విజయవాడలో దాడి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం మళ్లీ జనంలోకి వచ్చారు. దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులతో వైఎస్ జగన్ కీలక కామెంట్స్ చేశారు. జగన్‌ను కలిసిన నాయకులు మీడియాతో మాట్లాడారు. తమతో జగన్న అన్న మాటల్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు.
ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని, మళ్లీ అధికారం మనదే అని నాయకులతో జగన్ అన్నారు. బస్సుయాత్ర సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుండడం వల్లే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా ముందడుగు వేద్దామని నాయకుల్లో స్ఫూర్తి నింపారు.
ప్రజాశీస్సుల వల్లే దాడి నుంచి తప్పించుకున్నట్టు జగన్ తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బస్సుయాత్రకు వెల్లువెత్తుతున్న జన స్పందన తెలియజేస్తోందని జగన్ అన్నారు. బస్సుయాత్ర 15వ రోజుకు చేరుకుంది. 16వ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో అడుగు పెట్టనున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో జగన్ యాత్రకు ప్రజాస్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే ఆ రెండు జిల్లాలపైనే కూటమి ఆశలు పెట్టుకుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో వచ్చే సీట్ల ఆధారంగా అధికారం ఎవరికనేది ఆధారపడి వుంటుంది. చూడాలి ఏమవుతుందో.