కాకర గురించి మోడీకి ఆ మాత్రం తెలీదా?

ప్రత్యర్థులను నిందించడం ఒక్కటే ఆధునిక రాజకీయ ప్రచార సూత్రం. మేమెంత గొప్పవాళ్లమో చెప్పుకోవాలనే తపన కంటె ఎక్కువగా, తమ ప్రత్యర్థులు ఎంతగా పనికిరాని వాళ్లో చాటిచెప్పడమే తమను విజయతీరాలకు చేరుస్తుందని నమ్మేవాళ్లు ఎక్కువగా మనకు…

ప్రత్యర్థులను నిందించడం ఒక్కటే ఆధునిక రాజకీయ ప్రచార సూత్రం. మేమెంత గొప్పవాళ్లమో చెప్పుకోవాలనే తపన కంటె ఎక్కువగా, తమ ప్రత్యర్థులు ఎంతగా పనికిరాని వాళ్లో చాటిచెప్పడమే తమను విజయతీరాలకు చేరుస్తుందని నమ్మేవాళ్లు ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 400+ సీట్లు సాధిస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ కూడా.. అదే సూత్రం పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మొత్తంగా కలిపి తిట్టడానికి ఆ పార్టీ కాకరకాయ లాంటిది అని ఆయన అభివర్ణిస్తున్నారు. నేతిలో వేయించినా, పంచదారతో కలిపి వండినా కాకర రుచి మారదట. అందువల్ల కాంగ్రెసు పార్టీ కాకరకాయ అని మోడీ చెబుతున్నారు.

అయితే మోడీ విమర్శకు కౌంటర్లు వినిపిస్తున్నాయి. ఎలాగంటే.. ‘దేనితో కలిపి వండితే, దాని మాదిరిగా రుచి మార్చుకోవడం అంటే అవకాశ వాద లక్షణం కదా.. కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశవాద పార్టీ కాదు.. స్థిరత్వం స్థిరబుద్ధి ఉన్న పార్టీ, బిజెపిలాగా చంచలత్వం ఉన్నది కాదు’ అని కాంగ్రెస్ అభిమానులు కొందరు కౌంటర్లు వేస్తున్నారు.

అదే మాదిరిగా.. ‘కాకరకాయ చేదుగా ఉండవచ్చు గాక.. కానీ అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రుచికి ఉండే ప్రాధాన్యం కొంత వరకు మాత్రమే.. కానీ అల్టిమేట్ గా ఆరోగ్యానికి కదా ప్రాధాన్యం దక్కవలసింది. ఆ విషయానికొస్తే కాకరకు మించి మన ఆరోగ్యానికి మేలుచేసేది మరొకటి ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. దేశానికి మేలు చేసే పార్టీ అది..’ అని కూడా కాంగ్రెస్ అభిమానులు మోడీకి కౌంటర్లు ఇస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తూ ఉండడంతో.. రోజుకో కొత్త రకం విమర్శలను వెతుక్కుంటూ ఆరాటపడడం పార్టీలకు పెద్ద ప్రయాస అవుతోంది. తన ప్రసంగాలతోనే ప్రజలను సమ్మోహితులను చేయగలను అనుకునే నరేంద్రమోడీ కూడా ఆ బాటలోనే.. కాంగ్రెస్ ను కొత్తకొత్తగా వింతవింతగా తిట్టడానికి, కొత్తరకం నిందలు వేయడానికి ఆరాటపడుతున్నట్టున్నారు.. అని పలువురు భావిస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ మాత్రం.. కాంగ్రెసు పార్టీ గురించి పదేళ్ల కిందట ఏ పాట పాడుతూ అధికారంలోకి వచ్చారో.. ఇప్పటికే అదే బాటను అనుసరిస్తున్నారు. దేశంలో ఉండే సమస్త అవ్యవస్థలకు, అరాచకాలకు మూలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అని ఇప్పటికీ ఆయన పాచిపోయిన పాట పాడుతున్నారు.

నిజమే కావొచ్చు గాక.. కానీ.. పదేళ్లుగా అధికారం వెలగబెట్టి.. ఆ అరాచకాల్ని సరిదిద్దకుండా ఇప్పటికీ కాంగ్రెస్ ను నిందించడం ద్వారా మాత్రమే మనుగడ కావాలని కోరుకునే వైఖరి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.