ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, అలూరు టీడీపీ మాజీ ఇన్చార్జ్ వైకుంఠం మల్లిఖార్జున్, మరో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు త్వరలో వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యినట్టు తెలిసింది.
అలాగే మంత్రాలయం టికెట్ తనకు కాకుండా మాధవరం రాఘవేంద్రరెడ్డికి ఇవ్వడంతో టీడీపీ ఇన్చార్జ్ తిక్కారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలిసింది. ఈయన వైసీపీలో చేరుతారా? లేక ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా కేఈ ప్రభాకర్ టీడీపీని వీడితే డోన్‌లో టీడీపీకి భారీ దెబ్బ. డోన్, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు ఇవ్వాలని చంద్రబాబునాయుడిని కేఈ ప్రభాకర్ అడిగారు. కానీ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. పత్తికొండలో ప్రభాకర్ అన్న కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్‌బాబు బరిలో ఉన్నారు. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ససేమిరా అన్నారు.
ఈ నేపథ్యంలో కేఈ ప్రభాకర్‌ను వైసీపీలో చేర్చుకుని కర్నూలు ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదట మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఎంపీగా వెళ్లడం ఇష్టం లేని జయరాం… ఆ తర్వాత కాలంలో వైసీపీ వీడి టీడీపీలో చేరారు. గుంతకల్లు సీటును దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అనంతరం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ప్రకటించారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు రామయ్య నిరాసక్తత చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన స్థానంలో కేఈ ప్రభాకర్‌ను నిలిపితే ఎలా వుంటుందనే కోణంలో వైసీపీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. కర్నూలు ఎంపీగా కేఈ ప్రభాకర్ పోటీ చేస్తే… డోన్‌లో పెద్దగా ఉపయోగం ఉండదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే నంద్యాల పార్లమెంట్ పరిధిలో డోన్ వుంటుంది.
కేఈ కుటుంబానికి డోన్‌లో బలం వుంది. అలాంటప్పుడు కర్నూలు నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం వుండదనే వాదన వైసీపీలో ఒక వాదన. అందుకే కేఈ ప్రభాకర్‌ను చేర్చుకోవడంపై జాప్యం జరుగుతోంది. చివరికి ఏమవుతుందో చూడాలి.