ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నాలుగు అసెంబ్లీ టికెట్లను అధినాయకత్వం ఇచ్చింది. అందులో ముగ్గురికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వెంటనే టికెట్లు దక్కాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారుగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం సీటుని వైసీపీ నుంచి వంశీకి ఇచ్చారు.
పెందుర్తి అసెంబ్లీ టికెట్ ని కూడా వైసీపీ నుంచే వచ్చిన పంచకర్ల రమేష్ కి కేటాయించారు. అన్ని పార్టీల నుంచి వచ్చిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ అనూహ్యంగా దక్కింది. ఇదిలా ఉంటే ఇందులో ఒక్క రామకృష్ణ తప్ప మిగిలిన ముగ్గురు జనసేన అభ్యర్ధులు ఖర్చుకు వెనకడుగు వేస్తున్నారు అని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయట.
ప్రత్యర్ధి పార్టీ వైసీపీ ఈ విషయంలో దూసుకుని పోతూంటే జనసేన అభ్యర్ధులు ముగ్గురు మాత్రం ఇంకా నిదానంగా ఉండడంతో ఇలాగైతే ఎలా అని పార్టీలో వారే అంటున్నారుట. ఎన్నికలు అంటే మంచినీళ్ళ ప్రాయంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో రోడ్ షో నిర్వహించారు. దానికి అయ్యే ఖర్చుని అనకాపల్లి ఎంపీ అభ్యర్ధితో పాటు ఎమ్మెల్యే అభ్యర్ధి పెట్టుకున్నారని అంటున్నారు. అదే ఊపులో పెందుర్తి విశాఖ సౌత్ ఎలమంచిలిలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది.
రోజు వారీ కార్యక్రమాలకే ఖర్చులు చూసుకుంటున్న ఈ ముగ్గురు అభ్యర్థులు అధినేతలను రోడ్ షోలకు ఎపుడు పిలుస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఇటీవల వచ్చిన ఉగాది ని అలాగే రంజాన్ పేరిట ఇఫ్తార్ విందులను వైసీపీ అభ్యర్ధులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జనంలోకి వెళ్ళి ఆయా వర్గాలను ఆకట్టుకుంటున్నారు.
అదే విధంగా డోర్ టూ డోర్ కాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఈ ముగ్గురు అభ్యర్ధులు వెనకబడ్డారని అంటున్నారు. జీరో పాలిటిక్స్ బడ్జెట్ తో రాజకీయాలు చేయదలచుకున్నారా అన్న అనుమానాలు సొంత పార్టీకే కలుగుతున్నాయట. అలాగైతే ప్రత్యర్ధి పార్టీని తట్టుకోవడం ఎలా అన్నది ఆలోచించాలని హితైషులు హెచ్చరిస్తున్నారుట. నోటిఫికేషన్ తరువాత జోరు చేస్తారేమో చూడాలని అంటున్నారు.