ఎవరైనా మందు తాగితే వాస్తవాలు మరిచిపోతారు. ఈనాడు మాత్రం మందు వార్తలు రాసేటప్పుడు గతాన్ని మరిచిపోతుంది. తాను అగ్ని పునీత అయ్యినట్టు నీతులు చెబుతుంది. పూర్తిస్థాయి పచ్చ కామెర్లతో గంతులేస్తుంది. తాను ప్రజాపక్షం అని, తాను రాసింది సిసలైన జర్నలిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.
20వ తేదీ శనివారం ఈనాడు బ్యానర్ వైకాపా వైన్స్. సీఎం సభలకి లక్షల సంఖ్యలో మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారట. ఏ బస్సులో చూసినా మద్యమే. మరి అదే నిజమైతే ఈనాడు ఈ పాటికి ఫొటోలతో ప్రత్యేక సప్లిమెంట్ వేసేది.
నిజానికి మద్యం పంపిణీ లేకుండా ఏ సభా నడవడం లేదు. చంద్రబాబు, పవన్, లోకేశ్ సభల్లో మద్యానికి బదులు మజ్జిగ పంపిణీ చేస్తున్నారా? ఆ విషయం సాంప్రదాయిని ఈనాడే చెప్పాలి. అసలు ఈ మద్యం పంపిణీకి బీజం వేసిందెవరు? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందెవరంటే ఆ పాపం చంద్రబాబు, ఈనాడుదే.
1992, 93లో ఉదయం పత్రిక మాగుంట చేతుల్లోకి వెళితే, తనకి పోటీ వస్తాడని ఈనాడు భయపడింది. అందుకే ఆయన ఆర్థిక మూలమైన మద్యం మీద దెబ్బ కొట్టడానికి సారా ఉద్యమం ప్రారంభించింది. జనం కూడా ఈనాడుని నమ్మారు. ప్రజల పక్షం నిలిచే పత్రికని అపోహ పడ్డారు. కుట్రని తెలుసుకోలేకపోయారు.
1994లో ఎన్టీఆర్ చిత్తశుద్ధితో మద్య నిషేధం అమలు చేశారు. ఎన్టీఆర్ దగ్గర పప్పులు ఉడకకపోయే సరికి లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి చంద్రబాబుని కుర్చీ ఎక్కించింది. పోటీ లేకపోయే సరికి ప్రతి పేజీలోనూ అబద్ధాలు రాసినా జనం నమ్మారు.
మద్యం మీద ఆదాయం ఎలా వస్తుందో చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకని కల్తీ మద్యం, అక్రమ రవాణా, నిషేధం వల్ల నష్టాలు ఈ వార్తలు ఈనాడు బ్యానర్లగా మారాయి. మద్యం పైన ఉక్కు పిడికిలి నాటకం ఆడిన రామోజీ తన ఫిల్మ్ సిటీ హోటళ్లలో మాత్రం మద్యం ఆపలేదు.
నిషేధం ఎత్తివేతకి గేమ్ స్టార్ట్ అయ్యింది. మొదట లిమిటెడ్గా షాపులు, ప్రతి మంగళవారం సెలవు. తర్వాత బార్లు. ఇలా ప్రతి జిల్లాలో టీడీపీ మద్యం సిండికేట్లు బలపడ్డాయి. ఆ నేపథ్యంతో ఎదిగిన వాళ్లే ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కేంద్రంలో ప్రభుత్వాలు పడిపోయి వరుసగా మధ్యంతర ఎన్నికలు రావడంతో తన స్థానాన్ని పదిలం చేసుకోడానికి ఓటర్కి క్వార్టర్ బాటిల్ పథకం పెట్టిందే చంద్రబాబు. సభలకి వచ్చే జనానికి మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు ప్రభుత్వం. వీటి గురించి ఒక్కరోజు కూడా రాయని ఈనాడు ఈ రోజు వైకాపా వైన్స్ అని రాస్తోంది.
మద్యం విషయంలో జగన్ మాట తప్పింది నిజం. నిషేధం అసాధ్యం. ఎందుకంటే సమాజం, మద్యం రెండూ కలగలిసి పోయాయి. దీనికి పునాది వేసిన చంద్రబాబుని ఒక్క మాట అనకుండా జగన్ మీద విరుచుకుపడడం ఈనాడు ప్రత్యేకత.