్వానించడం ప్రారంభించింది.
ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇంకా ఎందరు వెళ్తారో క్లారిటీ లేదు. నిజానికి చాలామంది వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఎంపీ ఎన్నికల అవసరాల దృష్ట్యా ఇద్దరిని మాత్రమే కాంగ్రెస్ తమ జట్టులో కలుపుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే కేటీఆర్ కంగారు పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతున్నదని, ఇతర పార్టీల తరఫున ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారిని, ఆ పదవులకు రాజీనామా చేసిన తర్వాత గానీ.. కాంగ్రెసులో చేర్చుకోబోమని గతంలో వారు ప్రకటించారుట. వారు ఇప్పుడు మాట తప్పుతున్నారు కాబట్టి.. తమ పార్టీ నుంచి తీసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలతో ముందుగా రాజీనామా చేయించి ఆ తర్వాత వారిని పార్టీలో చేర్చుకోవాలని.. దానం నాగేందర్, కడియం శ్రీహరి లను ఉద్దేశించి కేటీఆర్ తన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
కాంగ్రెసు గతంలో అలాంటి మాట చెప్పి ఉండవచ్చు. కానీ.. దాని గురించి అడిగే నైతిక హక్కు కేటీఆర్ కు ఎక్కడుంది? వాళ్లు రాజీనామా చేయించి భారాస ఎమ్మెల్యేలను తమలో చేర్చుకుంటూ ఉంటే.. గతంలో ఎన్నడూ తాము అలాంటి మాట చెప్పలేదు గనుక.. రాజీనామా చేయించకుండా కాంగ్రెసు వారిని ప్రలోభ పెట్టి తమలో చేర్చుకోవడానికి గులాబీదళం తమ ప్రయత్నాలను ప్రారంభిస్తుందా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.
కేటీఆర్ కు అంత ముచ్చటగా ఉంటే.. తటస్థులు మేధావి వర్గాల నుంచి ఎవరినైనా ఎంచుకుని వారిద్వారా ఇలాంటి ప్రశ్నను రేవంత్ సర్కారుకు, కాంగ్రెసు పార్టీకి సంధించి ఉండాల్సింది. కానీ.. నైతికవిలువలు అనేపదంతోనే తమకు సంబంధం లేదన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన పార్టీ నాయకుడిగా.. ఇప్పుడు కాంగ్రెస్ వారు చెప్పిన ఒక మాటను పట్టుకుని వారిని డిమాండ్ చేయడానికి అసలు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. ప్రత్యేకించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి.. కాంగ్రెస్ ను తాము ఏండిమాండ్ చేసినా సరే.. ప్రజలు నవ్వుతారనే వెరపు వారికి లేదా? అనే సందేహం కలుగుతోంది.