వైఎస్ జగన్మోహన్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు మధ్య విశ్వసనీయతకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు అనే నమ్మకాన్ని చూరగొన్నారు. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే … రాజకీయ అవసరాల కోసం ఏదైనా చెబుతాడు, ఏదీ చేయడనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాళ్లిద్దరి విశ్వసనీయతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రధానంగా ఈ ఎన్నికలు జగన్, బాబు విశ్వసనీయత మధ్యే జరుగుతున్నాయనే చర్చకు తెరలేచింది. వైసీపీ తాజా మేనిఫెస్టోలో కొత్త పథకాలేవీ లేవు. ఏవో ఒకట్రెండు మినహాయిస్తే, మిగిలివన్నీ యధాతథంగా కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ల పెంపు మాత్రమే ప్రకటించారు. వీటిలో పెన్షన్ల పెంపు విషయానికి వస్తే… 2028, 2029వ సంవత్సరాల్లో జనవరి 1న మాత్రమే చేస్తానని ప్రకటించారు. ఇది జగన్ నిజాయతీకి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇదే చంద్రబాబు దగ్గరికి వస్తే ఏప్రిల్ నుంచి రూ.4 వేలు చొప్పున పెన్షన్ పెంచి ఇస్తానని నమ్మబలుకుతున్నారు. అయితే చంద్రబాబు గత చరిత్ర చూస్తే… వంచన, నమ్మక ద్రోహం తప్ప మరేదీ కనిపించదు. అందుకే సీఎం వైఎస్ జగన్ ప్రతి రోజూ తన ఎన్నికల ప్రచారంలో 2014 ఇదే కూటమి మేనిఫెస్టో చూపుతూ చాకిరేవు పెడుతున్నారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు … చేశారా? అని నిలదీస్తున్నారు. ఇంత వరకూ చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం.
అలాగే వైఎస్ జగన్ తన మేనిఫెస్టో ప్రకటించే సందర్భంలో బడ్జెట్ ఎంతవుతుంది? సాధ్యాసాధ్యాలపై ఎంతో స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే వైసీపీ మేనిఫెస్టోపై ప్రత్యర్థులు సైతం విమర్శలు చేయలేకున్నారు. కానీ చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయాలంటే రూ.1.75 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. టీడీపీ-జనసేన కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా… ఇవన్నీ అమలు చేయాలంటే బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారనే మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బాబు నుంచి దబాయింపే సమాధానం కావడం గమనార్హం.
ఏం జగన్ ఏమైనా సాక్షి, భారతి ఫ్యాక్టరీల నుంచి డబ్బు తీసుకొచ్చి పెడుతున్నారా? అని తన మార్క్ దబాయింపులకు తెగబడ్డారు. అదేమంటే సంపద సృష్టించి, సంక్షేమాన్ని అందిస్తామని చెప్పడం ఆయనకే చెల్లింది. ఇదే నిజమైతే, 2014లో ఇచ్చిన హామీలను ఎందుకు హామీలు చేయలేకపోయారో సమాధానం చెప్పేందుకు మొహమెత్తడం లేదనే మాట వినిపిస్తోంది. ఆచరణతో సంబంధం లేకుండా, ఏదో రకంగా అధికారంలోకి రావడమే పరమావధిగా చంద్రబాబు భావించి, మేనిఫెస్టో ప్రకటించారనే చర్చకు తెరలేచింది. దీనికి బీజేపీ మద్దతు లేకపోవడం.. టీడీపీ-జనసేన కూటమి మేనిఫెస్టోపై నీళ్లు చల్లినట్టైంది. దీంతో మేనిఫెస్టో అమలుపై సందేహాలు నెలకున్నాయి.
బాబుకు విశ్వసనీయత లేదని తెలిసే, బీజేపీ కూడా జాగ్రత్త పడింది. ప్రతి విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ రాజకీయాలు కనిపిస్తాయి. బాబుకు విశ్వసనీయత లేకపోవడమే జగన్కు ఎన్నికల అస్త్రమైంది. ఎన్నికల ప్రచారంలో జగన్ 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయకపోవడంపై పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు కేజీ బంగారం ఇస్తానని చెబుతున్నాడని, నమ్మొద్దని జగన్ ప్రచారం చేస్తున్నారు. తనను నమ్మకపోయినా, భారీ లబ్ధి కలిగిస్తానంటే జనం ఆశ పడతారని చంద్రబాబు విశ్వాసం. ప్రజల నిర్ణయమే తేలాల్సి వుంది.