ప్రాంతాలుగా విడిపోయినా, హైదరాబాద్, తెలంగాణ అన్నవి ఆంధ్ర జనాలకు విడదీయలేని బంధాలు. ఈ రోజు ఆంధ్రలో వుంటే రేపు హైదరాబాద్ లో వుండడం సర్వ సాధారణమైపోయింది. అలాగే తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర వారికి ఫుల్ గా పరిచయం. కేసీఆర్ ఓటమి తెలుసు. కాంగ్రెస్ విజయమూ తెలుసు. కాంగ్రెస్ విజయానికి మూలమైన ఆరు హామీలు తెలుసు. ఎన్నికల అనంతరం వాటిని పక్కన పెట్టిన వైనమూ తెలుసు.
ఆంధ్రలో కూడా ఇదే ఆరు హామీల ప్రాతిపదికగా ముందుకు వెళ్తోంది. హామీల విషయంలో చంద్రబాబు క్రెడిబులిటీ తెలిసిందే. ఇప్పుడు ఇచ్చిన వాటిలో అలవి కాని హామీలు వున్నాయనీ తెలిసిందే. ఇప్పటికే ఆంధ్ర అలవికాని అప్పులు చేసింది అంటున్న విపక్షాలు, రేపు అధికారంలోకి వస్తే ఈ పాత- కొత్త హామీలు నెరవేర్చడానికి ఎంత కావాలి అన్నది తెలిసిందే.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ హామీలకు ఎన్ని రూల్స్ అడ్డం పెడతున్నదీ ఆంధ్ర జనాలు చూస్తున్నారు. అక్కడ రైతు బంధుకు ఎన్ని తూట్లు పడుతున్నాయో గమనిస్తున్నారు. బస్ ఫ్రీ తప్ప మిగిలిన హామీల గతి ఏమిటో గమనిస్తున్నారు. ఇప్పుడు ఇది ఆంధ్ర ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం వుంది. కిందా మీదా పడినా జగన్ హామీలు నిలబెట్టుకున్నారు. కానీ చంద్రబాబుకు ఆ క్రెడిబులిటీ లేదు.
క్రెడిబులిటీ అన్నది చంద్రబాబుకు లేకపోవడం, అదే సమయంలో తెలంగాణలో అలవి కాని హామీలు ఇచ్చి, అమలు చేయకపోవడం, అదే తీరుగా హామీలు ఆంధ్రలో ఇవ్వడం ఇవన్నీ జనాలను కాస్త ఆలోచింపచేసే అవకాశం వుంది. దానివల్ల జగన్ నుంచి సంక్షేమ ఫలాలు అందుకున్నవారు, అటే మొగ్గు చూపే అవకాశమూ వుంది.