భీమిలీలో అంత ఈజీ కాదు !

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ని టీడీపీ ఎట్టకేలకు కేటాయించింది. సీటు దొరికింది కానీ గెలుపు అన్నది ఖాయం కాలేదు అంటున్నారు. ఎప్పటిలాగా ఈసారి భీమిలీ కానే కాదు అని రాజకీయంగా…

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ని టీడీపీ ఎట్టకేలకు కేటాయించింది. సీటు దొరికింది కానీ గెలుపు అన్నది ఖాయం కాలేదు అంటున్నారు. ఎప్పటిలాగా ఈసారి భీమిలీ కానే కాదు అని రాజకీయంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఆయన ప్రత్యర్ధి మాజీ మంత్రి వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు కూడా బలమైన వారే. ఆయనకు గంటా మాదిరిగానే వ్యూహాలు పన్నడం తెలుసు. నీవు ఒకటి అంటే నేను రెండు అంటారు అవంతి. గంటా అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండి ఏమి చేశారు అని అవంతి ప్రశ్నిస్తున్నారు.

ఆయన గెలిచాక తన మాదిరిగా జనంలో తిరిగారా అసలు కనిపించారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక గంటా అవంతిల మధ్య రాజకీయ పోటీ కొత్తగా సాగుతోంది. వైసీపీ నుంచి ఒక నేతను గంటా టీడీపీలో చేర్చుకుంటే ధీటుగా అవంతి టీడీపీ నుంచి మరో నేతను వైసీపీలోకి తెస్తున్నారు.

అంతేకాదు గంటా వైసీపీ వైపు చూస్తే తాను టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్పిస్తాను అంటున్నారు. టీడీపీ అసమ్మతి నేతల విషయంలో అవంతి పావులు కదుపుతున్నారు వారిని తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తెలిసి గంటా ఎన్నడూ లేని విధంగా వారి ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగిస్తునారు. తనతో పాటు నడవాలని కోరుతున్నారు.

అలాగే జనసేన నేతల విషయంలో వైసీపీ దృష్టి సారించింది. గంటాకు టికెట్ ఇవ్వడం జనసేనలో వారికి ఇష్టం లేదు. వారంతా ఇపుడు సైలెంట్ అయిపోయారు దాంతో వైసీపీ వారిని తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోంది. 2014 లో గంటా భీమిలీలో ఏకపక్షంగా గెలిచారు. ఆనాడు ఆయన మీద పెట్టిన వైసీపీ అభ్యర్ధి జోరు చేయలేకపోవడం కూడా ఉపకరించింది.

ఇపుడు పోటీలో ఉన్నది ఒకనాటి గంటా సహచరుడే. గంటా గురించి పూర్తిగా తెలిసిన వారే కావడంతో గంటా తనతోనే తాను యుద్ధం చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ఇక్కడ మరో పోలిక కూడా ఉంది. గంటా ఓటమెరుగని వీరుడిగా చెప్పుకుంటారు. అవంతి కూడా అంతే. ఆయన కూడా ఎపుడూ ఓడిపోలేదు. దాంతో ఇద్దరిలో ఈసారి ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడుతారు. ఆ ఓడే వారు ఎవరు. ఓడించే వారు ఎవరు అన్నదే భీమిలీలో అందరిలోనూ హై టెన్షన్ పెడుతోంది.