ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాళ్లు కేంద్రంగా రాజకీయ రచ్చ సాగుతోంది. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన దాడిలో ఆయనతో పాటు పక్కనే వున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా తీవ్రగాయమైంది. దీంతో సీఎం వైఎస్ జగన్‌ను అంతమొందించాలనే కుట్ర జరుగుతోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇదే సందర్భంలో విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుపై, అలాగే తెనాలిలో వారాహియాత్రలో ఉన్న పవన్‌పై రాళ్లు వేశారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు చురకలు అంటించారు.
సీఎం జగన్‌పై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందో అనే భయాందోళన టీడీపీలో కనిపిస్తోందన్నారు. అందుకే చంద్రబాబునాయుడు సింపతీ పొందేందుకు తనపై తాను రాళ్లు వేయించుకున్నారని దెప్పి పొడిచారు. గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఇదే రకంగా తనపై రాళ్ల దాడి చేశారని చంద్రబాబు డ్రామా ఆడారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలిపిరిలో ఆయనపై నక్సలైట్లు దాడి చేశారన్నారు. ఆ దాడితో తనపై సింపతీ వస్తుందని భావించిన చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. అయితే చంద్రబాబుకు జనం ఓట్లు వేయలేదన్నారు. సింపతీతో గెలవలేమని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించాలని పెద్దిరెడ్డి హితవు చెప్పారు. తండ్రి నీచంగా మాట్లాడుతుంటే, ఆయన కుమారుడు లోకేశ్ మరింత నీచంగా ప్రవర్తిస్తున్నారని పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు.