జ‌న‌సేన న‌టుల సంఘం…!

విజ‌య‌వాడ వెస్ట్ జ‌న‌సేన మాజీ ఇన్‌చార్జ్ పోతిన మ‌హేశ్ ఎట్ట‌కేల‌కు వైసీపీలో చేరారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో మ‌హేశ్ వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో…

విజ‌య‌వాడ వెస్ట్ జ‌న‌సేన మాజీ ఇన్‌చార్జ్ పోతిన మ‌హేశ్ ఎట్ట‌కేల‌కు వైసీపీలో చేరారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో మ‌హేశ్ వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌న‌సేన అనేది రాజ‌కీయ పార్టీ కాద‌న్నారు. అదొక న‌టుల సంఘ‌మ‌ని వెట‌క‌రించారు. న‌టులెప్పుడూ రాజ‌కీయ నాయ‌కులు కాలేర‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

విజ‌య‌వాడ‌లో పెత్తందారి అయిన సుజ‌నాచౌద‌రిని ఓడించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెత్తందారుల ప‌క్షాన నిల‌బ‌డి, పార్టీకి నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసిన వారి రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఉరితాడు వేసిన జ‌న‌సేన‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను, వ్య‌క్తిత్వాన్ని చంపేయ‌డం వ‌ల్లే పార్టీని వీడామ‌న్నారు. రాజ‌కీయ పున‌ర్జ‌న్మ కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల ర‌థ‌సార‌థి, అభివృద్ధి కోసం ప‌రిత‌పించే సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరామ‌న్నారు.

గ‌తంలో జ‌న‌సేన నాయ‌కుడిగా విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, అలాగే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డాన్ని వ్య‌క్తిగ‌తంగా చూడొద్ద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌శ్నిస్తేనే ప‌నులు అవుతాయ‌న్నారు. ఇందులో త‌న రాజ‌కీయ స్వార్థం లేద‌న్నారు. వ్య‌క్తిగతంగా త‌న‌కు ఎవ‌రిపైన ద్వేషం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఒక న‌టుడి కింద ప‌నిచేసి, న‌మ్మి మోస‌పోయామ‌న్నారు. ఇంత‌కంటే మోసం, ఘోరం ఎక్క‌డైనా వుంటుందా? అని ఆయ‌న నిల‌దీశారు. వైసీపీలో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ అద్భుతంగా వుంటుంద‌ని పోతిన మ‌హేశ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. భ‌విష్య‌త్‌లో ఆశ క‌లిగించేలా సీఎం జ‌గ‌న్ త‌న‌తో మాట్లాడిన‌ట్టు పోతిన చెప్పారు. త‌న‌ను ఒక కొడుకులా భావించి వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి త‌మ పార్టీలోకి వ‌స్తే బాగుంటుంద‌ని చెప్పార‌ని మ‌హేశ్ తెలిపారు.